Devi navaratrulu 2024: విజయవాడ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి అలంకరణ అవతారాలు, వాటి విశిష్టత-vijayawada kanakadurga ammavari navratri avatars and their specialties ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Devi Navaratrulu 2024: విజయవాడ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి అలంకరణ అవతారాలు, వాటి విశిష్టత

Devi navaratrulu 2024: విజయవాడ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి అలంకరణ అవతారాలు, వాటి విశిష్టత

HT Telugu Desk HT Telugu
Sep 20, 2024 10:30 AM IST

Devi navaratrulu 2024: అక్టోబర్ 3వ తేదీ నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి నవరాత్రి అలంకరణ అవతారాలు, వాటి విశిష్టత గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.

ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ
ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ

Devi navaratrulu 2024: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ పండుగలో దుర్గమ్మకు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులను ఆకర్షిస్తారు.

నవరాత్రులు అనేది తొమ్మిది రోజుల పండుగ. దీనిలో దుర్గమ్మను రోజుకో రూపంలో పూజిస్తారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ దేవస్థానం నవరాత్రి వేడుకలకు ప్రసిద్ధి చెందినదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

నవరాత్రులలో విజయవాడ కనకదుర్గ అలంకరణలు

స్వర్ణకవచాలంకృత దుర్గమ్మ: నవరాత్రి మొదటి రోజు అమ్మవారిని స్వర్ణకవచం ధరించి అలంకరిస్తారు. ఈ రోజు అమ్మవారిని దుర్గాదేవి రూపంలో పూజిస్తారు. ఇది ధర్మాన్ని స్థాపించడానికి, దుష్టులను నాశనం చేయడానికి ప్రదర్శితమవుతుంది.

బాలాత్రిపుర సుందరి: రెండవ రోజు అమ్మవారిని బాలాత్రిపుర సుందరి రూపంలో దర్శనం ఇస్తారు. ఈ అలంకరణలో అమ్మవారు చిన్నవయస్సులో ఉన్నటువంటి రూపంలో ఉంటారు. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

గాయత్రి దేవి: మూడవ రోజు అమ్మవారు గాయత్రి దేవి రూపంలో ఉంటారు. ఇది విద్య, జ్ఞానం, ప్రశాంతతకు ప్రతీక. అమ్మవారికి గాయత్రీ మంత్రం అంకితం చేయబడుతుంది.

అన్నపూర్ణా దేవి: నాలుగో రోజు అమ్మవారు అన్నపూర్ణా దేవి రూపంలో ఉంటారు. ఇది అన్నదానం, సంపూర్ణతకు సూచిస్తుంది. భక్తులు ఈ రోజు అన్నపూర్ణ స్వరూపం దర్శించుకుంటారు.

లలితా త్రిపుర సుందరి: ఐదవ రోజు లలితా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారు అలంకరింపబడతారు. ఇది సౌందర్యం, శాంతి, ప్రేమకు ప్రతీక. అమ్మవారు చక్కగా అలంకరింపబడి ఉంటారు.

సరస్వతీ దేవి: ఆరవ రోజు అమ్మవారు సరస్వతీ రూపంలో ఉంటారు. విద్య, కళలకు సంబంధించి భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తారు.

మహాలక్ష్మి: ఏడవ రోజు లక్ష్మి దేవి రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజు ధన, సిరిసంపదలకు సంబంధించిన పూజలు నిర్వహిస్తారు.

దుర్గాదేవి: ఎనిమిదవ రోజు అమ్మవారిని మళ్ళీ దుర్గాదేవి రూపంలో పూజిస్తారు. భక్తులు విఘ్నాలు తొలగించుకునేందుకు అమ్మవారిని ప్రార్థిస్తారు.

రాజరాజేశ్వరి: చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో ఉంటారు. ఇది శక్తికి, అధికారం, శక్తి స్త్రీత్వానికి చిహ్నం.

భక్తుల ప్రతిష్ట

నవరాత్రుల వేళ భక్తులు దూరదూర ప్రాంతాల నుంచి విజయవాడకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారికి పూజలు చేయడం, కుంకుమార్చనలు, హోమాలు చేయడం ద్వారా భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుంటారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించే పూజలు, హోమాలు, అర్చనలు నవరాత్రులలో విశేషమైనది.

ఈ పండుగ సమయంలో ఆలయం విద్యుత్ దీపాలతో అలంకరింపబడుతుంది. రాత్రి సమయంలో దుర్గమ్మ ఆలయం ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. భారీ సంఖ్యలో భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని అమ్మవారి పట్ల ఉన్న తమ భక్తిని చాటుకుంటారు అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