CID Case On Ramoji Rao : మార్గదర్శిలో వాటా వివాదం, రామోజీరావుపై కేసు నమోదు చేసిన సీఐడీ!-vijayawada ap cid filed case on ramoji rao sailaja kiran margadarsi shares issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cid Case On Ramoji Rao : మార్గదర్శిలో వాటా వివాదం, రామోజీరావుపై కేసు నమోదు చేసిన సీఐడీ!

CID Case On Ramoji Rao : మార్గదర్శిలో వాటా వివాదం, రామోజీరావుపై కేసు నమోదు చేసిన సీఐడీ!

Bandaru Satyaprasad HT Telugu
Oct 16, 2023 08:59 PM IST

CID Case On Ramoji Rao : మార్గదర్శిలో తన తండ్రి పేరిట ఉన్న షేర్లు తనకు బదిలీ చేయమంటే రామోజీరావు తుపాకీతో బెదిరించాలని యూరిరెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సీఐడీ కేసు నమోదు చేసింది.

మార్గదర్శి వాటా వివాదం
మార్గదర్శి వాటా వివాదం

CID Case On Ramoji Rao : మార్గదర్శి చిట్ ఫండ్ ఛైర్మన్ రామోజీరావుపై ఏపీ సీఐడీకి మరో ఫిర్యాదు అందింది. మార్గదర్శిలో తనకు రావాల్సిన షేర్లు ఇవ్వకుండా తుపాకీతో బెదిరించారని మార్గదర్శిలో పెట్టుబడి పెట్టిన జి.జగన్నాథరెడ్డి కుమారుడు యూరిరెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. తన తండ్రి షేర్లు కోసం అడిగితే బెదిరించి బలవంతంగా తమ వాటా రాయించుకున్నారని యూరిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తండ్రి వాటా తమకు ఇవ్వకుండా రామోజీరావు మోసం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. గతంలో రామోజీరావును కలిసి షేర్లు ఇవ్వాలని అడిగితే తుపాకీతో బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మారదర్శిలో పెట్టుబడి

యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఇతరులపై ఏపీ సీఐడీ ఐపీసీ సెక్షన్లు 420, 467, 120B, R/w 34 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసింది. తమ షేర్‌ హోల్డింగ్‌పై స్పష్టత రావడంతో ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నట్లు ఫిర్యాదుదారుడు యూరిరెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా జొన్నపాడుకు చెందిన తన తండ్రి గాదిరెడ్డి జగన్నాథరెడ్డి విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసుకుని దేశానికి తిరిగి వచ్చి దిల్లీ కేంద్రంగా నవభారత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీలను స్థాపించారని తెలిపారు. కృష్ణా జిల్లా పెదపారుపూడికి చెందిన చెరుకూరి రామోజీరావును కమ్యూనిస్ట్‌ నేత అయిన కొండపల్లి సీతారామయ్య ఉద్యోగం కోసం జీజే రెడ్డి వద్దకు పంపారన్నారు. దీంతో దిల్లీలోని తన కంపెనీలో జీజే రెడ్డి... రామోజీరావుకు టైపిస్ట్‌ కమ్‌ స్టెనో ఉద్యోగం ఇచ్చారన్నారు. రామోజీరావు తన నైపుణ్యంతో తన తండ్రికి దగ్గరయ్యారన్నారు. ఆ తర్వాత మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీ కోసం తన తండ్రి రూ.5 వేలు పెట్టుబడి పెట్టారని తెలిపారు. దీంతో జీజే రెడ్డికి రామోజీరావు షేర్లు కేటాయించారన్నారు.

షేర్లు శైలజా కిరణ్ పేరిట బదిలీ

1985లో తన తండ్రి మరణించారని యూరిరెడ్డి తెలిపారు. అయితే తన తండ్రి పేరిట ఉన్న షేర్ల గురించి 2014లో ఓ పేపర్ లో వచ్చిన కథనం ఆధారంగా తెలిసిందన్నారు. అయితే తన షేర్ల కోసం రామోజీరావు పలుమార్లు సంప్రదించామని, చివరకు 2016లో ఆయను కలిశామన్నారు. తన తండ్రి జీజే రెడ్డి పేరుపై ఉన్న షేర్లను తన పేరు మీదకు మార్చాలని కోరామన్నారు. ఆ షేర్లు బదిలీ చేస్తామని చెప్పి మోసం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు యూరిరెడ్డి. తుపాకీతో బెదిరించి ఓ ఖాళీ అఫిడవిట్‌ పై బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. ఆ షేర్లు శైలజా కిరణ్‌ పేరిట బదలాయించడంతో సీఐడీని ఆశ్రయించామన్నారు.

Whats_app_banner