Opinion: ‘బి’ టీమ్‌గా జనసేన మిగలకూడదు.. సామాజిక న్యాయంపై అప్పుడే రాజీనా
17 June 2024, 12:04 IST
- Opinion: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటులో, ఎన్నికల్లో భారీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఇక జనసేన టీడీపీకి బి టీమ్‌లా కాకుండా సంస్థాగతంగా ఎదగడానికి, సామాజిక న్యాయం చేయడానికి ఆయన కృషి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ పొలిటికల్ అనలిస్ట్ దిలీప్ రెడ్డి.
ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మంతనాలు (ఫైల్)
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంలో జనసేన పార్టీ పోషించింది కీలక పాత్ర. ఇక ప్రభుత్వం నడపడంలోనూ దాన్ని కొనసాగించాలి. పొత్తులో ఉన్నంత మాత్రానా టీడీపీ నాయకత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ‘‘డూ డూ బసవన్న’’ లాగా జనసేన తలూపడం శోభించదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగేట్టు, ప్రభుత్వంపై అవసరం మేర ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది.
ప్రభుత్వంలో ఉంటూనే ప్రధాన నిర్ణయాల మంచి-చెడుల్ని కనిపెట్టుకొని ‘వాచ్ డాగ్’లా వ్యవహరించాలి. ముఖ్యంగా టీడీపీకి ‘బి’ టీం లా జనసేన మారకుండా జాగ్రత్తపడాలనే అభిప్రాయం జనసమూహాల్లో వ్యక్తమౌతోంది. గత ప్రభుత్వ దాష్టీకాలపై అయిదేళ్లు పోరాటం చేసి, కీలక పార్టీలను ఒకతాటిపైకి తెచ్చి, ప్రజాప్రభుత్వాన్ని స్థాపించి... ‘ఈనగాచి నక్కలపాల్జేసి’నట్టు కానీయకుండా చూడాల్సిన బాధ్యత జనసేనపై ఉంది.
అందుకే, కూటమిలో పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే ప్రజాపక్షం వహించి జనసేన తమ గుర్తింపును కాపాడుకోవాలి. అదే సమయంలో పార్టీని బలోపేతం చేసుకోవాలి. కేవలం చంద్రబాబు ఇచ్చిన హామీలపైనే కాకుండా గత నాలుగేళ్లల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలి.
పాలనలో ఏకపక్షంగా ‘బాబు మార్క్’ మాత్రమే కాకుండా ‘పవన్ కళ్యాణ్ మార్క్’ కూడా కనిపించాలన్నది అభిమానుల ఆకాంక్ష. బంగారంలో కొంచెం రాగి కలిస్తేనే ఆభరణం తయారవుతుంది అన్నట్టు, పరిపాలనలో ఇద్దరి భాగస్వామ్యం ఉండాలి. లేదంటే, కోటి ఆశలతో కూటమికి ప్రజలు కట్టబెట్టిన ఈ అపూర్వ విజయానికి అర్థం లేకుండా పోతుందన్నది జనాభిప్రాయం.
ఉప ముఖ్యమంత్రి పదవికి ‘పవర్’ తెస్తారా?
ముఖ్యమంత్రి తర్వాత ఉపముఖ్యమంత్రిదే రెండో స్థానం అనుకుంటారు చాలామంది. అయితే రాజ్యాంగంలో ఉపముఖ్యమంత్రి పదవి గురించి ఏ ప్రస్తావనా లేదు. ఈ రాజకీయ పదవికి సంబంధించి చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే, ఉపముఖ్యమంత్రికి అన్ని అధికారాలు ఇచ్చిన దాఖాలాలు ఏ రాష్ట్రంలోనూ లేవు. అంతకముందు జగన్ మంత్రివర్గంలో పని చేసిన ఉపముఖ్యమంత్రులు అయినా, తెలంగాణలో కేసీఆర్ మంత్రివర్గంలో పని చేసిన ఉప ముఖ్యమంత్రులైనా నెంబర్ 2 అంటే ఎవరైనా ఒప్పుకుంటారా?
