AP Cabinet Decisions : దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, శారదపీఠానికి షాక్- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే-ap cabinet green signals to free gas cylinder scheme other key decisions in cabinet meeting ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cabinet Decisions : దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, శారదపీఠానికి షాక్- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

AP Cabinet Decisions : దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, శారదపీఠానికి షాక్- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

Bandaru Satyaprasad HT Telugu
Oct 23, 2024 05:27 PM IST

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు, శారదాపీఠం భూములు వెనక్కి, ఉచిత ఇసుక విధానంపై పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, శారదపీఠానికి షాక్- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే
దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, శారదపీఠానికి షాక్- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం అమలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. లబ్దిదారులు ముందుగా నగదు చెల్లించి సిలిండర్‌ కొనుగోలు చేస్తే 48 గంటల్లో వారి ఖాతాల్లో నగదు జమ చేసేలా ఈ పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఒకేసారి 3 ఉచిత సిలిండర్లు తీసుకోకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్‌ చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఉచిత సిలిండర్ల పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2700 కోట్ల భారం పడుతుందని కేబినెట్ తెలిపింది.

శారదాపీఠం భూముల కేటాయింపు రద్దు

విశాఖ శారదాపీఠానికి వైసీపీ ప్రభుత్వం అప్పగించిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వైసీపీ హయాంలో శారదా పీఠానికి భీమిలికి సమీపంలో కొత్తవలస గ్రామంలో సముద్ర తీరానికి దగ్గర్లో రూ.కోట్ల విలువ చేసే భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున అప్పగించింది. గత ప్రభుత్వంలో జరిగిన ఈ భూ కేటాయింపులపై సమీక్ష నిర్వహించింది. కోట్ల విలువైన భూమిని అక్రమంగా కేటాయించారన్న ఆరోపణలతో శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

పట్టా భూముల్లో ఇసుక తవ్వుకునే వెసులుబాటు

ఉచిత ఇసుక విధానంలో సీనరేజి, జీఎస్టీ ఛార్జీల రద్దుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీనరేజి ఛార్జీల రద్దుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.264 కోట్ల మేర భారంపడుతుందని అధికారులు అంచనా వేశారు. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన లక్ష్యం నెరవేర్చేందుకు ఈ నష్టం భరిద్దామని సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశంలో అన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పట్టా భూముల్లో యజమానులు ఎవరి ఇసుక వారు తవ్వుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉచిత ఇసుక విధానం సరిగ్గా అమలు అయ్యేలా చూడాలని మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇసుక లేని జిల్లాల్లో డీలర్లను నియమించి ధరల నియంత్రణ చేపట్టాలన్నారు. దేవాలయాల కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించి, సభ్యుల సంఖ్య పెంచేందుకు చట్ట సవరణ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

చెత్తపన్ను రద్దు నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్యను 15 నుంచి 17 వరకు పెంచాలని నిర్ణయించింది. ఇద్దరు బ్రాహ్మణులు పాలకమండలిలో ఉండాలని కేబినెట్ నిర్ణయించింది.

మంత్రులకు క్లాస్

కేబినెట్‌ సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మంత్రులు ప్రోయాక్టివ్ గా పని చేయాలని సీఎం సూచించారు. మంత్రులు స్పీడ్ పెంచాలన్నారు. మంత్రుల పనితీరుపై క్లాస్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రులు కూడా తనతో సమానంగా పోటీ పడి పనిచేయాలన్నారు. ఇక నుంచి ప్రతిరోజు ముఖ్యమేనని సీఎం అన్నారు. కొందరు మంత్రులు నిర్లిప్తంగా ఉన్నారని, ఇలా ఉంటే పని చేయలేరంటూ హితవు పలికారని సమాచారం.

Whats_app_banner

సంబంధిత కథనం