Ramoji Rao Passes Away : అక్షరయోధుడు రామోజీరావుకు ప్రముఖుల నివాళులు - ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు-political leaders and celebrities have expressed their condolences on the death of ramoji rao ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ramoji Rao Passes Away : అక్షరయోధుడు రామోజీరావుకు ప్రముఖుల నివాళులు - ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

Ramoji Rao Passes Away : అక్షరయోధుడు రామోజీరావుకు ప్రముఖుల నివాళులు - ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 08, 2024 09:28 AM IST

Eenadu Ramoji Rao Passes Away : ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్నిగుర్తు చేసుకుంటున్నారు.

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు

Eenadu Ramoji Rao Passes Away: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్నిగుర్తు చేసుకుంటున్నారు.

అతి సామాన్య జీవితం నుంచి అత్యంత శక్తివంతుడిగా, అక్షరయోధుడిగా సాగిన జీవిత ప్రయాణాన్ని నెమరవేసుకుంటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. రామోజీరావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

రామోజీరావు అక్షర యోధుడు - చంద్రబాబు

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు.

అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని...కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు పేర్కొన్నారు.

రామోజీరావు మరణం రాష్ట్రానికే కాదు...దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అని కొనియాడారు. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని అన్నారు. రామోజీరావుతో తనుకు ఉన్న 4 దశాబ్దాల అనుబంధాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు.

రామోజీ రావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలను స్మరించుకున్నారు.

దార్శనికుడు - ప్రధాని మోదీ

రామోజీరావు మృతి పట్ల నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. “రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీ. పత్రికారంగంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. పత్రిక, సినీ, వ్యాపార రంగాలపై చెరగని ముద్ర వేశారు” అని మోదీ పోస్ట్ చేశారు.

ఆ జ్ఞాపకాలు మరవలేను - జూనియర్ ఎన్టీఆర్

రామోజీ రావు మృతిపై హీరో జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. “శ్రీరామోజీ గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ట్వీట్ చేశారు.

అత్యంత బాధాకారం - పవన్ కల్యాణ్

పద్మవిభూషణ్ రామోజీ రావు మరణ వార్త అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 'మీడియా రంగానికి ఇది తీరని లోటు. భారత సినీరంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించి ఎంతో కృషి చేశారు" అని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు.

రామోజీ రావు మరణంపై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సీని ప్రముఖులే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన్ను అభిమానించే చాలా మంది సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

రామోజీరావు(87) ఇవాళ ఉదయం అస్తమించారు. గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన… హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4. 50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలిస్తున్నారు.

*

Whats_app_banner