ఉపముఖ్యమంత్రి అంటే, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిలా వ్యవహరించాలి కానీ, ముఖ్యమంత్రి చెప్పింది చేయడానికే అనే పరిస్థితి తీసుకొచ్చారు. తనకు కేటాయించిన శాఖను నిర్వహించే మరే ఇతర మంత్రికి, ఉప ముఖ్యమంత్రికీ తేడా లేని స్థితిని తెచ్చిపెట్టారు. ఈ పరిస్థితిని పవన్ కళ్యాణ్ మార్చాలి! పరిపాలన నిర్ణయాల్లో సమాన బాధ్యత తీసుకోవాలి.
కూటమి ప్రభుత్వానికి మంచిపేరు రావాలంటే ‘రెడ్ బుక్’ ని అమలు చేస్తే రాదని, ప్రజాగళం మేనిఫెస్టోలో ఉన్న అంశాలు అమలు చేస్తే వస్తుందని జనసేన గుర్తుంచుకోవాలి, అవసరమైనప్పుడు టీడీపీ నాయకత్వానికి కూడా ఈ విషయం గుర్తు చేయాలి.
ఆ ప్రస్తావనే లేదు
2019 నుంచి ’24 వరకు పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్లినా... డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఊరువాడా ప్రచారం చేశారు. కూటమి మేనిఫెస్టో ప్రజాగళంలో కూడా ‘‘అన్నా / డొక్కా సీతమ్మ’’ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని రాతపూర్వక హామీ ఇచ్చారు. కానీ, సీఎం చంద్రబాబు సంతకం చేసిన అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ జీవోలో డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ప్రస్తావనే లేదు! అయినా, డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పెట్టాలని జనసేన నాయకులు ఒత్తిడి చేయకపోవడం... జనసేన రాజీ ధోరణికి అద్దం పడుతోంది.
ఇది ఒక పేరుకు సంబంధించిన చిన్న అంశమే అనిపించవచ్చు! కానీ, ఒక లిఖితహామీ అమలుకు సంబంధించిన చిత్తశుద్ది సంకేతంగా పరిగణించాలి. ప్రజాగళంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీకు 50 సంవత్సరాలకే నెలకు 4 వేల రూపాయిల ఫించన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, సీఎం మూడో సంతకం చేస్తూ ఫించన్లు పెంచిన జీవోలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామన్న ఫించన్ ప్రస్తావనే లేదు. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత పరిపాలనలో భాగం పంచుకుంటున్న రాజకీయ పార్టీగా జనసేనపై ఉంది.
హామీల అమలు, పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ప్రజలకు న్యాయం జరిగేలా నడుచుకుంటేనే ఉపముఖ్యమంత్రికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్టు లెక్క. పరిపాలనలో పవన్ మార్క్ ఉందా? లేదా అన్నది ఇలాంటి అంశాలే తేలుస్తాయి. ఎన్డీయే తీసుకునే కీలక పరిపాలన నిర్ణయాలకు పవన్ కళ్యాణ్ జవాబుదారీగా ఉంటారు కాబట్టి, ఆయన వీటిపై కచ్చితంగా వ్యవహరించాలి. అవసరమైన చోట మొహమాటం లేకుండా తగినంత ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన తర్వాత.... తాము ఇచ్చిన హామీని నెరవేర్చుకునే విషయాన్ని మీడియాలో, సోషల్ మీడియాలో జనసేన విస్తఅతంగా ప్రచారం చేసుకోవాలి.
