తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Earthquake In Ap : ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు.. బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

Earthquake in AP : ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు.. బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

21 December 2024, 11:47 IST

google News
    • Earthquake in AP : ఇటీవల తెలుగు రాష్ట్రాలను భూప్రకంపనలు భయపెడుతున్నాయి. ఇదే నెల మొదట్లో తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించింది. తాజాగా.. ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. శనివారం ఉదయం రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.
ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు
ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు (istockphoto)

ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో ప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. తాళ్లూరు మండలం గంగవరం, తాళ్లూరు, రామభద్రపురం, ముండ్లమూరు మండలం శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడులో భూప్రకంపనలు వచ్చాయి. భూప్రకంపనలు రావడంతో.. ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు.

ఇటీవల తెలంగాణలో..

డిసెంబర్ మాసం మొదటి వారంలో తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించింది. ఉదయం 7:30 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూమి లోపల దాదాపు 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు.. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వివరించింది. దీని ప్రభావంతో... ములుగు, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, విజయవాడ సహా చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి.

తెలుగు రాష్ట్రాల్లో సాధారణమే..

తెలుగు రాష్ట్రాల్లో తరచూ భూకంపాలు వస్తుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. కానీ రిక్టర్ స్కేల్‌పై 3 లేదా 4 తీవ్రతకు మించి ఉండవని అంటున్నారు. ఈ స్థాయిలో వస్తే ఎలాంటి ప్రమాదం ఉండబోదని స్పష్టం చేస్తున్నారు. సుమారు 55 ఏళ్ల కిందట భద్రాచలంలో భూకంపం వచ్చింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. ఆ స్థాయిలోనే మేడారం కేంద్రంగా భూకంపం వచ్చిందని శాస్త్రవేత్తలు వివరించారు.

భూకంపాలు ఎందుకు వస్తాయి..

భూమిలో ప్రధానంగా 16 రకాల పలకలు ఉంటాయి. ఇవి ప్రతిరోజూ వివిధ దిశల్లో పయనిస్తుంటాయి. ప్రస్తుతం భారతదేశం ఉన్న ఫలకం ఉత్తర దిశలో ఏటా 5 సెంటీమీటర్లు పయనించి ఆసియా పలకతో ఢీకొంటుంది. ఇలా ఢీకొనే క్రమంలో ఒత్తిడి ఏర్పడి పలక లోపలికి విస్తరిస్తుంది. అప్పుడు భూమి లోపల పొరలు, పగుళ్లు లేదా ఫాల్ట్స్ ఉంటాయో అక్కడికి చేరుతుంది. ఇలా వందల సంవత్సరాలపాటు ఒత్తిడి పెరిగిన తర్వాత.. ఆ ఒత్తిడి భూమి లోపల ఉన్న రాళ్ల శక్తిని అధిగమించినప్పుడు పొరల్లో కదలికలు వచ్చి భూకంపం సంభవిస్తుందని.. శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భవిష్యత్తులోనూ..

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో భవిష్యత్తులోనూ భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. 2021లో రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రతతో కాళేశ్వరం సమీపంలో భూకంపం వచ్చింది. ఇకపై కూడా భూకంపాలు వస్తూనే ఉంటాయి. వాటిని తట్టుకునేలా భవనాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

తదుపరి వ్యాసం