Budget 2024 : ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు? బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట!
Budget 2024 : ఈ దఫా బడ్జెట్లో ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు జరుగుతాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరి నిర్మలా సీతారామన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో!
జులై 23న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌పై అన్ని వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆదాయపు పన్నులతో నలిగిపోతున్న మధ్యతరగతి ప్రజలు ఈ దఫా బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇందుకు తగ్గట్టుగానే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు చేయొచ్చు అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ బడ్జెట్లో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. శ్రామిక వర్గం ప్రజలు కోరుతున్న రూ.10 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారికి పన్ను విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాగా ఈసారి సాధారణ బడ్జెట్ లో ఉద్యోగస్తులు, యువత, మహిళలు, అల్పాదాయ, మధ్య ఆదాయ వర్గాలపై దృష్టి సారించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మధ్యతరగతి ప్రజలకు ఊరట లభిస్తుందా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత రెండు వారాలుగా వివిధ రంగాల నిపుణులు, ప్రధాన పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. రానున్న రోజుల్లో మరికొన్ని సంస్థలతో ఆర్థిక మంత్రి సమావేశం కానున్నారు. ఇప్పటివరకు వ్యవసాయం, సర్వీస్, గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీ, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ రంగాలకు సంబంధించిన అవసరాలను ప్రధానంగా లేవనెత్తి, పన్నులు తగ్గించాలని అందరు డిమాండ్ చేశారు.
అదే సమయంలో ఆదాయపు పన్ను శ్లాబును మార్చాలనే డిమాండ్ కూడా ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది. ఉద్యోగస్తులపై ఆదాయపు పన్ను భారం చాలా ఎక్కువగా ఉందనే వాదన ఉంది.
పాత విధానంలో చూస్తే రూ.10 లక్షలు దాటిన వార్షికాదాయంపై 30 శాతం ఆదాయపు పన్ను చెల్లించాలి. కొత్త పన్ను విధానంలో ఏడు లక్షలకు పైగా ఆదాయం ఉంటే ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వార్షికాదాయం ఏడు లక్షలకు మించి ఉంటే ఆరు నుంచి తొమ్మిది లక్షల వరకు 10 శాతం, వార్షికాదాయం తొమ్మిది నుంచి 12 లక్షల వరకు 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో కష్టంగా ఉంటుందని అనేకమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ద్రవ్యోల్బణంతో ప్రజల ఖర్చులు కూడా పెరిగాయని, దీనివల్ల ప్రజల పొదుపుపై ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల రూ.10 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు ఆదాయపు పన్ను మినహాయింపు కోరుతున్నారు.
ప్రస్తుత సమయంలో ద్రవ్యోల్బణం, వ్యయాలు చూస్తుంటే ఆదాయపు పన్ను రేట్లలో పెనుమార్పులు అవసరమని సీఏ అమన్ అన్సారీ అన్నారు. కొత్త విధానంలో ప్రజలు రిటర్నులు దాఖలు చేయాలని ప్రభుత్వం కోరుతోందని, కానీ నిశితంగా పరిశీలిస్తే, ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
“ఈసారి ప్రభుత్వానికి మంచి అవకాశం ఉంది. పన్ను వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వారు కూడా పెరుగుతున్నారు. అందువల్ల రూ.10 లక్షలకు పైబడిన వాటిపై పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని అందరూ భావిస్తున్నారు. పాత విధానంలో రిటర్నులు దాఖలు చేస్తే 20 శాతం తర్వాత 30 శాతం పన్ను శ్లాబ్ ఉంటుంది. ఇది ఆచరణ సాధ్యం కాదు,” అని అమన్ అన్సారీ అన్నారు.
పన్నుల విషయంలో ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లో ప్రయోజనాలు కల్పిస్తోందని, అయితే వ్యక్తిగత కేటగిరీలో ఆదాయపు పన్ను చెల్లించే దిగువ, మధ్య ఆదాయ వర్గాలకు పెద్దగా ఉపశమనం లభించడం లేదని కొందరు నిపుణులు వాదించినట్లు తెలిసింది.
ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం ప్రస్తుత దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్ను రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. అదే సమయంలో కొన్ని కొత్త తయారీ కంపెనీలకు కార్పొరేట్ పన్ను రేటును 15 శాతానికి తగ్గించారు. కాబట్టి ఆదాయపు పన్నులో కూడా ప్రజలకు ఉపశమనం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
సంబంధిత కథనం