అభిమానుల్లో అసంతృప్తి
రాష్ట్ర మంత్రివర్గంలో కేవలం మూడు మంత్రి పదవులకే జనసేన పార్టీ ఒప్పుకోవడం పట్ల పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కామన్ పొలిటికల్ ప్రోగ్రాం (సీపీపీ)కి పట్టుబట్టకుండా జనసేన నాయకత్వం ఇదే విధంగా రాజీ పడుతూ పోతే, చివరికి తెలుగుదేశం తమ పార్టీని కబళిస్తుందని వారు భయపడుతున్నారు. టీడీపీకి జనసేన ‘బీ టీం’ అనే ముద్ర వేయించుకోవడానికి వారేమాత్రం ఇష్టపడటం లేదు. ఎందుకంటే, దేశ రాజకీయాలను గమనిస్తే, పాలక కూటముల్లోని ప్రధానపార్టీకి ‘బీ టీం’ అని ముద్ర వేసుకున్న ఏ పార్టీ భవిష్యత్తులో బతికి బట్టకట్టలేదు.
తెలంగాణలో బీఆర్ఎస్, ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ, కర్ణాటకలో జేడీఎస్ పార్టీలు బీజేపీకి ‘బీ టీం’ అనే ముద్ర వేసుకోవడం వల్లే ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలు తమ భవిష్యత్తుకు తామే ఎసరు పెట్టుకున్నాయంటే, అది అతిశయోక్తి కాదు. 2014లో కాంగ్రెస్‌ను తల్లి పార్టీ, వైసీపీని పిల్ల పార్టీ అని ప్రచారం చేయడం వల్లే సదరు ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు దెబ్బతిన్నాయి. ఈసారి జరిగిన ఎన్నికల్లో, వై.ఎస్. షర్మిలను చంద్రబాబు ఆడిస్తున్నారనే ప్రచారం జరగడంవల్లే... రాష్ట్రంలో పుంజుకుంటుందనుకున్న కాంగ్రెస్ మళ్లీ చతికిల పడింది.
కాబట్టి, జనసేన ఇప్పుడు ధృతరాష్ట్ర కౌగిలిలో ఉందని మర్చిపోకూడదు. టీడీపీ వాళ్లు, జనసేన ఎదగొద్దు, పెరగొద్దనే గోడచాటున ఎత్తులు వేస్తారు. ఇటువంటి విషయాల్లో వారు సిద్ధహస్తులు కూడా! బీజేపీతో టీడీపీ ఇప్పటికే పలుమార్లు పొత్తుపెట్టుకుంది. అయినా, తెలుగు రాష్ట్రల్లో బీజేపీని ఎదగనీయకుండా చేయడంలో తెలుగుదేశం విజయం సాధించింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తన ఉనికిని, ఆత్మగౌరవాన్ని వదులుకోకుండా జనసేన ఎదిగేందుకు ప్రయత్నించాలి. లేదంటే, ఆ ఖాళీలో వైఎస్సార్సీపీకి లేదా కాంగ్రెస్ కి రాజకీయ పునర్జన్మ లభిస్తుంది!!
సామాజిక న్యాయం ఏది?
‘నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటుందో జనసేన పార్టీలో సామాజిక న్యాయం కూడా అంతే ఉంటుంది’ అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు మంత్రివర్గంలోనూ కేవలం కాపులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన ప్రజల్లో నెలకొంది. ఎంతోమంది కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చింది... కేవలం ఇద్దరు ఎంపీలు, 21 ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులు అవ్వడానికి కాదు.
15 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ కోసం విశ్వసనీయంగా పని చేస్తున్నవారికి కామన్ పొలిటికల్ ప్రోగ్రాం కింద న్యాయం జరగాలి. పొత్తులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని నామినేటెడ్ పదవులు, ఎన్నికల ద్వారా లభించే పదవుల్లో జనసేన కార్యకర్తలకు, నాయకులకు కుల మతాలతో సంబంధం లేకుండా అవకాశం ఇచ్చేలా జనసేనాని అడుగుల వేయాలి.
‘‘కులాలు ఉండకూడదు, వైరుధ్యాలు ఉండకూడదు’’ అని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెప్తుంటారు. ఆయన చెప్పిన ఈ సామాజిక న్యాయం హామీ ప్రజలను ఆకట్టుకుంది. గోదావరి జిల్లాల్లో కాపులు, బీసీలు, దళితుల మధ్య తరతరాల వైరం ఉన్నా... దానిని పక్కనపెట్టి మూకుమ్మడిగా జనసేనకు మద్దతిచ్చారు. కానీ, పవన్ కళ్యాణ్ తాను చెప్పిన సామాజిక న్యాయం అనే సూత్రాన్ని పాటిస్తారా? లేదా? అనేది సందేహాత్మకంగా మారింది.
