Sunitha On YS Avinash Reddy : అవినాష్ లాంటి హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదు, సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
06 April 2024, 14:59 IST
- Sunitha On YS Avinash Reddy : వివేకాను హత్య చేసిన వాళ్లు దర్జాగా బయట తిరుగుతున్నాయని సునీతా రెడ్డి ఆరోపించారు. హంతకులు అధికారంలో ఉంటే తనకు న్యాయం జరగదన్నారు. అవినాష్ ఓటమే తన లక్ష్యమన్నారు.
సునీతా రెడ్డి
Sunitha On YS Avinash Reddy : వైఎస్ఆర్ మరణాంతరం జరిగిన పరిణామాలు రాజకీయ కుట్రలో భాగమేమని వైఎస్ సునీతా రెడ్డి(YS Sunitha Reddy) ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు న్యాయం చేయాలని 'జస్టిస్ ఫర్ వివేకా' పేరుతో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రజంటేషన్ ఇచ్చారు. వివేకా హత్య రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందన్నారు. తాను ఏ రాజకీయ పార్టీలో లేనని, తనకు కావాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తున్నానన్నారు. అందులో భాగంగానే రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్స్ కలుస్తున్నానన్నారు. తనకు ఫేవర్ చేయాలని ఎవరిని కోరడంలేదని, తన తండ్రి హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. సీబీఐ(CBI), కోర్టులలో న్యాయం ఆలస్యం అవుతుందన్నారు. అందుకే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నానని సునీత చెప్పారు. అవినాష్ రెడ్డి(Avinash Reddy) లాంటి హంతకులు చట్టసభలకు వెళ్లకూడదని ఆమె అన్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లో సానుభూతి కోసం తన తండ్రి వివేకాను అతి దారుణంగా హత్య చేశారని సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గెలుపు కోసం వివేకా(Viveka) ప్రచారం చేశారని గుర్తుచేశారు. ప్రతికారం తీర్చుకోవడం తన ధ్యేయం కాదన్న సునీతా రెడ్డి...అప్పుడే కడప(Kadapa)కు వెళ్లి తానే నరికేసే దానిని అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
హంతకులు దర్జాగా తిరుగుతుంటే
వివేకాను అతి దారుణంగా హత్య చేసిన వాళ్లు దర్జాగా బయట తిరుగుతుంటే ఇన్ని వ్యవస్థలు ఏం చేయలేకపోతున్నాయని సునీతా రెడ్డి(Sunitha Reddy) ఆవేదన చెందారు. హంతకులు అధికారంలో ఉంటే తనకు ఎప్పటికీ న్యాయం జరగదన్నారు. గత ఐదేళ్లుగా వివేకా హత్య కేసు(Viveka Murder case)లో న్యాయం కోసం పోరాడుతున్నాయని, ఎన్నో కష్టాలు చూశానన్నారు. తనకు ఇంత చదువు, తెలివి, స్థోమత ఉన్నా ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నానన్నారు. ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని(YS Avinash Reddy) గెలవకుండా చేయడమే తన లక్ష్యమని చెప్పారు. వైఎస్‌ఆర్ మరణించినప్పుడు జగన్(YS Jagan) ఎంపీగా ఉన్నారని, పులివెందులలో ఎవరు పోటీ చేయాలనే విషయంపై చర్చ జరిగిందన్నారు. అయితే వైఎస్ భాస్కర్ రెడ్డి పేరు చర్చలో ముందుకు వచ్చిందని, కానీ ఆయన పోటీ చేయడాన్ని వివేకా అంగీకరించలేదన్నారు. వైఎస్ షర్మిల లేదా విజయమ్మను బరిలో దించాలని సూచించారన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఇచ్చిందని, కానీ దీనిని జగన్ వ్యతిరేకించారన్నారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో జగన్, విజయమ్మ కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం, 2011 ఉపఎన్నికలో జగన్, విజయమ్మ(Vijayamma) తిరిగి పోటీ చేశారన్నారు. ఆ తర్వాత వివేకా కాంగ్రెస్ కు రాజీనామా చేసి జగన్‌తో ఉండాలని వైసీపీలో చేరారన్నారు.
షర్మిలకు ఆదరణ పెరుగుతోందనే
వైసీపీ కష్టాల్లో ఉంటే షర్మిల(YS Sharmila) పార్టీని తన భుజాన వేసుకుని ముందు నడిపించారని సునీతా రెడ్డి తెలిపారు. వైసీపీ(YSRCP) తరఫున పాదయాత్రలు, ప్రచారాలు చేసిన షర్మిల ఉపఎన్నికల్లో పార్టీని గెలిపించారన్నారు. ఆ ఎన్నికల్లో విజయంతో షర్మిల ఆదరణ పెరగడంతో...ఆమె క్రమంగా పక్కన పెట్టారన్నారు. 2014 ఎన్నికల్లో కడప లోక్ సభ నుంచి షర్మిల పోటీ చేస్తారని అందరూ భావించారని, కానీ అనూహ్యంగా అవినాష్ రెడ్డికి (YS Avinash Reddy)పోటీలో దించారన్నారు. ఈ నిర్ణయం వివేకాకు ఇష్టం లేదన్నారు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డిని(YS Vivekananda Reddy) ఓడించారని ఆరోపించారు. అవినాష్ రెడ్డి కుటుంబం వెన్నుపోటుతో వివేకా ఓడిపోయారన్నారు. తన బంధువులే వివేకాను హత్య చేశారంటే తాను మొదట నమ్మలేదన్నారు. వాళ్ల పూర్తి నమ్మి మోసపోయానని సునీత అన్నారు.