తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Free Gas : ఉచిత గ్యాస్ కోసం పాట్లు.. ఈకేవైసీతో ఇబ్బందులు.. రేప‌టి నుంచే గ్యాస్ బుకింగ్‌లు

AP Free Gas : ఉచిత గ్యాస్ కోసం పాట్లు.. ఈకేవైసీతో ఇబ్బందులు.. రేప‌టి నుంచే గ్యాస్ బుకింగ్‌లు

HT Telugu Desk HT Telugu

28 October 2024, 17:14 IST

google News
    • AP Free Gas : రాష్ట్ర ప్ర‌భుత్వం సూప‌ర్ సిక్స్‌లో భాగంగా ప్ర‌క‌టించిన ఉచిత గ్యాస్ కోసం ప్ర‌జ‌లకు పాట్లు త‌ప్పేట‌ట్లు లేవు. ఉచిత గ్యాస్ ప‌థ‌కం అమ‌ల‌కు ఈకేవైసీని త‌ప్పనిస‌రి చేయ‌డంతో.. చాలా మంది ల‌బ్ధిదారుల‌కు క‌ష్టాలు మొద‌లైయ్యాయి. మ‌రోవైపు రేప‌టినుంచి గ్యాస్ బుకింగ్‌లు ప్రారంభ‌ం కానున్నాయి.
ఉచిత గ్యాస్ కోసం పాట్లు
ఉచిత గ్యాస్ కోసం పాట్లు

ఉచిత గ్యాస్ కోసం పాట్లు

తెల్ల రేష‌న్ కార్డు, ఆధార్ కార్డులను ప్రాతిప‌దిక‌గా తీసుకొని వంట‌గ్యాస్ సిలిండ‌ర్ రాయితీ ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. రాయితీ సొమ్మును బ్యాంకు ఖాతాల‌కు జ‌మ చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. వైట్ రేష‌న్ కార్డుల స‌మాచారం వంట గ్యాస్ ఏజెన్సీల వ‌ద్ద అందుబాటులో ఉంటేగాని బుకింగ్ సాధ్య‌ప‌డ‌దు. ప్ర‌స్తుతం వంట‌గ్యాస్ ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్న‌ప్ప‌టికీ.. ఆధార్‌, ఫోన్ నెంబ‌ర్ ఆధారంగా బుకింగ్ అవుతోంది. రాయితీ పొందాలంటే రేష‌న్ కార్డు వివ‌రాలను పొంద‌ప‌ర్చాల్సి ఉంటుంది. ఆ వివ‌రాలు ఎలా పొంద ప‌ర్చాల‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త కొర‌వ‌డింది. ఈ విష‌యంపై పౌర స‌ర‌ఫ‌రాల శాఖ అధికారుల‌కు పూర్తి స‌మాచారం రాలేదు.

20 ల‌క్షల మంది..

మ‌రోవైపు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల ప‌థ‌కానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఈకేవైసీని త‌ప్ప‌నిస‌రి చేసింది. దీంతో ప్ర‌జ‌లకు క‌ష్టాలు ప్రారంభ‌మైయ్యాయి. ఈకేవైసీకి దూరంగా నేటికీ 20 ల‌క్ష‌ల వినియోగ‌దారులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేష‌న్ కార్డుదారులు 1.47 కోట్ల‌ మంది ఉండ‌గా.. అందులో నేటికీ సుమారు 20 ల‌క్ష‌ల‌పైగా గ్యాస్ ఏజెన్సీల వ‌ద్ద ఈకేవైసీ చేసుకోలేద‌ని అధికారులు చెబుతున్నారు. ఈకేవైసీ కానిప‌క్షంలో గ్యాస్ కంపెనీల వ‌ద్ద ఉండే డేటా, ప్ర‌భుత్వం వ‌ద్ద ఉండే డేటా స‌రిపోయే అవ‌కాశాలు లేవు.

ఏజెన్సీల చుట్టూ..