జనసేన నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు కాపులే. గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది కాపులు, ముగ్గురు బీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ఒకరు క్షత్రియ, ఒకరు కమ్మ, ఇంకొకరు బ్రాహ్మణ సామాజికవర్గం వారు ఉన్నారు.
జనసేన నుంచి మంత్రులైన ముగ్గురిలో ఇద్దరు కాపులు, ఒకరు కమ్మ. ఇక్కడ ఏ జాబితా తీసుకున్నా పవన్ కళ్యాణ్ చెప్పిన సామాజిక న్యాయం కనపడటం లేదు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, కూడా ప్రాధాన్యత ఉండేలా జనసేన పట్టుబట్టి ఉంటే బాగుండేది. సీపీపీలో భాగంగా కనీసం 8 మంత్రి పదవులు డిమాండ్ చేయాల్సింది. కానీ, ఆయన ఆ ప్రయత్నం చేసినట్టు కనిపించదు. వారు ఇచ్చిందే తీసుకుందామన్నట్టు ఆయన వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. పార్టీలో అన్ని కులాలకు, మహిళలకు సమాన ప్రాధాన్యం దక్కకపోతే వారు ఆయన వెనక ఎందుకు నడుస్తారు? ఎందుకు నడవాలి?
సోషల్ ఇంజనీరింగ్ ముఖ్యం
2007 ఎన్నికలప్పుడు, ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ అధినేత్రి మాయవతి ‘సోషల్ ఇంజనీరింగ్ ప్రయోగం చేసి అద్భుత విజయం సాధించారు. మనువాదానికి వ్యతిరేకంగా పుట్టిన బీఎఎస్పీ... అక్కడి బ్రాహ్మణులకు, దళితులకు మధ్య ఉన్న వైరాన్ని తొలగించి, సమన్వయంతో ఒక్కటి చేయగలిగారు. దాంతో ఆమె భారీ మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, అధికారంలోకి రాగానే కేవలం తన సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ తర్వాత ఆమె పార్టీ అథ:పాతాళంలోకి వెళ్లారు.
వైఎస్సార్సీపీ కూడా పదవులు, సీట్ల పంపకాల్లో పైకి సామాజిక న్యాయం పాటిస్తున్నట్టు నటించినా... మెజారిటీ పదవులు, కీలక స్థానాల్లో కేవలం రెడ్లనే కూర్చోబెట్టడంతో ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని, తీరని పరభావాన్ని మూటగట్టుకుంది. గతంలో వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు గెలుచుకున్న కమ్యూనిస్టులు కూడా... సామాజిక న్యాయం పాటించకపోవడంతోనే క్రమంగా కనుమరుగవుతున్నారు.
‘సామాజిక న్యాయం’ అంశంలో కాన్షిరాం తనకు ఆదర్శమని చెప్పే పవన్, కాన్షిరాం సిద్దాంతాల ప్రకారం జనాభా ప్రతిపాదికన అధికారం పంచాల్సిన బాధ్యత కూడా తన భుజానికెత్తుకోవాలి. జనసేన కాపుల పార్టీ అనే ముద్ర తొలగించుకోకపోతే, దాని ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో... ఎంతో దూరంలో కాదు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన కళ్ల చూస్తారు!
సంస్థాగత నిర్మాణం చేపట్టాలి
1983లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ కి భిన్నమైన పార్టీ అని ముద్ర వేసుకోవడం కోసం మేథావులతో కలిసి లోతుగా అధ్యయనం చేసి, అప్పటి నాయకులు వేసుకునే ఖద్దర్ చొక్కాకు బదులు పచ్చ చొక్కా తీసుకొచ్చారు. గుర్తింపు కోసం అన్ని కోణాల్లో ప్రయత్నం చేశారు. శిక్షణ తరగతులు నిర్వహించి గ్రామస్థాయి నుంచి అన్ని కులాలకు ప్రధాన్యతనిస్తూ బలమైన కార్యకర్తల వ్యవస్థను నిర్మించుకున్నారు.
