Eluru Bikes Recovery : స్కూటీని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న మహిళ, కష్టపడ్డ సొమ్ము తిరిగొచ్చింది- వీడియో వైరల్
06 November 2024, 15:17 IST
Eluru Bikes Recovery : ఇన్నాళ్లు ఎంతో అప్యాయంగా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకున్న స్కూటీ చోరీకి గురైంది. తలసేమియాతో బాధపడే బిడ్డను ఆ స్కూటీ మీదే ఆసుపత్రికి తీసుకెళ్లేది ఆ మహిళ. పోలీసులు ఆ స్కూటీని రికవరీ చేసి ఇవ్వడంతో ఆమెకు కన్నీళ్లు ఆగలేదు. ఈ ఘటనలో ఏలూరు జిల్లాలో జరిగింది.
స్కూటీని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న మహిళ, కష్టపడ్డ సొమ్ము తిరిగొచ్చింది- వీడియో వైరల్
రూపాయి రూపాయి పోగుజేసి ఎంతో కష్టపడి ఆ తల్లి స్కూటీని కొనుక్కుంది. ఇటీవల ఈ స్కూటీ చోరీకి గురైంది. ఎక్కడ వెతికినా దొరకలేదు. ఇక చేసేందేం లేక ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బైక్ ల చోరీలపై నిఘా పెట్టిన ఏలూరు పోలీసుల బృందం.. ద్విచక్ర వాహన దొంగలను పట్టుకున్నారు. ఇలా పలు కేసుల్లో గత మూడు నెలలకుగా సుమారు 250 బైక్ లు రికవరీ చేశారు. మంగళవారం బైక్ ల యజమానులకు ఆ బైక్ లు తిరిగి అందజేశారు. పోయిన బైక్ తిరిగి దొరకడంతో యజమానులు ఎంతో సంతోషపడ్డారు. ఓ మహిళ మాత్రం తన బైక్ ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. బైక్ ను హత్తుకుని బోరున ఏడ్చారు. ఆమెను చూసి అక్కడున్న వారికి కళ్లలో నీళ్లు తిరిగాయి. ప్రతి క్రైమ్ వెనుక ఓ స్టోరీ ఉంటుందని ఈ వీడియోను ఏలూరు జిల్లా పోలీసులు తమ ఎక్స్ అకౌంట్ లో ట్వీట్ చేశారు.
స్కూటీని చూసి కన్నీళ్లు పెట్టుకున్న మహిళ
తలసేమియాతో బాధపడుతున్న తన బిడ్డను ఓ తల్లి రోజూ స్కూటీపై డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లేది. అయితే గుర్తుతెలియని వ్యక్తులు ఇటీవల ఆమె స్కూటీని చోరీ చేశారు. ఆ మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకుని బైక్ ను రికవరీ చేశారు. మంగళవారం ఆమెకు తిరిగి తన వాహనాన్ని అందించారు. పోలీసులు ఆమెకు బైక్‌ను ఇస్తున్నప్పుడు... ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. కన్నీళ్లు పెట్టుకుని బైక్‌ను హత్తుకుని ముద్దాడింది. ఏలూరు పోలీసులు గత మూడు నెలల్లో సుమారు 250కి పైగా బైక్‌లను రికవరీ చేశారు.
అంత ర్రాష్ట్ర మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను కలిదిండి, ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 25 మోటార్ సైకిల్ లను స్వాధీనపరుచుకోగా.. వాటి విలువ రూ.17,50,000 ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ముగ్గురు నిందితులపై కలిదిండి పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు, తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ ఒక కేసు, ముదినేపల్లి ఒక కేసు, కైకలూరులో ఒకటి, భీమవరం రూరల్ ఒక కేసు, ఏలూరు వన్ టౌన్ సంబంధించి ఒక కేసు, ఏలూరు టూ టౌన్ కు సంబంధించిన 16 కేసులలో మొత్తం 25 మోటార్ సైకిల్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోటర్ సైకిళ్ల చోరీ కేసులను చేధించిన పోలీసు సిబ్బందిని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అభినందించి ప్రశంస పత్రాలు, రివార్డులు అందించారు.