Ysrcp : వైసీపీతోనే కాపులకు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం…రాజమండ్రిలో భేటీ
Ysrcp ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీతోనే కాపులకు ఆర్థిక, సామాజిక న్యాయం జరుగుతుందని కాపు ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రాజమండ్రిలో నిర్వహించిన కాపు సామాజిక వర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలని నిర్ణయించారు.
Ysrcp ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఎక్కువ న్యాయం జరిగిందని కాపు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నారని, అన్ని పథకాలు, రంగాలలో అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు కంటే లక్ష రెట్లు వైసీపీ మేలు చేసిందని ప్రకటించారు. మూడేళ్లలో కాపులకు దాదాపు రూ.27 వేల కోట్ల నిధులు వెచ్చించారని ప్రకటించారు. గతంలో వైయస్సార్ ప్రభుత్వం మాత్రమే కాపులకు మేలు జరిగిందని, మళ్లీ జగన్ ప్రభుత్వంలో గౌరవంగా బతుకుతున్నామని చెప్పారు.
కాపు ఎమ్మెల్యేలపై పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించిన ప్రజా ప్రతనిధులు, రంగా హత్య ఘటనపైనా పవన్ కళ్యాణ్ అనైతికంగా మాట్లాడారని ఆరోపించారు. రంగాను కాపులు ఎందుకు కాపాడుకోలేదని పవన్ ప్రశ్నించారని, అదే రంగాను చంపించిన చంద్రబాబుతో వెంటనే భేటీ అయ్యారని విమర్శించారు. ఈ విషయాన్ని కాపు సోదరులు, సామాజికవర్గం గమనించాలని మంత్రి బొత్స గుర్తు చేశారు. జనసేన రాజకీయ పార్టీ కాదని దానికి ఒక విధానం లేదని, అది కేవలం సెలబ్రిటీ పార్టీ మాత్రమేనని ఎద్దేవా చేశారు. తమకు 10 సీట్లు ఇవ్వాలని పవన్ ఎవరినో కోరాడని, ఎవరికో పార్టీని తాకట్టు పెడుతున్నాడనే కదా అని ప్రశ్నించారు.
పవన్‌ను తిట్టేందుకు తాము సమావేశం కాలేదని, ఆయన్ని ఎవరు తిట్టలేదని, నా కొడుకా అనలేదని, చెప్పులు చూపలేదన్నారు. మాకు సభ్యత, సంస్కారం ఉందని, స్వశక్తితో ఎదిగామని వైయస్సార్‌సీపీ మంత్రులు తేల్చి చెప్పారు. పవన్‌కళ్యాణ్ 175 సీట్లలో సింగిల్‌గా పోటీ చేస్తారో లేదో ధైర్యం ఉంటే చెప్పాలని, మేము అలా పోటీ చేస్తామన్నారు. గత ప్రభుత్వాలన్నీ కాపులను కేవలం ఓటు బ్యాంక్‌గానే చూశాయని, వారిని ఉపయోగించుకుని, ఎన్నికల తర్వాత అస్సలు పట్టించుకోలేదని, సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంలో కాపులకు గౌరవం దక్కిందని బొత్స చెప్పారు. అందుకే తామంతా తృప్తిగా ఉన్నామని, ఈ ప్రభుత్వంలో రాజకీయ పరంగా చూసినా కూడా గత ప్రభుత్వాల కంటే పెద్ద పీట వేశారని చెప్పారు. అందుకు అంకెలు కూడా చూపగలమని, టికెట్లు ఇవ్వడంలో కానీ, ప్రజలు గెలిపించడంలో కానీ, ఆ తర్వాత నామినేటెడ్ పదవుల్లో కూడా మాకు ప్రాధాన్యం ఇచ్చాం. అందుకు ఎంతో సంతోషిస్తున్నామని చెప్పారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారం క్రితం.. ఒక సెలబ్రిటీ పార్టీ నేత ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడాడో.. తమ సామాజికవర్గం గురించి, మా పార్టీలో మా సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులపైనా సభ్య సమాజం తల దించుకునేలా ఎలా మాట్లాడారో చూశామని, వాటన్నింటినీ ఖండిస్తున్నామని చెప్పారు.
త్వరలోనే విజయవాడలో మళ్లీ సమావేశం అవుతామని బొత్స చెప్పారు. పార్టీలో కాపు సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలం మాత్రమే సమావేశం అయ్యారని, విజయవాడలో జరిగే సమావేశంలో మా పార్టీలో మా సామాజికవర్గానికి చెంది నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారు, జడ్పీ ఛైర్మన్లు, మేయర్లు కూడా పాల్గొంటారన్నారు. అలా విజయవాడలో త్వరలోనే విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు.
