East Godavari News : చాయ్ తాగి వృద్ధ దంపతులు మృతి, టీ పొడి అనుకొని పురుగుల మందు కలపడంతో!
14 September 2024, 17:51 IST
- East Godavari News : తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోతి ఇంటి ముందు పడేసిన పురుగుల మందు ప్యాకెట్ ను పడేసింది. అది టీ పొడి అనుకొని టీ పెట్టుకుని తాగిన వృద్ధ దంపతులు మృతి చెందారు. ఈ ఘటన రాజానగరం మండలం పల్లకడియంలో జరిగింది.
చాయ్ తాగి వృద్ధ దంపతులు మృతి, టీ పొడి అనుకొని పురుగుల మందు కలపడంతో!
East Godavari News : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. టీ పౌడర్ అనుకొని పురుగుల మందు వేసుకుని టీ తయారు చేసుకుని తాగి వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో గోవింద్(75), ఆయన భార్య అప్పాయమ్మ(70) కలిసి నివసిస్తున్నారు. కోతి పురుగుల మందు ప్యాకెట్ తీసుకొచ్చి వృద్ధ దంపతుల ఇంటి ముందు పడేసింది. అప్పాయమ్మకు కంటి చూపు మందగించడంతో పురుగుల మందు ప్యాకెట్‌ను టీ పౌడర్ ప్యాకెట్‌గా భావించింది. భార్య గోవింద్ టీ పెట్టమని అడగగా... పురుగుల మందుతో టీ పెట్టింది అప్పాయమ్మ. ఈ టీ వృద్ధ దంపతులిద్దరూ తాగారు. కాసేపటి నోటి నుంచి నురగలు రావడం, వారిని గమనించిన స్థానికులు వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వారిద్దరూ మరణించారు. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లైన 5 రోజులకే నవవరుడు మృతి
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంటను 5 రోజులకే విడదీసింది విధి. ఎంతో సంతోషంగా దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన నవవధువుకు అనుకోని కష్టం ఎదురైంది. కర్ణాటకలోని వెంగసంద్రాకు చెందిన కార్తీక్ (28) అనే యువకుడు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొల్లుపల్లికి చెందిన భవానిని ఐదు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఐదో రోజు కార్తీక్ తన భార్యను తీసుకుని అత్తారింటికి వచ్చాడు. అత్తారింటికి వచ్చాక కార్తీక్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో స్థానికంగా ఓ క్లినిక్ లో వైద్యం చేయించుకున్నాడు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుండెపోటుతో నవవరుడు కార్తీక్ చనిపోయాడని బంధువులు భావిస్తున్నారు. అయితే కార్తీక్ మరణవార్తతో అతని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆసుపత్రి వద్ద మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. గ్యాస్ట్రిక్ సమస్యతో క్లినిక్ వస్తే ప్రాణాలు తీశారని ఆరోపిస్తున్నారు. సరైన వైద్యం అందించకపోవడంతో కార్తీక్ మరణించాడని ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
థియేటర్ లో కత్తిపోట్లు
ఎంబీ యూనివర్సిటీలో చదివే లోకేష్ అనే యువకుడు తిరుపతి నగరంలోని పీజీఆర్ థియేటర్‌లో సినిమాకు వెళ్లాడు. సినిమా చూస్తుండగా.. అతనిపై ఒక్కసారిగా ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత దాడి చేసిన వ్యక్తి దర్జాగా హాలు నుంచి బయటకు వెళ్లాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. లోకేష్, ఓ యువతి ఇద్దరు కలిసి సినిమాకు టికెట్‌లు బుక్ చేసుకున్నారు. అనుకున్నట్టే సినిమాకు వెళ్లారు. వారు సినిమా చూస్తుండగా.. కార్తీక్ అనే యువకుడు సడెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కసారిగా లోకేష్‌పై విరుచుకుపడి.. కత్తితో దాడి చేశాడు. దాడిలో లోకేష్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే.. కత్తితో దాడి చేసిన తర్వాత.. ఆ యువతి లోకేష్‌తో కాకుండా.. కార్తీక్‌తో బయటకు వెళ్లింది. దీంతో లోకేష్ షాక్‌కు గురయ్యాడు.
గాయపడిన యువకుడు ఎం.బీ.యూ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన యువకుడిని రూయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడ్డిన యువకుడిని కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. అయితే.. కార్తీక్‌తో కలిసి యువతి లోకేష్‌పై కత్తితో దాడి చేయించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ యువతి, లోకేష్ సహచర విద్యార్థులని తెలుస్తోంది. కార్తీక్, యువతి పరారీలో ఉన్నట్టు సమాచారం. కత్తితో దాడి చేసిన కార్తీక్, యువతి సూళ్లూరుపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. కత్తి దాడిలో గాయపడిన లోకేష్‌ది ప్రకాశం జిల్లా గిద్దలూరు అని పోలీసులు చెబుతున్నారు. దాడి చేసిన యువకుడు, అతనితో వెళ్లిన యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.