TG Agri loans: రైతుల అభిప్రాయం తర్వాతే ప్రభుత్వ జీవోగా విడుదల చేస్తామన్న డిప్యూటీ సిఎం భట్టి
TG Agri loans: రైతు భరోసాపై రైతులు వెల్లడించిన అభిప్రాయాలే ప్రభుత్వ జీవోగా రాబోతోందని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
TG Agri loans: తెలంగాణలో వ్యవసాయాన్ని ఆదుకునేలా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని డిప్యూటీ సిఎం భట్టి స్పష్టం చేశారు. రైతు భరోసా పథక విధివిధానాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తృత సమావేశాన్ని సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించగా, మంత్రివర్గ ఉప సంఘం ఛైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ చార్జి మంత్రి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతు భరోసాపై అన్ని జిల్లాల్లో అభిప్రాయాలు సేకరిస్తున్నామని, వాటిని క్రోడీకరించి శాసనసభలో చర్చిస్తామని స్పష్టం చేశారు. సభలో అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి చరిత్రాత్మక నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసే సమయంలో రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, అయినా ఇచ్చిన హామీల అమలుకు వెనకడుగు వేయడం లేదన్నారు.
ఇదివరకు వరంగల్ లో రాహుల్ గాంధీ వివిధ హామీలతో రైతు డిక్లరేషన్ ప్రకటించారని, అదే స్ఫూర్తితో రేవంత్ రెడ్డి సర్కారు ముందుకెళ్తోందని పేర్కొన్నారు. ప్రజలు కట్టే పన్ను తో ప్రజల సంక్షేమం కోసం పథకాలను అందిస్తున్నామని, సంపూర్ణంగా ప్రజలు ఏమి చెబితే దాన్నే అమలు చేస్తామన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల ఆలోచనల మేరకు నిర్ణయాలు ఉంటాయన్నారు.
తొందర్లోనే పంటల బీమా కూడా ఇస్తాం
తెలంగాణలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీల సూచనల మేరకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టులో అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇందుకోసం విధివిధానాల రూపకల్పన జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంట నష్టం జరిగితే ఎలాంటి పరిహారం రాకపోయేదని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంట నష్టపోతే బీమా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే ఇన్సురెన్స్ కంపెనీలతో చర్చించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులను, నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం ప్రయత్నం చేస్తోందన్నారు.
ఇన్కమ్ టాక్స్, పాన్ కార్డ్ ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వరని చేస్తున్న దుష్ప్రచారం సరికాదన్నారు. రైతులకు సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం వెనకడుగు వేయదని, రైతుల నిర్ణయాలే ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలుగా పరిగణిస్తామన్నారు.
పశువులకూ బీమా…
రైతుబంధు విషయంలో కటాఫ్ పెట్టుకోవాలని గత ప్రభుత్వానికి తాను చెప్పానని, అయినా వినకుండా రైతుబంధు వర్తింపజేయడంతో ప్రజాధనం దుర్వినియోగం అయిందని పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇందిరా గాంధీ నిరుపేదలకు అందించిన భూములకు ధరణి పోర్టల్ రాకతో అన్యాయం జరిగిందన్నారు.
పంటలకు బీమా ఎలా చేస్తున్నామో అదేవిధంగా పశువులకు కూడా బీమాను వర్తింప చేస్తే బాగుంటుందన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో అందించిన పథకంలో లోపాలు ఉన్నాయన్నారు. నిజమైన రైతులకు, కష్టపడే రైతులకు రైతుబంధుతో అన్యాయం జరుగుతుందన్నారు. పేరుకే పెట్టుబడి పథకం అయినా నిజమైన రైతులకు అందలేదన్నారు. అసలైన రైతులకు రైతు భరోసా అందించాలని తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
జిల్లాల అభిప్రాయ సేకరణ కార్యక్రమాలను నిర్వహించి రైతుల అభిప్రాయాలను తీసుకొని ఒక మంచి నిర్ణయంతో మంచి పాలసీని తీసుకురానున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్, ఎంపీలు పోరిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)