బాబు కోసమే పవన్ పని….. కొట్టు సత్యనారాయణ
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చెప్పిన దానికి తర్వాత చేసిన దానికి ఎక్కడ పొంతన లేదని ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసిన వారందరినీ గుర్తు పెట్టుకుంటానని తర్వాత వారితోనే అంటకాగారని కొట్టు సత్యనారాయణ విమర్శించారు. 2019లో మళ్లీ రాజకీయ పార్టీగా పవన్ రావడానికి కారణం.. చంద్రబాబు వ్యతిరేక ఓట్లు చీలకపోతే, జగన్ లబ్ధి పొందుతారని చెప్పి, చంద్రబాబు వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసం పని చేసి, చంద్రబాబుకు కొమ్ము కాశారని విమర్శించారు.
ఇవాళ అదే వ్యక్తి మళ్లీ చంద్రబాబుతో మళ్లీ కుమ్మక్కై, విజయవాడలో వారి పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో కాపు సామాజికవర్గాన్ని కించపర్చే విధంగా, ఆ సామాజికవర్గంలో ఉన్న పెద్దలంతా కూడా బాధ పడే విధంగా, ఆ నాయకుడి నోటి వెంట మాటలు వచ్చాయని దానికి బాధపడుతున్నామని చెప్పారు.
బాబు కాపులను అణిచివేశారు… అంబటి
గత ప్రభుత్వాలు.. తెలుగుదేశం పార్టీ పరిపాలించిన కాలంలో కాపులను అణిచే వేసే కార్యక్రమాలు చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, కాపు వ్యతిరేక కార్యకలాపాలు అనేకం చేసి, కాపు వ్యతిరేక పార్టీగా ముద్ర పడిందన్నారు. దివంగత మోహన్‌రంగా హత్య. రెండు. రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన తీరు దీనికి నిదర్శనమన్నారు. రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే, దాన్ని అణిచి వేయడం కోసం చంద్రబాబు అనుసరించిన విధానం, ముద్రగడ గారిని కొట్టడం. వారి భార్యను తిట్టడం, వారి కుమారులను వేధించడం, వారందరినీ ఇంట్లో బంధించి, ఒక సెల్‌లో ఉంచినట్లు వేధించడం అందరికి గుర్తున్నాయన్నారు.
జగన్ పరిపాలన చేపట్టినప్పుడు పార్టీ నుంచి 26 మంది కాపులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని, ముగ్గురు ఎంపీలు, 5గురు శాసన మండలి సభ్యులు కూడా ఉన్నారన్నారు. ఇంకా కార్పొరేషన్ల ఛైర్మన్లు, మేయర్లు కూడా ఉన్నారని. ఇంత మందికి గుర్తింపు ఇవ్వడమే కాకుండా, అణగారిపోతున్న కుటుంబాలను ఆదుకోవాలని ఎన్నో చేశారన్నారు.
జగన్ కాపుల శ్రేయోభిలాషి…కురసాల కన్నబాబు
2014–19 మధ్య.. ఆ తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు రాజకీయాలను కులాల మధ్య తిప్పుతున్నారని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని సంఘ వ్యతిరేక శక్తిగా ముద్ర వేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తే, కాపు సామాజికవర్గం ఆయన మీద తిరగబడిందని, అందుకే 2019లో కాపు సామాజికవర్గం జగన్‌గారి వెంట నిల్చిందని చెప్పారు. ఆ ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌కు 5.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని, చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు కాపులను వేధించాడని, మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా కేసులు పెట్టి, వేధించారని, జగన్ సీఎం కాగానే ఆ కేసులన్నింటినీ ఎత్తేశారని చెప్పారు.
చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి కుట్ర చేస్తున్నారని, 2016 నుంచి జగన్‌గారు సీఎం అయ్యే వరకు.. అంటే 2019 వరకు సెక్షన్–30 అమలు చేసిన ఘనత చంద్రబాబుదని, . కాపు సామాజికవర్గాన్ని ఒక బోనులో నిలబెట్టాలని, మా పార్టీలో ఉన్న కాపులను తప్పు పట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారని, తాము ఊడిగం చేస్తున్నామన్నట్లుగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతున్నారని, పవన్ ఏ పార్టీలకు మద్దతు ఇస్తున్నారుని ప్రశ్నించారు.
పవన్‌కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో సింగిల్‌గా పోటీ చేస్తారా? చెప్పాలని ఆ పని మేము చేస్తామని వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లలో ఎన్ని సీట్లకు పవన్‌కళ్యాణ్ పార్టీ సింగిల్‌గా పోటీ చేస్తుందని ధైర్యముంటే చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా కేవలం కుల ప్రాతిపదికన మనుగడ కొనసాగించలేదని అన్ని వర్గాల వారు ఓటేస్తేనే గెలుస్తుంది. ప్రజా సంక్షేమాన్ని, సమగ్ర అభివృద్ధిని కోరుకునే పార్టీని ప్రజలు ఎన్నుకుంటారని చెప్పారు.