Reopening of Anna Canteens in AP : ఏపీలో కొత్త ప్రభుత్వం రావటంతో కీలక నిర్ణయాలు తీసుకునే పనిలో పడింది. ఓవైపు శాఖలవారీగా ప్రక్షాళన చేస్తూనే… మరోవైపు కీలక పథకాలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా… అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది.
అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ ఇవాళ్టి నుంచే మొదలవుతుంది. సెప్టెంబరు 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు.పుర, నగరపాలక సంస్థల కమిషనర్లతో పాటు ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ఇందులో భాగస్వాములను చేశారు.
2019లో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి.. వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో మంజూరుచేసిన 203 క్యాంటీన్ భవనాల్లో 184 వరకు అప్పట్లో పూర్తయ్యాయి. పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూచించింది.