Ramoji Rao Career : సామాన్యుడి నుంచి అతిపెద్ద సామ్రాజ్యానికి అధిపతిగా…! రామోజీరావు ప్రస్థానం ఇదే
08 June 2024, 8:38 IST
- Eenadu Ramoji Rao Career: అతి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు… అతిపెద్ద సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. వ్యాపారం రంగంతో ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన… ఎన్నో మైలురాళ్లను అధిగమించారు.
రామోజీరావు మృతి
రామోజీరావు మృతి
Eenadu Ramoji Rao Passes Away: చెరుకూరి రామోజీరావు…. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకంటూ ఓ చరిత్ర ఉంది. ఆయన పేరు వినగానే ప్రముఖ వార్తా పత్రిక ఈనాడు అందరికి గుర్తుకు వస్తుంది. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని స్థాపించిన చరిత్ర ఆయన సొంతం. వ్యాపారం రంగం నుంచి సినిమా, మీడియా రంగం వరకు రామోజీరావు తన ముద్రవేశారు. ఎలాంటి సమస్యలు ఎదురొచ్చినా… వెనక్కి తగ్గని రథసారథిగా ముందుకు నడిచారు.
రామోజీరావు ప్రస్థానం….
- రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న జన్మించారు. గుడివాడలో విద్యాభాస్యం కొనసాగింది.
- రామోజీరావుకు వ్యాపారం రంగంపై అత్యంత ఆసక్తి ఉండేది. చిరు ఉద్యోగిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన…. మొదటగా ఓ చిన్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు.
- కొంతకాలంగా పాటు పాటు ప్రకటనల రంగంలో పని చేసిన ఆయన… 1962లో హైదరాబాద్ నగరానికి వచ్చారు.
- 1962 అక్టోబరులో మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఏర్పాటు రామోజీ జీవితంతో కీలక మలుపు అని చాలా మంది చెబుతుంటారు. ప్రస్తుతం మార్గదర్శి విలువ వేల కోట్లలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వందల బ్రాంచులు ఉన్నాయి. మధ్య తరగతి కుటుంబాల్లో పొదుపు ఆవశ్యకత కు మార్గదర్శి ఎంతో బలం చేకూర్చిందని చెప్పొచ్చు.
- ఈనాడు పత్రకి కంటే ముందే 1969లో రామోజీరావు అన్నదాత పత్రికను ప్రారంభించారు. రైతు సమస్యలు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా ఈ పత్రిలో ముద్రించేవారు.
- ఆగస్టు 10 1974న విశాఖపట్నంలో రామోజీరావు ‘ఈనాడు’ పత్రికను స్థాపించారు. ఉషోదయం పేరుతో ప్రతి తెలుగువారి మనసును గెలుచుకుందని చెప్పొచ్చు. అతి తక్కువ కాలంలోనే ఈ పత్రిక సంచలనాలను సృష్టించింది. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక పాఠకులను సంపాదించుకుంది.
- ప్రాంతీయ దినపత్రికల చర్రితలో ‘ఈనాడు’ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. క్రమంగా హైదరాబాద్ ఎడిషిన్ తో పాటు జిల్లాల ఎడిషన్ లు కూడా ప్రచురితమయ్యాయి. నాటి రాజకీయ పరిస్థితులపై విభిన్నమైన కథనాలను ప్రచురించి సంచలనంగా మారింది. అనేక సామాజిక సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సక్సెస్ అయింది.
- సినీ ప్రేమికుల కోసం రామోజీరావు ‘సితార’ పత్రికను ప్రారంభించారు.
- బాషా ప్రేమికుల కోసం ‘చతుర’, ‘విపుల’ మాస పత్రికలను కూడా తీసుకొచ్చారు.
- ‘ప్రియా ఫుడ్స్’ పేరుతో పచ్చళ్ల వ్యాపారం కూడా ప్రారంభించారు.
- 1983లో ‘ఉషాకిరణ్ మూవీస్’ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ లో అనేక చిత్రాలను నిర్మించారు.
- ప్రపంచలోనే అతి పెద్ద చిత్రనగరి ‘రామోజీ ఫిల్మ్ సిటీ’ని కూడా రామోజీరావు ఏర్పాటు చేశారు. ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పరిధిలో విస్తరించి ఉంటుంది. ఫిల్మ్ సిటీ నిర్మాణం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది.
- 1990లో రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ను కూడా ప్రారంభించారు. ఇక్కడ కొత్త జర్నలిస్టులకు మెలుకువలు, పాఠాలను నేర్పిస్తారు.
- ‘ఈటీవీ’ ఆధ్వర్యంలో పలు ప్రాంతీయ ఛానళ్లను ప్రారంభించారు.
- 2002లో ‘రమాదేవి పబ్లిక్ స్కూల్’ను కూడా ఏర్పాటు చశారు. అబ్ధుల్లాపూర్ మెట్ పరిదిలో ఉంది.
- పేపర్, టీవీ మీడియాలోనే కాకుండా… డిజిటల్ మార్కెట్ లోకి విస్తరించేందుకు ఈటీవీ భారత్ పేరుతో మొబైల్ న్యూస్ యాప్ ను కూడా తీసుకొచ్చారు.
- అనేక రంగాల్లో సేవలు అందించిన రామోజీ రావు ను పలు పురస్కారాలు వరించాయి.
- మీడియా రంగంలో ఇచ్చే అతి ప్రతిష్టాత్మకమైన బి. డి. గోయెంకా అవార్డు రామోజీరావుకు దక్కింది.
- 2016లో కేంద్రం ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు.
చెరుకూరి రామోజీరావు(87) శనివారం ఉదయం తెల్లవారుజామున కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన… హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4. 50 గంటలకు తుదిశ్వాస విడిచారు. రామోజీరావు మృతిపై పలువురు సంతాపం ప్రకటించారు.
టాపిక్