తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Crop Insurance Ekyc : రైతులకు అలర్ట్, పంట బీమా పథకం ఈకేవైసీకి ఇంకా రెండు వారాలే గడువు!

Crop Insurance eKYC : రైతులకు అలర్ట్, పంట బీమా పథకం ఈకేవైసీకి ఇంకా రెండు వారాలే గడువు!

Updated Sep 02, 2024 06:05 PM IST

google News
    • Crop Insurance eKYC : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలుచేస్తున్న పంట బీమా పథకం ఈకేవైసీ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 15వ తేదీ లోపు రైతులు పంట నమోదు చేసుకుని ఈకేవైసీ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
రైతులకు అలర్ట్, పంట బీమా పథకం ఈకేవైసీకి ఇంకా రెండు వారాలే గడువు!

రైతులకు అలర్ట్, పంట బీమా పథకం ఈకేవైసీకి ఇంకా రెండు వారాలే గడువు!

Crop Insurance eKYC : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పంట బీమా పథకాన్ని అమలు చేస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులతో పంట నష్టం వాటిల్లిన రైతులకు ఈ పథకం ఆసరాగా నిలుస్తోంది. బీమా పొందేందుకు అన్నదాతలు తమ పంటలకు ఈకేవైసీ చేయించుకోవాలి. ఖరీఫ్‌ పంటలకు ఈకేవైసీ ప్రక్రియను మొదలైంది. ఈకేవైసీకి సెప్టెంబర్ 15 వరకు గడువు ఉంది. ఏపీ ప్రభుత్వం అమలు చేయబోయే అన్నదాత సుఖీభవ పథకం ప్రయోజనాలు పొందాలంటే ఈకేవైసీ కచ్చితంగా చేయించుకోవాలి. ఈకేవైసీ పూర్తి చేయకపోతే పంట బీమా డబ్బులు పొందలేరు.


పంటల ఈకేవైసీ పూర్తి చేసేందుకు... రైతులు ఎంత భూమిలో ఏ పంట పండిస్తున్నారన్న వివరాలన వ్యవసాయశాఖ సిబ్బందికి తెలియజేయాలి. వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాల వద్దకు వెళ్లి పంట నమోదుతో పాటు ఈ-కేవైసీ చేస్తారు. రైతు ఆధార్, మొబైల్ నెంబర్, పొలం సర్వే నెంబర్ తో పాటు పొలం వద్ద ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. పంట నమోదు పూర్తైన తర్వాత ఈ-కేవైసీకి వేలిముద్రలు తీసుకుంటారు. అనంతరం రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి ఈకేవైసీ సంబంధించిన వివరాలు సమర్పించాలి. నిర్ణీత గడువులోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.

అన్నదాత సుఖీభవ పథకం

టీడీపీ కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.20 వేలు అందిస్తామని హామీ ఇచ్చాయి. ఈ హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వచ్చే దసరా పండగకు లేదా దీపావళి పండగకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల వ్యవసాయశాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఈ పథకంపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారని తెలుస్తోంది. లబ్ధిదారులను గుర్తించేందుకు రైతు బ్యాంక్ ఖాతాలకు ఫోన్ నెంబర్లను లింక్ చేయాలన్నారు. వీటిని జియో ట్యాగ్ చేయాలన్నారు. పీఎం కిసాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా రూ.6 వేలు అందిస్తుంది. దీనికి మరో రూ.14 వేలు రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొత్తంగా రూ.20 వేలు అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. లబ్ధిదారుల జాబితా పూర్తైన తర్వాత ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది.

తదుపరి వ్యాసం