వైట్ రేష‌న్ కార్డు ఉన్న‌ప్ప‌టికీ ఉచిత గ్యాస్ పొందే అవ‌కాశం కోల్పోయే ప్ర‌మాదం ఉంది. దీంతో పెద్ద సంఖ్య‌లో వినియోగ‌దారులు ఈకేవైసీ న‌మోదు కోసం గ్యాస్ ఏజెన్సీల వ‌ద్ద‌కు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్వ‌ర్లు మొరాయించ‌డంతో గంట‌ల త‌ర‌బ‌డి గ్యాస్ వినియోగ‌దారులు ఎదురుచూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎదురు ఫ‌లితం లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు వెనుదిరుగుతున్నారు. ఇదే అదునుగా గ్యాస్ పాయింట్ల వ‌ద్ద వినియోగదారుల‌ను గ్యాస్ రెగ్యులేట‌ర్స్‌, సుర‌క్ష పైప్‌ను మార్చుకోవాల‌ని ఏజెన్సీ నిర్వాహ‌కులు ఒత్తిడి తీసుకువ‌స్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1,100 డిస్ట్రిబ్యూష‌న్ ఏజెన్సీ ద్వారా 1.55 కోట్ల మంది వినియోగ‌దారులకు గ్యాస్ సిలిండ‌ర్లు స‌ర‌ఫ‌రా జ‌రుగుతున్నాయి. అందులో 1.47 కోట్లు మంది తెల్ల‌రంగు రేష‌న్ కార్డుల వినియోగ‌దారులు ఉన్నారు. అందులో కేవలం 9.65 లక్షల గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం వర్తింస్తుంది. తెల్ల రేష‌న్ కార్డు లేనివారిలో కూడా పేద‌లు ఉన్న‌ప్ప‌టికీ.. వారు ఉచిత గ్యాస్ ప‌థ‌కానికి అన‌ర్హ‌లుగా ఉన్నారు.

ఉమ్మ‌డి కుటుంబాలు విడిపోయిన వారు, నూత‌నంగా వివాహాలైన వారు కొత్త రేష‌న్ కార్డులు కోసం ద‌ర‌ఖాస్తులు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. 64 వేల‌కు పైగా ద‌ర‌ఖాస్తులు ఇప్ప‌టికే పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు గ్యాస్ కనెక్షన్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద లక్షల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి.

ఉచిత గ్యాస్‌కు తెల్ల‌రేష‌న్ కార్డు, ఆధార్ లింక్ త‌ప్ప‌ని స‌రి చేశారు. వారికి మాత్ర‌మే ఉచిత గ్యాస్ వ‌ర్తిస్తుంది. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఈ దీపావళి నుండే మూడు ఉచిత గ్యాస్ సిలిండ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లను పూర్తయ్యాయి. సంబందిత మార్గదర్శకాలను, విధి విధానాలను నిర్థేశిస్తూ శుక్ర‌వారం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది.

ప‌థ‌కం అమ‌లు ఇలా..

1. ఈ పథకం అమల్లో భాగంగా ఈ నెల 29 నుండి గ్యాస్ బుకింగ్స్ ప్రారంభిస్తారు.

2. గ్యాస్ బుకింగ్ చేసుకోగానే ఒక మేసేజ్ లబ్దిదారుని ఫోన్ నెంబరుకు వెళుతుంది.

3. గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, 48 గంటల్లో గ్రామీణా ప్రాంతాల్లో గ్యాస్ సిలిండ్లను డెలివరీ చేయడం జరుగుతుంది.

4. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే డీబీటీ విధానం ద్వారా లబ్దిదారుల ఖాతాలోని రాయితీ సొమ్ము జమ అవుతుంది.

5. ప్రభుత్వం అందజేసే మూడు ఉచిత సిలిండర్లలో మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చు.

6. ఈ పథకం అమలుకై ఏడాదిని మూడు బ్లాక్ పీడియడ్లుగా పరిగణించడం జరుగుతుంది. మొదటి బ్లాక్ పీడియడ్ ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు, రెండో బ్లాక్ పీడియడ్ ను ఆగస్టు 1 నుండి నవంబరు 31 వరకు, మూడో బ్లాక్ పీడియడ్‌ను డిసెంబరు 1 నుండి మార్చి 31 వరకు పరిగణించడం జరుగుతుంది.

7. ఈ పథకం అమల్లో లబ్దిదారులకు ఏమన్నా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.

8. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వెంటనే ప్రతి ఇంటికీ మొదటి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడం జరుగుతుంది.

రూ.2,684.75 కోట్ల భారం..

ఈ పథకం అమలుకై ప్రతి ఏడాది ప్రభుత్వంపై రూ.2,684.75 కోట్ల మేర భారం పడుతుంద‌ని ప్రభుత్వం అంచ‌నా వేసింది. ఈ పథకం అమలుకు సంబందించి ఇప్పటికే మూడు ఆయిల్ కంపెనీలతో చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ పథకం కోసం ఆయిల్ కంపెనీలకు అడ్వాన్స్‌గా రూ.894.92 కోట్లను ఈ నెల 29న చెక్కు రూపేణా చెల్లిస్తారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం