Visakha Crime : విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది- కత్తితో దాడి, యువతి తల్లికి తీవ్రగాయాలు
Visakha Crime : విశాఖలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడిన యువకుడిపై యువతి ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.
Visakha Crime : విశాఖలో ప్రేమోన్మాది కత్తి దూశాడు. యువతిపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డువచ్చిన యువతి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ న్యూ పోర్టు పరిధిలోని వుడా కాలనీ సమీపంలో ఉంటున్న ఓ యువతిని సిద్దూ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అప్పట్లో గాజువాక పోలీసులు పోక్సో చట్టం కింద యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన సిద్దూ యువతి కుటుంబంపై కక్షగట్టాడు. మంగళవారం యువతిని హత్య చేసేందుకు కత్తితో దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో యువతి తల్లిపై అడ్డుకోవడంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. యువతి గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు కోసం గాలిస్తున్నారు.
ప్రేమ పేరుతో వేధింపులు బాలిక ఆత్మహత్య
గుంటూరు జిల్లాలో వేధింపులు ఒక బాలిక ప్రాణాలు తీసింది. ప్రేమ పేరుతో నిరంతర వేధింపులకు గురవుతున్న బాలిక, తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకుని వేధింపులకు పాల్పడిన నిందితుడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని ఫిరంగపురం మండలంలో ఒక గ్రామంలో సోమవారం జరిగింది. ఆ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటుంది. కొన్ని నెలల క్రితం ఆ బాలిక కుటుంబానికి బంధువైన వేరొక గ్రామానికి చెందిన నీలాంబరం అనే యువకుడితో ఆ బాలికకు పరిచయం ఏర్పడింది. అయితే అప్పటి నుంచి ఆ బాలికను నీలాంబరం ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. నిరంతరం వేధింపులకు దిగుతూ పెళ్లి చేసుకుందామని వెంటపడేవాడు. ఆ బాలిక తిరస్కరించినప్పటికీ నీలాంబరం వేధించడం మానలేదు. వాడి వేధింపులు తారాస్థాయికి చేరుకున్నాయి.
రెండు రోజుల క్రితం ఫిరంగిపురంలో జరుగుతున్న తిరునాళ్లకు గ్రామంలోని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆ బాలిక వెళ్లింది. ఆ విషయం తెలుసుకుని నీలాంబరం స్నేహితులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. తిరునాళ్లలో అందరూ చూస్తుండగానే ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తండ్రికి విషయం చెప్పింది. దీంతో ఆ బాలిక తండ్రి నీలాంబరాన్ని మందలించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాలిక వాళ్లు వారి గ్రామం వచ్చారు. నీలాంబరం తన స్నేహితులతో కలిసి అక్కడి నుంచి వెళ్లపోయాడు. అయితే కొద్ది సేపటి తరువాత నీలాంబరం మరికొంత మందిని వెంటబెట్టుకుని బాలిక ఇంటికి వెళ్లాడు. అక్కడ బాలిక తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘర్షణలో బాలిక తండ్రిపై దాడి చేశాడు. దీంతో ఆయనకు గాయం అయింది. ఈ పరిణామాలపై తీవ్ర మనస్తాపానికి చెందిన బాలిక పురుగుల మందు తాగింది. అయితే దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం 108 వెహికల్‌పై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ కేసులోని ప్రధాన నిందితుడిగా ఉన్న నీలాంబరం ఆదివారం రాత్రి ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ బాలిక ఆత్మహత్యతో కేసులకు భయపడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడని స్థానికులు చెబుతున్నారు.
సంబంధిత కథనం