తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada Politics : విజయవాడలో మారుతున్న సమీకరణాలు - వైసీపీని వీడనున్న మరికొంత మంది కార్పొరేటర్లు!

Vijayawada Politics : విజయవాడలో మారుతున్న సమీకరణాలు - వైసీపీని వీడనున్న మరికొంత మంది కార్పొరేటర్లు!

21 September 2024, 7:34 IST

google News
    • ఏపీలో అధికార మార్పిడి తర్వాత విజయవాడ నగరంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు పార్టీని వీడగా… మరో నలుగురు అదే బాటలో నడవనున్నారు. వీరు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్

విజయవాడలో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత… రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ నుంచి కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు. తాజాగా మరో నలుగురు కార్పొరేటర్లు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. వీరు జనసేనలో చేరనున్నారు.

జనసేనలోకి నలుగురు…!

విజయవాడ నగర పరిధిలోని 53, 48, 16 51వ డివిజన్లకు చెందిన నలుగురు వైసీపీ కార్పొరేటర్లు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నెల 18వ తేదీనే జనసేన అధినేత పవన్ సమక్షంలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ వాయిదా పడింది. ఆదివారం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువాలు కప్పుకోనున్నారు.

ఇక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో చూస్తే మొత్తం 64 కార్పొరేటర్‌ స్థానాలు ఉన్నాయి.  ఇక్కడ 2021లో ఎన్నికలు జరిగాయి. ఇందులో వైసీపీ 49 సీట్లు గెలిచి మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందుకు ఓ కార్పొరేటర్ బీజేపీలో చేరారు. కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మారిపోయింది. ఆ తర్వాత ముగ్గురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇటీవలే కూడా ఒక వైసీపీ కార్పొరేటర్ కమలం పార్టీ గూటికి చేరారు. ఇదిలా ఉండగానే మరో నలుగురు కార్పొరేటర్లు జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

రాబోయే రోజుల్లో మరికొంత మంది కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. స్థానికంగా సమీకరణాలు కుదరకపోతే జనసేన లేదా బీజేపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇదే జరిగితే… బెజడవాడలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో అధికారం మారటంతో చాలా కార్పొరేషన్లలో సీన్ మారుతోంది. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వైసీపీ ప్రతినిధులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇక పంచాయతీలలో కూడా వైసీపీ బలహీనపడుతుంది. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన గూటికి చేరారు.

ఇక ఒంగోలులో కూడా పలువురు వైసీపీ కార్పొరేటర్లు… సైకిల్ ఎక్కారు. 12 మంది కార్పొరేటర్లు మేయర్ టీడీపీ గూటికి చేరారు. తాజాగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి బాలినేని కూడా జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన సమక్షంలో మరికొంత మంది కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

ఇక జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు.  జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ కూడా లెక్కలు మారిపోతున్నాయి.  ఉదయభానుకు మద్దతుగా మున్సిపల్ కౌన్సిల్‌లోని 12 మంది వైసీపీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా జనసేనలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

 

 

తదుపరి వ్యాసం