Budget 2023: అగ్రి స్టార్టప్‌లకు ఊతంగా యాక్సిలేటర్ ఫండ్ ఏర్పాటు
Budget 2023: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఐదో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిని "అమృత్ కాల్‌లో మొదటి బడ్జెట్" అని ఆమె అభివర్ణించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: తాము సంపన్నమైన, సమ్మిళితమైన భారతదేశాన్ని ఊహించామని సీతారామన్ తన ప్రారంభ వ్యాఖ్యలలో చెప్పారు.
యువ పారిశ్రామికవేత్తల ద్వారా అగ్రి-స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
పశుపోషణ, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమలపై దృష్టి సారించి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని సీతారామన్ పార్లమెంట్‌కు తెలిపారు. గత ఆరేళ్లలో దేశంలో వ్యవసాయ రంగం సగటు వార్షిక వృద్ధి రేటు 4.6 శాతంగా ఉంది.
‘వాల్యూ చైన్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం యొక్క ఉప-పథకాన్ని ప్రారంభిస్తాం’ అని ఆమె చెప్పారు.
సీతారామన్ ఉదయం 11 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు, ఇది మోడీ ప్రభుత్వం రెండో టర్మ్‌లో చివరి పూర్తి బడ్జెట్. మునుపటి రెండు యూనియన్ బడ్జెట్‌ల మాదిరిగానే, యూనియన్ బడ్జెట్ 2023-24 కూడా కాగిత రహిత రూపంలో సమర్పించారు.
దేశంలో తదుపరి లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్-మే 2024లో జరగనున్నందున ఈ ఏడాది బడ్జెట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది.
సాంప్రదాయం ప్రకారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు మంత్రులు పంకజ్ చౌదరి, భగవత్ కరద్, ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంగళవారం రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమయ్యాయి, తదనంతరం 2022-23 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2023-24 వార్షిక బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి అధికారిక కసరత్తు అక్టోబర్ 10న ప్రారంభమైంది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2023-24లో భారత జిడిపి 6 నుంచి 6.8 శాతం వరకు పెరుగుతుందని మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే పేర్కొంది.
టాపిక్