East Godavari : ఫోన్‌లో మాట్లాడటాన్ని ప్రశ్నించిన పేరేంట్స్ - మనస్తాపంతో కుమార్తె ఆత్మహత్య
10 August 2024, 10:37 IST
- తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఫోన్‌లో మాట్లాడటాన్ని తల్లిదండ్రులు ప్రశ్నించటంతో… మనస్తాపంతో కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం వెలుగు చూసింది. కుమార్తె ఫోన్‌లో తరచు మాట్లాడటాన్ని తల్లిదండ్రులు ప్రశ్నించడంతో మనస్తాపం చెందిన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ ఘటన నల్లజర్ల మండలం ఘంటావారిగూడెంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఘంటావారిగూడెంలో ఎస్సీ కాలనీకి చెందిన పెనుమాక శ్రీనివాసరావు, సుశీల దంపతుల రెండో కుమార్తె లక్ష్మి (18) ఓపెన్ ఇంటర్మీడియట్ చదువుతుంది. ఖాళీగా ఉండటం ఎందుకని… కుటుంబానికి మద్దతుగా ఉండొచ్చని దూబచర్లలోని ఓ మెడికల్ షాపులో పని చేస్తోంది.
ఆ మెడికల్ షాప్ పక్కనే ఉన్న మరో షాప్‌లో పని చేసే యువకుడితో లక్ష్మి ప్రేమలో ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆ యువకుడితో తరచు లక్ష్మి ఫోన్‌లో మాట్లాడేది. కుమార్తె ఫోన్‌లో తరచుగా మాట్లాడటాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను మందలించారు. ఎక్కువ ఫోన్‌లో ఎందుకు మాట్లాడుతున్నావు. దానివల్ల నష్టం జరుగుతోందని అన్నారు. అసలు ఎవరుతో మాట్లాడుతున్నావని ప్రశ్నించారు.
దీంతో మనస్తాపనకు చెందిన లక్ష్మి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి మిమ్మల్ని చూడాలని ఉందని, త్వరగా ఇంటికి రావాలని చెప్పి ఫోన్ కట్ చేసింది. దీంతో ఏం జరిగిందోనని ఆందోళన చెందిన తల్లిదండ్రులు హుటాహుటినా ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి చూసిన తల్లిదండ్రులకు ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న కుమార్తె విగతజీవిలా కనిపించింది.
దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్మి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లి గూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తామని హెడ్ కానిస్టేబుల్ స్టాలిన్ తెలిపారు.
తండ్రి మందలించడంతో కుమార్తె ఆత్మహత్య
ఇంటి నుంచి బయటకు ఎందుకు వెళ్లావని తండ్రి మందలించడంతో కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం చదరడవలస గ్రామంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఇంట్లో తన కుమార్తె (16)ను పెట్టి బంధువుల ఇంటికి వెళ్లారు. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చే సరికి తలపులు తెరిచే ఉన్నాయి. దీంతో తండ్రి ఎందుకు బయటకు వెళ్లామని కుమార్తెను ప్రశ్నించాడు.
దీంతో మనస్తాపన చెందిన కుమార్తె ఇంట్లో ఉన్న గడ్డిమందును తాగి అస్వస్థతకు గురైంది. దీంతో పక్కింటివారు గుర్తించి, కుమార్తె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకుని, అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను చూసి, గందరగోళానికి లోనైయ్యారు. కుమార్తెను హుటాహుటిన బాడంగి మండల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో బాడంగి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమార్తె శుక్రవారం మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు రామభద్రపురం ఎస్ఐ జ్ఞానప్రసాద్ తెలిపారు.