Peddapalli Dog Stolen : పెద్దపల్లి జిల్లాలో వింత దొంగతనం-బైక్ పై వచ్చి కుక్క చోరీ, సీసీ కెమెరాలో రికార్డు
05 November 2024, 21:42 IST
Peddapalli Dog Stolen : పెద్దపల్లి జిల్లా వింత దొంగతనం జరిగింది. బైక్ పై వచ్చిన ముగ్గురు ఓ కుక్కను ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యారు. కుక్కను పెంచుకున్న పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. కుక్కను అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెద్దపల్లి జిల్లాలో వింత దొంగతనం-బైక్ పై వచ్చి కుక్క చోరీ, సీసీ కెమెరాలో రికార్డు
పెద్దపల్లి జిల్లాలో వెరైటీ దొంగతనం జరిగింది. చోరీకి గురైంది నగలో.. నగదో.. వాహనమో కాదు...విలువైన వస్తువులు అంతకన్నా కాదు. కానీ, విశ్వాసం గల కుక్క అపహరణకు గురికావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ కుక్కను పెంచుకున్న వారు పుట్టెడు దుఃఖంతో అన్నపానీయాలు మాని ఆవేదన చెందుతున్నారు. పోలీసులను ఆశ్రయించి తమ కుక్కను తమకు అప్పగించాలని కన్నీటి పర్యంతమై వేడుకుంటున్నారు.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం శ్రీరాంనగర్ లో నివాసం ఉండే లక్ష్మీ నారాయణ దంపతులు హచ్ కుక్కను పెంచుకుంటున్నారు. చిన్న పిల్లప్పుడు తీసుకొచ్చి నాలుగేళ్లుగా కుటుంబంలో ఒక్కరిలా పెంచుతున్నారు. శనివారం ఇంటి బయటకి వెళ్లిన కుక్క అపహరణకు గురైంది. దారిలో వెళ్లే గుర్తుతెలియని వ్యక్తులు కుక్కను ఎత్తుకెళ్లారు. పల్సర్ బైక్ పై ఇద్దరు పురుషులు, ఒక మహిళ ముగ్గురు కలిసి ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. మహిళా చున్నీతో కుక్కపిల్లపై కప్పి బైక్ పై తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజ్ లభించింది. శనివారం అదృశ్యమైన కుక్క ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు అన్న పానీయాలు మాని ఆవేదన చెందుతున్నారు.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..కేసు నమోదు
నాలుగు రోజులైన అపహరణకు గురైన కుక్క ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కుక్క అపహరణపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుక్క కనిపించకపోయే సరికి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతూ తమ కుక్కను తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు. కుక్క అపహరణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మంథని పోలీసులు తెలిపారు.
రోజుకో గుడ్డు..ఏసీ రూమ్ లో పడక
అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుక్క కనిపించకపోయే సరికి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్ ను కోల్పోయినట్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోజు కో గుడ్డు, చికెన్ తిని ఏసీ రూమ్ నుంచి బయటకురాని కుక్క కుటుంబంలో ఒకరిగా ఉండేదని ఆవేదన చెందుతున్నారు. తన కూతురు రెండు నెలల వయసున్న హచ్ కుక్కపిల్లను నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాదు నుండి తీసుకువచ్చామని ఏసీ గదిలో సోఫా వేసి పడుకోపెడతామని తెలిపారు. కుక్కను ఎవరు తీసుకెళ్లినా ఇంటి వద్ద వదిలేయాలని ఏమి అనమని కన్నీటితో వేడుకుంటున్నారు. కుక్క అపహరణ స్థానికంగా కలకలం సృష్టిస్తుండగా, కుటుంబ సభ్యున్ని కోల్పోయినంత బాధతో ఆ కుటుంబం విలపిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.