Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో దారుణం, భూమి రాసివ్వలేదని తండ్రిని చంపిన తనయుడు-sangareddy son killed father for property not registered half of land on his name ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో దారుణం, భూమి రాసివ్వలేదని తండ్రిని చంపిన తనయుడు

Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో దారుణం, భూమి రాసివ్వలేదని తండ్రిని చంపిన తనయుడు

HT Telugu Desk HT Telugu
Sep 18, 2024 07:37 PM IST

Sangareddy Crime : ఆస్తుల ముందు మానవ సంబంధాలు తేలికైపోయాయి. భూమి తన పేరిట రాసివ్వలేదని కన్న తండ్రినే హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆస్తి కోసం బండ రాయితో ముఖంపై కొట్టి తండ్రిని హత్య చేశాడు కుమారుడు.

సంగారెడ్డి జిల్లాలో దారుణం, భూమి రాసివ్వలేదని తండ్రిని చంపిన తనయుడు
సంగారెడ్డి జిల్లాలో దారుణం, భూమి రాసివ్వలేదని తండ్రిని చంపిన తనయుడు

Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రిని బండ రాయితో కొట్టి చంపాడు ఓ కుమారుడు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్థిపూర్ గ్రామంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపి ఉన్న వివరాల ప్రకారం బర్థిపూర్ గ్రామానికి చెందిన తెలుగు మారుతీ (74) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మారుతికి కుప్పానగర్ శివారులో 35 గుంటల వ్యవసాయ భూమి ఉంది. కాగా రెండో కుమారుడు ఆ భూమిలో సగం వాటా భూమి తన పేరిట పట్టా చేసి ఇవ్వాలని తండ్రితో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం మరోసారి గొడవ పడడంతో పాటు పట్టా చేసి ఇవ్వకపోతే చంపుతానని బెదిరించాడు.

ముఖంపై బండ రాయితో కొట్టి

మారుతీ రోజు మాదిరిగానే సోమవారం రాత్రి కూడా వ్యవసాయ పొలం వద్ద ఉన్న ఇంటిలో నిద్రపోయేందుకు వెళ్లాడు. అయితే సోమవారం రాత్రి ఊరిలో వినాయక నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి. ఇదే అదునుగా భావించిన రెండో కొడుకు శ్రీనివాస్ పొలం వద్దకు వెళ్లి తండ్రిని హతమార్చాడు. వినాయక నిమజ్జనం అనంతరం అర్ధరాత్రి సమయంలో మారుతీ మరో కుమారుడు పొలం వద్ద ఇంట్లో పడుకోవడానికి వెళ్లాడు. అతడు వెళ్లేసరికి అక్కడ ఇంటి ముందు తండ్రి బోర్లపడి, ముఖంపై తీవ్ర గాయాలతో చనిపోయి ఉన్నాడు.

పోలీసుల అదుపులో నిందితుడు

వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భూతగాదాలతో తమ సోదరుడు శ్రీనివాస్ తండ్రిని రాయి లేదా ఏదైనా బలమైన దానితో ముఖంపై కొట్టి చంపినట్లు మృతుడి మరో కుమారుడు పేర్కొన్నారు. కన్న తండ్రిని కుమారుడు హత్య చేయడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుమారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. తండ్రిని శ్రీనివాస్ హత్య చేసినట్లు తేలడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు.

మెదక్ లో మరో ఘటన

అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి చెందిన సంఘటన మెదక్ మండలంలోని కొంటూరు చెరువు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన మంగలి నర్సింలు (40) మెదక్ లో తెలిసిన వారి వద్ద డబ్బులు తెస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత అతడి స్నేహితుడి ఫోన్ నుండి భార్యకు ఫోన్ చేసి డబ్బులు తెస్తున్నానని చెప్పాడు. కానీ ఆరోజు సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. అనంతరం కొంటూరు చెరువు వద్ద మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

మెడపై గాయం ఉందని

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న నర్సింలు భార్య అక్కడి చేరుకొని మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. తన భర్త మెడపై గాయం ఉందని భార్య అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు క్లూస్ టీంతో పరిసరాలను పరిశీలించారు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య సుజాత, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. నర్సింలు మృతితో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

సంబంధిత కథనం