1987లో మండల ఎన్నికలతో కింది స్థాయిలో క్యాడర్ బలం పెరిగింది. అధినాయకుడు కమ్మ అయినా, టీడీపీకి బీసీల పార్టీ అనేలా తయారు చేసుకున్నారు. అందుకే, నాలుగు దశాబ్దాలుగా రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, టీడీపీ తిరిగి లేచి నిలబడుతోంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీకి, నిజానికి పాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం ఇచ్చింది. దీంతో వైఎస్సార్సీపీ అధినాయకుడు రెడ్డి అయినా, వారి వెనక నిన్నటి దాకా దళితులు, ఎస్టీలు ఉన్నారు. జనసేన అధినేత కాపు కాబట్టి, కేవలం కాపుల పార్టీగా కాకుండా ఇతర అన్ని వర్గాలను కలుపుకొని పోయే పార్టీగా జనసేన రూపుదిద్దుకోవాల్సిన సమయం, సందర్భం ఆసన్నమైంది.
ఈ ఎన్నికల్లో జనసేన పోషించిన పాత్ర చాలా పెద్దది. రాజమండ్రి జైలు ముందు, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించి టీడీపీ కార్యకర్తల్లోనూ ఉత్సాహాన్ని నింపారు. దీంతో, సంస్థాగతంగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ తన సంస్థాగత బలాన్ని జనసేనకు ఇచ్చింది. ఫలితంగా ఓట్ల బదిలీ సక్రమంగా జరిగి జనసేన వంద శాతం స్ట్రయిక్ రేట్ సాధించింది.
అయితే పార్టీ ఏర్పాటయినప్పటి నుంచి జనసేన క్షేత్రస్థాయి సంస్థాగత నిర్మాణం చేపట్టలేదు. ఇప్పటి వరకు జనసేనకు పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారు తప్ప, రాజకీయ చైతన్యం ఉన్న ‘తనదైన క్యాడర్’ అంటూ లేదు. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చాక, సహజమైన సినిమా గ్లామర్ కూడా కొంతమేర పోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి జనసేన పార్టీ సంస్థాగతంగా బలపడటానికి ఇప్పటినుంచే దృష్టి పెట్టాలి.
గ్రామ స్థాయిలో టీడీపీకి ‘బి’ టీంగా కాకుండా, జనసేన నాయకుల్లో స్వతంత్ర భావన పెంపొందించాలి. వారికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలి. రాష్ట్ర రాజకీయాల్లో దీర్ఘకాలం కొనసాగాలనే ఆకాంక్ష జనసేన పార్టీ నాయకత్వానికి ఉంటే సామాజిక సమతుల్యం పాటిస్తూ, సంస్థాగత నిర్మాణం చేపడితేనే భవిష్యత్తు ఉంటుంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంస్థాగతంగా... గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు లేకపోతే పార్టీ పేకమేడలా కూలిపోతుంది. దీనిని దృష్టి లో పెట్టుకుని టీడీపీకి ‘బి’ టీంగా ఉంటారా? లేక పాలనలో కీలక భూమిక పోషిస్తూ, సామాజిక న్యాయం పాటిస్తూ, స్వతంత్రంగా పార్టీని విస్తరించి ఒక శక్తిగా ఎదుగుతారా? అనే ప్రశ్నకు సమాధానం జనసేన నాయకత్వం చేతుల్లోనే ఉంది.
- దిలీప్ రెడ్డి ,
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ
(Disclaimer: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు, వ్యూహాలు, వ్యాఖ్యానాలు రచయిత వ్యక్తిగతం మాత్రమే. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు. హిందుస్తాన్ టైమ్స్ వీటికి ఏ విధమైన బాధ్యత వహించదు)