Medak Medical College : ఎన్నో ఏళ్ల కల సాకారం.. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభం
Medak Medical College : మెదక్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల కల సాకారమైంది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరునికి నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
మెదక్ పట్టణంలోని పిల్లి కొట్యాల్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. దీంట్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభోత్సవానికి.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే రోహిత్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దామోదర్ రాజనర్సింహా మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలోనే నూతనంగా 5 క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుత కాలంలో డయాబెటిస్, క్యాన్సర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. వీటిపై గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. క్యాన్సర్ కోసం ప్రతి జిల్లాలో మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
220 పడకల ఆసుపత్రి..
ప్రభుత్వ వైద్యం అందరికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాజనర్సింహా వివరించారు. 90 శాతం చికిత్స స్థానిక ప్రాంతంలోనే జరగాలని, హైదరాబాద్ వంటి నగరాలకు వైద్యం కోసం వెళ్లకుండా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. యాక్సిడెంట్‌లలో మొదటి గంట ప్రధానం అనే ఉదేశ్యంతో.. 74 ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు చేసి.. ప్రతి జిల్లాలో, మండల స్థాయిలో సామాన్యులకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకవచ్చే ప్రణాళిక చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందేవిధంగా జిల్లాలో 220 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం, నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
వైద్య వృత్తికి న్యాయం చేయాలి..
వైద్య వృత్తి అంటేనే నిరంతరం నేర్చుకుంటూనే ముందుకు సాగుతారని.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. విద్యార్థులు వైద్య వృత్తికి న్యాయం చేయాలని, చదువుతూనే టెక్నాలజీతో పోటీపడాలన్నారు. వైద్య సేవలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సేవ చేయాలని యువ డాక్టర్లకు పిలుపునిచ్చారు. తల్లితండ్రులకు, గురువులకు పేరు ప్రఖ్యాతలు తీసుకరావాలని సూచించారు.
దౌల్తాబాద్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం..
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ గ్రామంలో రూ. 15.6 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు రాజనర్సింహ, కొండా సురేఖ ప్రారంభించారు. సంగారెడ్డి రోడ్‌లో గతంలో అనేక ప్రమాదాలు జరిగాయన్నారు. అటువంటి సంఘటనలకు సత్వర వైద్యం అందించడానికి ఈ ఆరోగ్య కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని మంత్రులు వివరించారు. దౌల్తాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.
(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)