Tax On Rich Farmers : ధనిక రైతులపై కూడా పన్ను భారం పడనుందా? కేంద్రం ఆలోచన ఏంటి?
16 July 2024, 16:30 IST
- Budget 2024 : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు రెడీగా ఉంది. అయితే పన్నుల ఎలాంటి మార్పులు వస్తాయోనని అందరికీ ఆసక్తిగా ఉంది. మరో విషయం ఏంటంటే ధనిక రైతులపై పన్ను భారం పడుతుందా అనే చర్చ కూడా నడుస్తోంది.
ధనిక రైతులపై పన్ను భారం వేస్తారా?
కేంద్ర బడ్జెట్ సమర్పణకు రోజు దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు పెరుగుతున్నాయి. ఒకవైపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. మరోవైపు ధనిక రైతులపై పన్ను విధించే అంశం కూడా చర్చకు రానుందని చెబుతున్నారు. రైతులకు మంచి జరిగేలా ఈసారి బడ్జెట్ ఉండనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ధనిక రైతులపై పన్ను భారం వేస్తారా అనే చర్చ కూడా ఎక్కువగా ఉంది.
ధనిక రైతులపై ఆదాయపు పన్ను విధించే ఆలోచన ఉందని గత జనవరిలో వార్తలు వచ్చాయి. ధనిక రైతులు ఆదాయపు పన్ను చెల్లించాల్సి రావచ్చని ఆర్‌బీఐ సభ్యురాలు అషిమా గోయల్ అన్నారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ధనిక రైతులపై పన్ను భారం పడే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు.
అయితే ఆదాయపు పన్ను విషయంలో పారదర్శకత తీసుకురావడానికి ధనిక రైతులపై ఆదాయపు పన్ను విధించాలని నిర్ణయించే అవకాశం ఉంది. పేద రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వం ధనిక రైతుల నుంచి పన్ను వసూలు చేయాలని నిర్ణయించుకోవచ్చని కూడా నిపుణులు కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం రైతుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయడం లేదు. ధనిక రైతులకు తక్కువ రేటుతో ఆదాయపు పన్ను విధించే అవకాశం ఉందని గోయల్ గతంలో తెలిపారు.
సహజంగానే బడ్జెట్ సందర్భంగా పన్ను విధానాలను ప్రకటిస్తారు. కొత్త పన్ను విధానం, పాత పన్ను విధానం అనే రెండు ఆప్షన్లను ప్రభుత్వం ఇచ్చింది. రెవెన్యూ రసీదులు (పన్ను రాబడి, పన్నుయేతర ఆదాయం), మూలధన రశీదులు (రుణాలు, రుణాల రికవరీ) ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సేకరిస్తుంది. మరి ఈసారి ధనిక రైతులపై పన్ను భారం పడుతుందో లేదో చూడాలి.
అయితే ఎన్ని ఎకరాలు ఉన్న వారిని ధనిక రైతులుగా చూస్తారో తెలియాలి. వారి ఆదాయ వివరాల ఆధారంగా కూడా పన్ను విధిస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు. ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.