TSRTC : టీఎస్ఆర్టీసీకి రూ.21 కోట్లు ఎగవేసిన యాడ్ ఏజెన్సీ, నిర్వాహకుడు అరెస్ట్!
TSRTC : టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రకటనల ఒప్పందం ఉల్లంఘించిన కేసులో గో రూరల్ ఇండియా సంస్థ నిర్వాహకుడు సునీల్ అరెస్ట్ అయ్యారు. టీఎస్ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.21.73 కోట్లను ఈ సంస్థ ఎగవేసింది. బకాయిలను ఎగవేసే సంస్థలపై చట్టపర చర్యలు తీసుకుంటామని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది.
TSRTC : తమ బస్సుల్లో ప్రకటనల ఒప్పందం మేరకు చెల్లించాల్సిన రూ.21.73 కోట్లను మోసం చేసిన కేసులో " గో రూరల్ ఇండియా " సంస్థ నిర్వాహకుడు వి.సునీల్ అరెస్ట్ కావాడాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం స్వాగతించింది. ఒప్పందాలను ఉల్లంఘించి బకాయిలను ఎగవేసే సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టీఎస్ఆర్టీసీ హెచ్చరించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలో తిరిగే మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రకటనల కోసం గో రూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీ 2015 సెప్టెంబర్ లో టీఎస్ఆర్టీసీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆరు సంవత్సరాలకు గాను 2021 సెప్టెంబర్ వరకు అగ్రిమెంట్ చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం సకాలంలో లైసెన్స్ ఫీజును ఆ సంస్థ చెల్లించలేదు. హైదరాబాద్ రీజియన్ లో రూ.10.75 కోట్లు, సికింద్రాబాద్ రీజియన్ లో రూ.10.98 కోట్లు బకాయిలున్నాయి.
యాడ్ ఏజెన్సీ నిర్వాహకుడు అరెస్ట్
టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెండింగ్ బకాయిలపై సమీక్ష జరిపారు. సకాలంలో లైసెన్స్ ఫీజు చెల్లించని సంస్థలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల నేపథ్యంలో గో రూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీకి పలుమార్లు లీగల్ నోటీసులను సంస్థ జారీ చేసింది. ఆ నోటీసులకు స్పందించిన యాడ్ ఏజెన్సీ...... రూ.55 లక్షలకు చెక్ లకు ఇచ్చింది. అవి చెల్లలేదు. ఈ మోసంపై అప్జల్ గంజ్, మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా టీఎస్ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసు హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ కు బదిలీ అయింది. విచారణ చేపట్టిన దర్యాప్తు అధికారులు ‘గో రూరల్ ఇండియా’ సంస్థ నిర్వాహకుడు వి.సునీల్ ను శుక్రవారం అరెస్ట్ చేశారు.ఉద్దేశపూర్వకంగా లైసెన్స్ ఫీజులను ఎగవేసే సంస్థలపై నిబంధనల మేరకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించకుండా మోసాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని తేల్చి చెప్పింది.
ఆర్టీసీ బస్సులో బంగారం చోరీ
టీఎస్ఆర్టీసీ బస్సులో శుక్రవారం బంగారం చోరీ జరిగింది. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లికి చెందిన పోసాని అనే మహిళ బోధన్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికి ఆ మహిళ మెడలోనీ 2 తులాల గుండ్ల గొలుసు లేకపోవడంతో ఆందోళన చెంది ఈ విషయాన్ని బస్సు కండక్టర్ కు తెలియచేసింది. దీంతో బస్సు నిలిపివేసి ప్రయాణికులను తనిఖీ చేశారు. అప్పటికీ లభించకపోవడంతో బాధిత మహిళ సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
పురుషులకు ప్రత్యేక బస్సులు
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతోంది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ బాగా పెరిగింది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు దొరకడం కష్టంగా మారింది. డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కుని నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని పురుషులు అంటున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ పురుషులకు గుడ్ న్యూస్ చెప్పింది. పురుషులకు మాత్రమే ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చింది.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం