Ys Jagan On Sand: ఇసుక డబ్బంతా ఎవరి జేబులోకి వెళుతోంది.. ఉచిత ఇసుక ఎక్కడని నిలదీసిన జగన్-jagan questioned that all the money from the sale of sand is going into whose pocket ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan On Sand: ఇసుక డబ్బంతా ఎవరి జేబులోకి వెళుతోంది.. ఉచిత ఇసుక ఎక్కడని నిలదీసిన జగన్

Ys Jagan On Sand: ఇసుక డబ్బంతా ఎవరి జేబులోకి వెళుతోంది.. ఉచిత ఇసుక ఎక్కడని నిలదీసిన జగన్

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 14, 2024 06:24 AM IST

Ys Jagan On Sand: రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా అని వైసీపీ అధ్యక్షుడు జగన్ నిలదీశారు. ఇసుక ద్వారా వచ్చే డబ్బంతా ఎక్కడికి వెళుతోందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో ఖజానాకు డబ్బులు వచ్చేవని ఇప్పుడు ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళుతోందని నిలదీశారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్‌
మాజీ ముఖ్యమంత్రి జగన్‌

Ys Jagan On Sand: ఇసుక విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నాయని గోల చేసి ఇప్పుడు టీడీపీ నేతలు చేస్తున్నదేమిటని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎక్స్‌ వేదికగా ఇసుక విక్రయాలపై పలు ఆరోపణలు చేశారు. పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఓ ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, ఆ ఇళ్లలో దోపిడీలకు దిగినట్టు... ఇసుక దోపిడీ వ్యవహారంలో చంద్రబాబు పద్ధతి అలాగే ఉందని ఆరోపించారు.

గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటి? అని నిలదీశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా? మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదు. అసలు ఇసుక‌ కొందామంటేనే మా ప్రభుత్వంలోకన్నా రేటు రెండింతలు ఉంది అని జగన్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయారా? ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా? అధికార దుర్వినియోగంతో ఇసుకచుట్టూ ఒక మాఫియాను మీరు ఏర్పాటు చేయలేదా? భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా? లేదా? అని ప్రశ్నించారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా? అని జగన్ ప్రశ్నించారు. వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం స్టాక్‌యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవకముందే ఎక్కడకు పోయింది? అని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే టీడీపీ, ఆ కూటమికి చెందిన పార్టీలనేతలు దోచేయలేదా? కొండల్లా ఉండే ఇసుక నిల్వలు కొన్నిరోజుల వ్యవధిలోనే మాయం అయిపోయాయన్నది నిజంకాదా? అన్నారు.

2014-19 మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేసిన వ్యవహారం మళ్లీ ఇప్పుడు పునరావృతం అయ్యిందన్నది వాస్తవమన్నారు. ఈ విధానానికి సృష్టికర్త, మూల పురుషుడు చంద్రబాబేనని ఆరోపించారు.

ఆ రోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు, ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టుగా బిల్డప్‌ ఇచ్చారు, 2 నెలలు కాకుండానే దాన్నీ రద్దుచేసి టెండర్లు నిర్వహిస్తామన్నారని, చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా మీ మనుషులకు అప్పగించారని . మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారు. ఈ నది, ఆ నది అని లేకుండా ప్రతిచోటా ఇసుకను కొల్లగొట్టి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు.

ఇప్పుడు కూడా సేమ్‌ టు సేమ్‌ జరుగుతున్నదని, అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినా ఇప్పటికీ స్పష్టమైన ఇసుక విధానం లేదని, పేరుకు ఉచితం అంటున్నారంతేనని.. మొత్తం వ్యవహారం అంతా చంద్రబాబు, ఆయన ముఠా వల్ల, ముఠాకొరకు, ముఠాచేతులమీదుగా నడుస్తోందని ఆరోపించారు. పాలసీని ప్రకటించకుండా ప్రజలంతా దసరా పండుగలో ఉంటే, దొంగచాటుగా టెండర్లు పిలవడం నిజంకాదా అని నిలదీశారు.

దేశంలో ఎక్కడా చూడని విధంగా ఉద్దేశపూర్వకంగా కేవలం 2 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది, ఎవ్వరినీ టెండర్లలో పాల్గొనకుండా దౌర్జన్యాలకు పాల్పడిన మాట వాస్తవం కాదా అన్నారు.

గతంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేసిందని దోపిడీలకు అడ్డుకట్టవేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందించిందని చెప్పుకొచ్చారు. అత్యంత పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్‌ఫాం మీద ఇ-టెండర్లు నిర్వహించిందని రీచ్‌ల వద్ద ఆపరేషన్‌ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరాచేసిందని ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలా చేసిందన్నారు.

రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుకరేట్లను ప్రకటించింది. వైయస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చిందని ప్రజలకు తక్కువ ధరకు ఒకవైపు ఇస్తూ మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్టుగా చేసింది. రేట్లపై సెబ్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకుంది. తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేసిందని జగన్ పేర్కొన్నారు.

ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఒక్క రూపాయి రావడంలేదన్నది వాస్తవం కాదా? అన్నారు. అదే సమయంలో ప్రజలకూ ఉచితంగా అందడం లేదన్నది నిజం కాదా? ఇసుక ఉచితమే అయితే వైయస్సార్‌సీపీ హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి? అని.. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబు అంటూ జగన్ ప్రశ్నించారు.

Whats_app_banner