Nalgonda Farmers: బత్తాయి రైతు ఆగమాగం, ధరలు లేక అల్లాడుతున్న అన్నదాతలు..కనీస ధర కూడా గిట్టుబాటు కాని వైనం
27 August 2024, 13:41 IST
- Nalgonda Farmers: బత్తాయి సాగులో దేశ వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. నాలుగు దశాబ్ధాల కింద జిల్లాలో బత్తాయి సాగు మొదలైన రోజుల్లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో తోటలు ఉంటే.. ఇపుడా విస్తీర్ణం 40వేల ఎకరాలకు తగ్గిపోయింది. పలు కారణాలతో బత్తాయి తోటల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది.
నల్గొండలో గణనీయంగా తగ్గిపోయిన బత్తాయి సాగు
Nalgonda Farmers: బత్తాయి సాగులో దేశ వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. నాలుగు దశాబ్ధాల కింద జిల్లాలో బత్తాయి సాగు మొదలైన రోజుల్లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో తోటలు ఉంటే.. ఇపుడా విస్తీర్ణం 40వేల ఎకరాలకు తగ్గిపోయింది. నాసిరకం మొక్కలు, సరైన దిగుబడి రాకపోవడం, దిగుబడికి కనీస గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వ మద్దతు అంతంతమాత్రంగానే ఉండడం, స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడం, దళారులు చెప్పిందే వేదం కావడం, మార్కెట్ లో రైతులు నిలువు దోపిడీకి గురికావడం వంటి కారణాలతో జిల్లాలో బత్తా తోటల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది.
గిట్టుబాటు కాని ధర
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక నాడు బత్తాయి తోటల సాగు ఉద్యమంలా కొనసాగింది. తోటల సాగు రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్న పెట్టుబడులు.. వస్తున్న కాయల దిగుబడి, మార్కెట్ లో బత్తాయికి ఉన్న ధరకు పొంతనలేకుండా పోతోంది. ప్రతీ ఏటా బత్తాయి రైతుకు ధర గిట్టుబాటు కాకున్నా.. ఈ సారన్నా ధర బాగా వస్తుందేమోనన్న ఆశాభావంతో రైతులు ఎదురు చూడడం పరిపాటిగా మారింది.
ఈ సీజన్లో టన్ను బత్తాయికి తోటల వద్ద రూ.11 వేల నుంచి రూ.18 వేలు మాత్రమే దళారులు చెల్లిస్తున్నారని బత్తాయి రైతులు వాపాతున్నారు. బత్తాయి దిగుబడుల్లో ముందుగా ఏప్రిల్ – జూన్ వరకు కత్తెర ( ఈ సీజన్ లో కేవలం 5శాత దిగుబడి మాత్రమే వస్తుంది ), జూలై – నవంబరు నెలల మధ్య మెయిన్ సీజన్ ( 95 శాతం ఈ సీజన్ లోనే వస్తుంది ) లుగా పేర్కొంటున్న రైతులు ఈ ఏడాది కత్తెర పంటకు కూడా గిట్టుబాటు ధర రాలేదంటున్నారు.
ఈ ఏడాది మే నెలలో మాత్రం మంచి సరుకుకు టన్నుకు రూ.40వేల ధర పలికిందని, అదీ నాలుగైదు రోజులు మాత్రమేనని పేర్కొంటున్నారు. బత్తాయి రైతుల మార్కెట్ కష్టాలు తీర్చేందుకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మార్కెట్ మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోగా, హైదరాబాద్ బాటసింగారం మార్కెట్ లో దళారులు, వ్యాపారులు ఆడిందే ఆటగా రైతులను దోచుకుంటున్నారని, ఈ సీజన్లో గడిచిన నెల రోజులుగా బాటసింగారం పండ్ల మార్కెట్లో టన్ను ధర రూ.18 వేలకు మించడం లేదని , ధరలు కనీసం గిట్టుబాటు కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు.
ఎన్నెన్నో కారణాలు...
బత్తాయి తోటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోవడానికి, నాణ్యమైన సరుకు దిగుబడి వచ్చినా కనీసం గిట్టుబాటు ధర రాకపోవడానికి అనేక కారణాలున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత బత్తాయి ధర పడిపోయినట్లు గుర్తించారు.
ఢిల్లీ మార్కెట్ మీద ఆధారపడిన బత్తాయి రేటును స్థానిక దళారులు సైతం బాగా తగ్గించేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా బత్తాయి వ్యాపారం చేస్తోంది కర్నూలు జిల్లా నుంచి వస్తున్న దళారులే కావడం గమనార్హం. ఒక వేళ రైతులు సాహసించి తోటల దగ్గర తమ సరుకును అమ్ముకోకుండా మంచి రేటు వస్తుందన్న ఆశతో నేరుగా మార్కెట్ కు తీసుకు పోతే రకరకాల పేర్లతో రైతును లూటీ చేస్తున్నారని వాపోతున్నారు.
ఇందులో ప్రధానమైనది చూట్ తీయడం. మార్కెట్ లో వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలను నియంత్రిస్తున్నారు. ఈ సారి వర్షాలు ఎక్కువగా కురియడం, మహారాష్ట్ర దిగుబడులో ముందే మార్కెట్ కు చేరుకోవడం ఒక కారణంగా చెబుతున్నారు.
జిల్లాకుచెందిన బత్తాయి ఎక్కువగా బాట సింగారం మార్కెట్ లోనే విక్రయిస్తుండగా, తోటల దగ్గర బత్తాయిని కొనుగోలు చేసిన వ్యాపారులు ఢిల్లీ ఆజాద్ పుర మార్కెట్ కు తరలిస్తారు. అయితే, ఈ సారి ఢిల్లీలో కురిసిన వర్షాలు, వరదల కారణంగా మార్కెట్ లో సరుకుకు డిమాండ్ లేకుండా పోవడం కూడా ధరలు తగ్గడానికి కారణాలు చెబుతున్నారు.
మూణ్నాళ్ల ముచ్చటగా నల్గొండ మార్కెట్
జిల్లాలో సాగవుతున్న బత్తాయి తోటలు, దిగుబడిని పరిగణలోకి తీసుకుని రైతులకు అందుబాటులో ఉండేలా దశాబ్ధాల డిమాండ్ ను నెరవేరుస్తూ 2018 లో నల్గొండలో బత్తాయి మార్కెట్ ను ప్రారంభించారు. దీనికోసం రూ.2 కోట్ల నిధులు వెచ్చించారు. కానీ, ప్రభుత్వం వ్యాపారులను ఇక్కడకు తీసుకురావడంలో విఫలం కావడంతో బత్తాయి మార్కెట్ కేవలం నామమాత్రమే అయ్యింది.
మరో వైపు బత్తాయి నర్సరీల నుంచి అందిస్తున్న మొక్కలు నాసీ రకం కావడం కూడా రైతులు నష్టపోవడానికి కారణమవుతున్నాయి. ఈ కారణంగానే బత్తాయి తోటలను తొలగించి ఇతర పంటలవైపు మరలుతున్నాయి. దేశ వ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో బత్తాయి సాగుచేసిన నల్గొండ జిల్లాలో తాజా పరిస్థితులు బత్తాయి తోటల సాగుపై ప్రతికూల అభిప్రాయాన్ని కలిగిస్తోందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )