తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Mega Dsc 2024 : 16,347 పోస్టులతో ఏపీ మెగా డీఎస్సీ - ఆ తేదీలోపే భర్తీ, కేటగిరి వారీగా ఖాళీల వివరాలివే..

AP Mega DSC 2024 : 16,347 పోస్టులతో ఏపీ మెగా డీఎస్సీ - ఆ తేదీలోపే భర్తీ, కేటగిరి వారీగా ఖాళీల వివరాలివే..

15 June 2024, 7:54 IST

google News
    • AP Mega DSC Recruitment 2024 Updates : ఏపీలో 16,347 టీచర్ పోస్టుల భర్తీగా మెగా డీఎస్సీ రాబోతుంది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై సీఎం చంద్రబాబు సంతకం చేయటంతో… విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది.
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ - 2024
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ - 2024

ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ - 2024

AP Mega DSC Recruitment 2024 : ఏపీలో కూటమి ప్రభుత్వంలోకి రావటంతో టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్తను చెప్పిన సంగతి తెలిసిందే. మెగా డీఎస్సీ దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం కూడా చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ కూడా కసరత్తు షురూ చేసింది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.

పోస్టుల వివరాలు…

తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.

  • స్కూల్ అసిస్టెంట్ - 7,725
  • ఎస్‌జీటీ - 6371
  • టీజీటీ - 1781
  • పీజీటీ - 286
  • పీఈటీ - 132
  • ప్రిన్సిపల్స్ - 52

త్వరలోనే కొత్త నోటిఫికేషన్….

వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ), 2,299 స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), 1,264 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్‌ పోస్టులు ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తి అయింది. డీఎస్సీతో పాటే టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. టెట్ ఫలితాలు రావాల్సి ఉంది. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తో డీఎస్సీ పరీక్షలు మాత్రం వాయిదా పడుతూ వచ్చాయి. ఇంతలోనే రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో…. సీన్ మారిపోయింది. కొత్త ప్రభుత్వం మెగా డీఎస్సీ విడుదలకు శ్రీకారం చుట్టింది.

ప్రక్రియ పూర్తికి డెడ్ లైన్….

విద్యాశాఖ కొత్తగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. గత డీఎస్సీ ప్రకటనను అనుసరించి దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయక్కర్లేదు. కొత్తగా ఏ జిల్లాలకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఛాన్స్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం ప్రక్రియను 6 నెలల్లోపే పూర్తి చేయనున్నారు.

ఏ క్షణమైనా టెట్ ఫలితాలు….

మరోవైపు ఏపీ టెట్ ఫలితాల కోసం చాలా మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరటంతో ఏ క్షణమైనా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 7న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది. ‌ఫిబ్రవరి 23 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు మార్చి 9న ముగిశాయి.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 14న ఏపీ టెట్ ఫలితాలు విడుదల కాావాల్సిఉంది. కానీ ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఏపీ టెట్ ఫలితాలు విడుదలకు బ్రేక్ పడింది.‌ దీంతో ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయోనని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఫలితాలను బట్టీ డీఎస్సీకి ప్రిపేర్ అవ్వడంపై ఒక స్పష్టత వస్తుందని‌ భావిస్తున్నారు‌.

16వేలకు పైగా టీచర్ పోస్టులతో కూడిన దస్త్రంపై ఏపీ సీఎం చంద్రబాబు సంతకం చేసిన నేపథ్యంలో…. త్వరలోనే అధికారికంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణలోనూ కొత్త ప్రభుత్వం రావటంతో గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసి…. పోస్టులను పెంచి కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే…!

తదుపరి వ్యాసం