Eenadu Ramoji Rao : : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత-ramoji group chairman ramoji rao passes away ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Eenadu Ramoji Rao : : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

Eenadu Ramoji Rao : : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

Eenadu Ramoji Rao Passes Away: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అస్తమించారు.

రామోజీరావు

Eenadu Ramoji Rao Passes Away: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(87) శనివారం ఉదయం అస్తమించారు. గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన… హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4. 50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలిస్తున్నారు.

రామోజీరావు ప్రస్థానం….

రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న జన్మించారు. గుడివాడలో విద్యాభాస్యం కొనసాగింది.  1962 అక్టోబరులో మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థను స్థాపించారు. 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు.

ఆగస్టు 10 1974న విశాఖపట్నంలో రామోజీరావు  ‘ఈనాడు’ పత్రికను స్థాపించారు. అతి తక్కువ కాలంలోనే ఈ పత్రిక సంచలనాలను సృష్టించింది. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక పాఠకులను సంపాదించుకుంది.  ప్రాంతీయ దినపత్రికల చర్రితలో ‘ఈనాడు’ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. క్రమంగా హైదరాబాద్ ఎడిషిన్ తో పాటు జిల్లాల ఎడిషన్ లు కూడా ప్రచురితమయ్యాయి. 

సినీ ప్రేమికుల కోసం రామోజీరావు ‘సితార’ పత్రికను ప్రారంభించారు. ‘చతుర’, ‘విపుల’ మాస పత్రికలను కూడా తీసుకొచ్చారు. ‘ప్రియా ఫుడ్స్‌’ తో పాటు 1983లో ‘ఉషాకిరణ్‌ మూవీస్‌’ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ లో అనేక చిత్రాలను నిర్మించారు.   1990లో రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ను కూడా ప్రారంభించారు.

ప్రపంచలోనే అతి పెద్ద చిత్రనగరి ‘రామోజీ ఫిల్మ్‌ సిటీ’ని కూడా రామోజీరావు ఏర్పాటు చేశారు. ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పరిధిలో విస్తరించి ఉంటుంది. ‘ఈటీవీ’ ఆధ్వర్యంలో ఆరు ప్రాంతీయ ఛానళ్లను తీసుకొచ్చిని రామోజీరావు…. 2002లో ‘రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌’ను కూడా ఏర్పాటు చశారు.

పేపర్, టీవీ మీడియాలోనే కాకుండా… డిజిటల్ మార్కెట్ లోకి విస్తరించేందుకు ఈటీవీ భారత్ పేరుతో మొబైల్ న్యూస్ యాప్ ను కూడా తీసుకొచ్చారు. రామోజీరావుకు భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘పద్మవిభూషణ్‌’ పురస్కారాన్ని కూడా ప్రకటించింది.