AP Assembly Speaker : ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల భవనాలను 9 నెలల్లో పూర్తి చేయండి - స్పీకర్ అయన్నపాత్రుడు-ap assembly speaker ayyanna patrudu inspected the buildings of mla and mlc quarters in crda area ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Assembly Speaker : ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల భవనాలను 9 నెలల్లో పూర్తి చేయండి - స్పీకర్ అయన్నపాత్రుడు

AP Assembly Speaker : ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల భవనాలను 9 నెలల్లో పూర్తి చేయండి - స్పీకర్ అయన్నపాత్రుడు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 05, 2024 04:21 PM IST

AP Assembly Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల భవనాలను 9 నెలల్లో పూర్తి చేయాలని సీఆర్డీఏ అధికారులను స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన… భవన నిర్మాణ పనులను పరిశీలించారు.

సీఆర్డీఏ ప్రాంతంలో ఏపీ స్పీకర్ పర్యటన
సీఆర్డీఏ ప్రాంతంలో ఏపీ స్పీకర్ పర్యటన

అమరావతి రాజధాని ప్రాంతంలో ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పర్యటించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన నిర్మాణ సముదాయాలను పరిశీలించారు.  ఈ భవనాలను 9 నెలల కాలంలో పూర్తి చేయాలని సీఆర్డిఏ అధికారులను కోరారు.

శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల భవన సముదాయాలపై స్పీకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ… ఎంఎల్ఏ,ఎంఎల్సి క్వార్టర్ల భవనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ 9 మాసాల్లోగా పూర్తి చేసి ఇవ్వాలని కోరారు. ఒక నిర్ధిష్ట కాలవ్యవధి ప్రకారం పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఎంఎల్ఏ,ఎంఎల్సిల నివాస భవన సముదాయాలతో పాటు ఇతర భవనాల పనులు నిలిచిపోయాయని స్పీకర్ అన్నారు. పనులు ఎక్కడివి అక్కడే నిలిచి పోవడంతో వాటికి సంబంధించిన మెటీరియల్ అంతా తుప్పు పట్టిపోయే పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. పూర్తి చేసేందుకు అయ్యే అంచనా వ్యయం కూడా పెరిగి పోయిందని పేర్కొన్నారు.

అసెంబ్లీ భవనంలో లీకేజీలు ఉన్నట్టు గుర్తించామని వాటిని వెంటనే అరికట్టాలని అధికారులకు స్పీకర్ సూచించారు. అదే విధంగా ప్రస్తుతం మీడియా పాయింట్ ఉన్న ఎనెక్సా భవనంలో కూడా సౌకర్యాలను మెరుగు పర్చాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించిన ప్రత్యేక గ్రంధాలయన్ని అక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని.. ఆదిశగా తగిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీ జరనల్ కు సూచించారు.  

అసెంబ్లీ కమిటీల చైర్మెన్ లకు కూడా ఈ భవనంలోనే రూమ్ లను ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీకి వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా చిన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేయాలని స్పీకర్ దిశానిర్దేశం చేశారు.

ఈసమావేశంలో సిఆర్డిఎ కమిషనర్ కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ… 2019 నాటికి ఎంఎల్ఏ,ఎంఎల్సిల క్వార్టర్లకు సంబంధించి 77 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. మిగతా పనులు పూర్తి చేసి ఆభవనాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు యుద్ద ప్రాతిపదికన పనులు చేపడతామని అన్నారు.

చాలా వరకూ ఫినిషింగ్ పనులే పెండింగ్ లో ఉన్నందును త్వరితగతిన పనులు నిర్వహిస్తామని తెలిపారు. 9 మాసాల్లో పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే విధంగా శాశ్వత అసెంబ్లీ భవనం అందుబాటులోకి వచ్చే లోగా ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనం నిర్వహణను పూర్తి స్థాయిలో మెరుగు పర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటాని వివరించారు.అలాగే అనెక్సా భవనంలో కూడా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటామని  వివరించారు. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికారులతో కలిసి అనెక్సా భవనాన్ని పరిశీలించారు.

 

Whats_app_banner