Nandyal Crime : ముచ్చుమర్రి హత్యాచారం ఘటన, ఇంకా దొరకని బాలిక మృతదేహం- రోజుకో మాట మారుస్తున్న మైనర్లు-nandyal muchumarri minor girl abused murdered minor boys case suspension remains ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nandyal Crime : ముచ్చుమర్రి హత్యాచారం ఘటన, ఇంకా దొరకని బాలిక మృతదేహం- రోజుకో మాట మారుస్తున్న మైనర్లు

Nandyal Crime : ముచ్చుమర్రి హత్యాచారం ఘటన, ఇంకా దొరకని బాలిక మృతదేహం- రోజుకో మాట మారుస్తున్న మైనర్లు

Bandaru Satyaprasad HT Telugu
Jul 14, 2024 02:29 PM IST

Nandyal Crime : నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక ఘనటపై సస్పెన్స్ వీడలేదు. ఈ కేసులో అరెస్టైన మైనర్లు రోజుకో మాట మార్చడంతో బాలిక మృతదేహం ఆచూకీ లభించడంలేదు. తాజాగా బాలిక మృతదేహాన్ని కృష్ణా నదిలో పడేశామని చెప్పడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ముచ్చుమర్రి హత్యాచారం ఘటన, ఇంకా దొరకని బాలిక మృతదేహం
ముచ్చుమర్రి హత్యాచారం ఘటన, ఇంకా దొరకని బాలిక మృతదేహం

Nandyal Crime : నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక హత్యాచారం ఘటనలో ఇంకా సస్పెన్స్ వీడటంలేదు. బాలిక మృతదేహం కోసం 7వ రోజు పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్టైన మైనర్లు రోజుకో మాట చెబుతుండడంతో బాలిక మృతదేహం కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నెల 7న బాలిక అదృశ్యమైన విషయం తెలిసిందే. కనీసం బాలిక మృతదేహానైనా అప్పగించాలని బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఈ కేసులో అరెస్టైన మైనర్లు...ముందు బాలిక మృతదేహాన్ని కాలువలో పడేశామని చెప్పారు. ఆ తర్వాత గ్రామ సమీపంలోని స్మశానంలో పడేశామని చెప్పారు. తాజాగా కృష్ణానదిలో పడేశామని ఓ మైనర్ తన తండ్రికి చెప్పాడు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసును డీఐజీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నా...బాలిక మృతదేహం దొరక్కపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

చిన్నారిపై ముగ్గురు మైనర్ల ఘాతుకం

నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు అతి దారుణంగా హత్యాచారం చేశారు. దారుణానికి పాల్పడిన తర్వాత బాలిక మృతదేహాన్ని దొరక్కుండా చేశారు. బాలిక మృతదేహం గురించి రోజుకో మాట చెబుతూ పోలీసులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ముందు మృతదేహాన్ని ఖననం చేశామని, ఆ తర్వాత హంద్రీ కాల్వలో పడేశామని మైనర్లు చెప్పారు. మూడు రోజుల పాటు కాలువలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. తాజాగా కృష్ణా నదిలో పడేశామని మైనర్లు అంటున్నారు. దీంతో మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. బాలిక హత్యాచారం ఘటనపై జబర్దస్త్ యాంకర్ రష్మి స్పందించారు. ఇంత కిరాతకంగా ప్రవర్తించి, బాలిక మృతదేహం ఆచూకీ తెలియకుండా చేసిన వాళ్లను మైనర్లని ఎలా అంటారని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. "పెద్ద వాళ్లలా రేప్ చేయగలిగితే పెద్ద వాళ్లలా శిక్షించాల్సిందే. వారు చేసిన దాని గురించి ఏ మాత్ర పశ్చాత్తాప పడటంలేదు. వాళ్లు కచ్చితంగా మైనర్లు కాదు. మైనర్లు అనే నెపంతో వారు తప్పించుకోకూడదని ఆశిస్తున్నాను" అని రష్మి ట్వీట్ చేశారు.

అసలేం జరిగింది?

నంద్యాల జిల్లా ప‌గిడ్యాల మండ‌లం ముచ్చుమ‌ర్రి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారం, ఆపై హ‌త్యకు గురైంది. గత ఆదివారం తోటి స్నేహితుల‌తో క‌లిసి పాత ముచ్చుముర్రి లోని పార్కులో ఆడుకున్న చిన్నారి అదృశ్యం అయింది. దీంతో సాయంత్రం నుంచి త‌న బిడ్డ క‌నిపించ‌డం లేద‌ని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక అదృశ్యం అయిన‌ట్లు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జ‌య‌శేఖ‌ర్ తెలిపారు. అయితే విష‌యం తెలుసుకున్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శ‌బ‌రి, బాలిక ఆచూకీని త్వర‌గా గుర్తించాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు. దీంతో డీఎస్పీ శ్రీ‌నివాస‌రావు రంగంలోకి దిగి ఆ గ్రామానికి చేరుకొని విచార‌ణ చేప‌ట్టారు. కుటుంబ స‌భ్యుల‌ను అడిగి స‌మాచారం తెలుసుకున్నారు. బాలిక మిస్సింగ్ మిస్టరీని ఛేదించేందుకు మూడు బృందాలు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రీ‌నివాస‌రావు తెలిపారు. పోలీసులు కేసు న‌మోదు చేసి, బాలిక ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చ‌ర్యలు చేప‌ట్టారు. ఒంట‌రిగా పార్కులో ఉన్న బాలిక‌ను ముగ్గురు బాలురు ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి, ఆ పై కాలువ‌లోకి తోసేసి హ‌త్యకు పాల్పడిన‌ట్లు పోలీసులు నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. 14-16 ఏళ్లలోపు వ‌య‌సున్న ఈ ముగ్గురు బాలురు అత్యాచారం చేసిన విష‌యాన్ని బాలిక ఇంట్లో చెబుతుంద‌న్న భ‌యంతోనే కాలువ‌లోకి తోసేసిన‌ట్లు గ్రామ‌స్తులు చెబుతున్నారు. ఆ ముగ్గురు బాలురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణ సమయంలో బాలల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో వారిని పోలీసులు గట్టి ప్రశ్నించడంతో వాళ్లు హత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం