rythu runa mafi: అన్నదాతల ఆందోళన.. రైతు రుణమాఫీపై మంత్రుల కీలక ప్రకటన!
rythu runa mafi: రైతు రుణ మాఫీ అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. అర్హులైన అందరికీ రుణ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. చాలా మంది రైతులు తమకు రుణ మాఫీ కాలేదని రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో మంత్రులు కీలక ప్రకటన చేశారు.
రైతు రుణ మాఫీకి సంబంధించి అన్నదాతలు చేస్తున్న ఆందోళనలపై మంత్రులు స్పందించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణ మాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆధార్ నంబర్ 12 ఉండాలి.. కానీ కొందరికి 11 మరికొందరికి 13 నంబర్లు ఉన్నాయి. అందుకే పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయాము అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించి అర్హులైన అందరికీ రుణ మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ మొత్తం చేయలేకపోయం.. మిగిలిన రూ. 12 వేల కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో రైతుల ఖాతాల్లో వేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇటు సోమవారం కూడా రైతుల ఆందోళనలు కొనసాగాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా రైతులు రుణ మాఫీ కోసం పోరాటం చేస్తున్నారు. అదిలాబాద్ జిల్లాలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. నిరసనలు, ఆందోళనలపై నిషేధం విధించారు. రుణమాఫీపై రైతులు చేస్తున్న ఆందోళనలు, శవ యాత్రలపై ప్రభుత్వం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు డీఎస్పీ జీవన్ రెడ్డి.
రైతుల ఆందోళనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రుణమాఫీపై అయోమయానికి గురిచేస్తున్నారన్న బండి.. నిజంగా రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారని ప్రశ్నించారు. రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
రేవంత్ ఏబీవీపీ నుంచి వచ్చారు కాబట్టి.. బీజేపీలోకి వెళ్తారని కేటీఆర్ అంటున్నారన్న సంజయ్.. కేసీఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి.. ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతున్నారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్‌లో కొందరు సొంత బలం కోసం ప్రయత్నిస్తున్నారని.. పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా బలపడాలని ఎమ్మెల్యేల కొనుగోలుకు సిద్ధమయ్యారని బండి సంజయ్ ఆరోపించారు.