Budget 2024 Agriculture Sector : నేచురల్ ఫార్మింగ్ వైపు కోటి మంది రైతులు.. వ్యవసాయరంగానికి కేటాయింపులు ఇవే
Budget 2024 Agriculture Sector : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2024 ప్రవేశపెట్టారు. రికార్డు స్థాయిలో వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. అయితే ఈ బడ్జెట్ 2024లో వ్యవసాయరంగానికి కేటాయింపులు ఎలా ఉన్నాయో చూద్దాం..
పేదలు, మహిళలు, యువత, రైతులపై నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫోకస్ చేస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులపై ఆర్థిక మంత్రి మాట్లాడారు. ఈ ఏడాది బడ్జెట్ తొమ్మిది ప్రాధాన్యతలపై నిరంతర ప్రయత్నాలను అంచనా వేస్తున్నట్టాగా చెప్పారు. ఉత్పాదకత, వ్యవసాయం, ఉపాధి మరియు నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం, తయారీ మరియు సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రతలు, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, ఆర్అండ్‌డి తదుపరి సంస్కరణలపై మాట్లాడారు.
వ్యయవసాయం దాని అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా ఆర్థిక మంత్ర నిర్మలా సీతారామన్ చెప్పారు. వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులు సహజ వ్యవసాయంవైపు వెళ్తారని కేంద్రమంత్రి చెప్పారు.
ఉత్పత్తిని పెంచేందుకు పెద్ద ఎత్తున కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లను ప్రోత్సహిస్తామని కూడా ఆమె ప్రకటించారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రభుత్వం వ్యవసాయానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాను ప్రోత్సహిస్తుందన్నారు. 'కూరగాయ ఉత్పత్తి కోసం పెద్ద ఎత్తున కస్టర్లు ప్రధాన వినియోగ కేంద్రాలకు దగ్గరగా అభివృద్ధి చేయబడతాయి. సేకరణ, నిల్వ, మార్కెటింగ్ సహా కూరగాయల సరఫరా గొలుసుల కోసం రైతు ఉత్పత్తి సంస్థలు, సహకార సంఘాలు, స్టార్టప్‌ను ప్రొత్సహిస్తాం.' అని కేంద్రమంత్రి వెల్లడించారు.
పప్పు ధాన్యాల ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్ ప్రభుత్వం బలోపేతం చేస్తుంది. రొయ్యల పెంపకం, మార్కెటింగ్ కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం ఇస్తుంది. జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డును ఐదు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టనున్నారు. వాతావరణాన్ని తట్టుకోగల విత్తనాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రైవేట్ రంగం, డొమైన్ నిపుణులు, ఇతరులకు నిధులను అందిస్తుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.