APSRTC : ఏపీఎస్ఆర్టీసీకి నవంబర్ వరకూ మంచి రోజులు లేవంట!
28 August 2022, 16:24 IST
- APSRTC Buses : సంస్థను లాభాల బాట పట్టించేందుకు ఏపీసీఎస్ఆర్టీసీ కష్టపడుతోంది. ప్రయాణికులను ఆకర్శిస్తూ.. ముందుకువెళ్తోంది. అయితే నవంబర్ వరకూ ఆర్టీసీకి అననుకూల రోజులు ఉన్నాయట.
ఏపీఎస్ఆర్టీసీ
APSRTC విశాఖపట్నం జిల్లా వార్షిక సగటు 72 శాతానికి ఉండాల్సింది. అయితే దానికి వ్యతిరేకంగా ఆగస్టులో 63 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదు చేసింది. జూన్‌లో ఆర్టీసీ విశాఖపట్నం ఆక్యుపెన్సీ రేషియో 72 శాతం నమోదు చేసి రోజుకు రూ.1.3 కోట్లు ఆర్జించింది. 'ఆషాడం వల్ల జూలైలో ఆక్యుపెన్సీ రేషియో 60 శాతానికి, జూన్‌లో 72 శాతం ఉండగా ఆగస్టులో 63 శాతానికి పడిపోయింది.' విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పల రాజు తెలిపారు.
సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు శుభ దినాలు, పెళ్లిళ్లు ఉండవు కాబట్టి డిసెంబర్లో 72 శాతానికి చేరుకోవాలంటే ఆగాల్సిందేనని పేర్కొన్నారు. అయితే దసరా సమయంలో కొంత డిమాండ్ ఉండవచ్చు, కానీ అది తాత్కాలికమేనని పేర్కొన్నారు.
ఏప్రిల్, మే, జూన్‌లో విద్యాసంస్థలు, వివాహాలు, ఇతర శుభకార్యాలకు వేసవి సెలవుల కారణంగా ఆర్టీసీకి 72 శాతం ఆక్యుపెన్సీ రేషియో వచ్చింది. మొత్తం మీద ఇప్పుడు జిల్లాలో 704 బస్సులను నడుస్తున్నాయి. కొవిడ్-19కి ముందు రోజులు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. సాధారణ ఆక్యుపెన్సీ రేషియో 72 శాతానికి చేరుకోవాల్సి ఉంది. 2020, 2021లో కొవిడ్-19 రోజులలో అత్యవసర కారణాల దృష్ట్యా సేవలను పునఃప్రారంభించిన తర్వాత కూడా ఆక్యుపెన్సీ రేషియో 30 శాతం కంటే తక్కువగా పడిపోయింది.
కొవిడ్-19 భయం దాదాపుగా ముగిసింది. ప్రయాణికులు యథావిధిగా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతోంది. ఏప్రిల్‌లో నెలవారీ పనితీరు 67 శాతం, మేలో 70 శాతం, జూన్‌లో 72 శాతం, జూలైలో 60 శాతం ఉంది.
704 బస్సుల్లో 550 సిటీ బస్సులే ఉన్నాయి. సాధారణ, సిటీ బస్సులు రోజుకు 2.50 లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి. తక్కువ ఆదాయ మార్గాల్లో నడిచే దాదాపు 86 సిటీ బస్సులు ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు సర్దుబాటు చేస్తున్నారు.