Kalash: ఈ ఆలయం మీద కలశాన్ని గొలుసులతో కట్టేస్తారు- లేదంటే అది పారిపోతుందట
Kalash: ఆలయం మీద కలశం ఉండటం చూస్తూనే ఉంటారు. కానీ అది సాధారణంగా నిర్మాణంలో ఒక భాగంగా ఉంటుంది. అయితే ఈ ఆలయం మీద ఉన్న కలశం మాత్రం గొలుసులతో కట్టేసి ఉంటుంది. లేదంటే కలశం పారిపోతుందట. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోండి.
Kalash: భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి హిమాచల్‌లో ఉన్న హతేశ్వరి మాత ఆలయం. దీనిని హత్‌కోటి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది పురాతన భారతీయ వాస్తుశిల్పం, నిర్మాణ సాంకేతికతకు ఒక అందమైన ఉదాహరణ.
హతేశ్వరి మాత ఆలయం దుర్గా దేవికి అంకితం చేసినది. ఇక్కడ అమ్మవారిని మహిషాసురమర్ధినిగా కొలుస్తారు. ఎందుకంటే ఇక్కడే దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపినట్టుగా కొందరి విశ్వాసం. ఇక్కడ దుర్గాదేవి మెరిసే అందమైన దుస్తులతో అందంగా అలంకరించబడి ఉంటుంది. అమ్మవారి చేతిలో ఖడ్గం కూడా ఉంటుంది. కాళ్ళ కింద మహిషాసురుడి ప్రతిమ కూడా ఉంటుంది.
సాధారణంగా ప్రతి ఆలయం మీద కలశం ఉండటం చూస్తూనే ఉంటారు. కానీ అవి మామూలుగా ఉంటాయి. కానీ ఆలయం మీద ఉన్న కలశం మాత్రం మందపాటి గొలుసులతో కట్టేసి ఉంటుంది. ఇలా చేయడం వెనుక ఉన్న కారణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు ఆకర్షిస్తుంది.
హాతేశ్వరి ఆలయం మీద ఉన్న కలశాన్ని గొలుసులతో కట్టకపోతే అది పారిపోవడానికి ప్రయత్నిస్తుందట. ఇప్పటికే అలా ఒక కలశం అదృశ్యమైనదని అక్కడి స్థానికులు చెబుతున్నారు. కలశం ఎవరూ దొంగతనం చేయడం లేడు. దానంతట అదే కదులుతుందని ఆలయ ప్రాంగణాన్ని వదిలి వెళ్లేందుకు ప్రయత్నిస్తుందని స్థానికులు చెబుతున్నారు.
ప్రస్తుతం హాతేశ్వరి ఆలయం ప్రవేశ ద్వారం వైపు భద్రంగా బంధించిన ఒక కలశం మాత్రమే ఉంది. స్థల పురాణం ప్రకారం మొదట ఇక్కడ రెండు కలశాలు ఉండేవి. ఒకటి హాతేశ్వరి ఆలయానికి కాపలాగా ఉంటే మరొకటి ఆ ఊరికి కాపలాగా ఉండేది. ఈ ప్రదేశం ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాలకు నిలయంగా ఉంటుంది. అలా ఒకసారి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు కలశం పారిపోవడానికి ప్రయత్నించేది. అంటే అక్కడ వరదలు వస్తున్నాయని గ్రామస్తులకు ఒక సూచనగా ఉండేది.
ఒకరోజు గ్రామస్తులు ఉదయం పూజ చేసేందుకు వెళ్ళినప్పుడు రెండు కలశాలు కనిపించలేదు. అందరూ కలిసి దాని కోసం వెతకగా ఒకటి బండ రాళ్ళ మధ్య ఇరుక్కుని కనిపించింది. తర్వాత ఈ కలశం మళ్ళీ పారిపోకుండా తీసుకొచ్చి గుడి ముందు గొలుసులతో కట్టేశారు. అలా ఎందుకు పారిపోతుంది అనే దాని గురించి ఎవరికీ వాస్తవాలు తెలియవు. దీనికి సంబంధించిన విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
ఈ ఆలయ ప్రాంగణంలో ఐదు చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇవి పాండవులతో అనుసంధానించబడి ఉంటాయి. వీటిని పాండవులు నిర్మించినట్టుగా నమ్ముతారు. పురాణాల ప్రకారం పాండవులు వనవాస సమయంలో హత్కోటి వద్ద ఆగి అమ్మవారి భక్తికి గుర్తుగా ఈ ఐదు ఆలయాలు నిర్మించారని చెబుతారు. ఇక్కడ ఉన్న రాతి శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
ఈ ఆలయమ సముదాయంలో శివునికి అంకితం చేసిన చిన్న మందిరం కూడా ఉంది. శివలింగ రూపంలో పూజిస్తారు. శివలింగం చుట్టూ వివిధ దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. చాలా ఇరుకైన మందిరం ఇది. ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఈ శివాలయాన్ని దర్శించుకోగలరు.
టాపిక్