తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap New Excise Policy : ఏపీలో కొత్త మ‌ద్యం పాల‌సీ..! కసరత్తు ప్రారంభించిన సర్కార్

AP New Excise Policy : ఏపీలో కొత్త మ‌ద్యం పాల‌సీ..! కసరత్తు ప్రారంభించిన సర్కార్

HT Telugu Desk HT Telugu

16 June 2024, 10:30 IST

google News
    • AP New Excise Policy 2024 Updates : ఏపీలో కొత్త ప్రభుత్వం రాకతో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపుతో పాటు మరికొన్ని ఫైళ్లపై చంద్రబాబు సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది.
ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్త!
ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్త!

ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్త!

AP New Excise Policy : రాష్ట్రంలో కొత్త మ‌ద్యం పాల‌సీ తీసుకురావ‌డంపై రాష్ట్ర ప్ర‌భుత్వం దృష్టి సారించింది. ఈనెల 18న జ‌ర‌గ‌బోయే తొలి మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ పాల‌సీపై నిర్ణ‌యం తీసుకోనున్నారు. మ‌ద్యం అమ్మ‌కాలతో వ‌స్తున్న ఆదాయం ఏమాత్రం త‌గ్గ‌కుండా ఈ కొత్త విధానాన్ని రూపొందించాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త మ‌ద్యం పాల‌సీకి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు అధికార యంత్రాంగానికి జారీ అయ్యాయి.

పెరిగిన ధరలు….

రాష్ట్రంలో గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో పాత మ‌ద్యం బ్రాండ్‌ల స్థానంలో కొత్త మ‌ద్యం బ్రాండ్‌లు తీసుకొచ్చారు. అలాగే వాటి ధ‌ర‌లు కూడా భారీగా పెంచారు. దీంతో ప్ర‌భుత్వంపై మ‌ద్యం తాగేవారు, ప్ర‌తిప‌క్ష నేత‌లు తీవ్రంగా విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టారు. కొత్త మ‌ద్యం బ్రాండ్‌ల‌పై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. ఈ మ‌ద్యం వ‌ల్ల అనేక మంది మ‌ర‌ణిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. నాసిర‌కం మ‌ద్యం అమ్మ‌కాల‌తో మ‌ద్యం తాగేవారు అనారోగ్యానికి గుర‌వుతున్నార‌ని అప్పుడు చ‌ర్చ తీవ్ర‌స్థాయిలో ఉండేది.

దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు సహా టీడీపీ నేత‌లు కూడా విమ‌ర్శలు గుప్పించారు. చంద్ర‌బాబు ఒక అడుగు ముందుకేసి తాము అధికారంలోకి రాగానే నాణ్య‌మైన మ‌ద్యాన్ని, త‌క్కువ ధ‌ర‌కు అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇదే విష‌యాన్ని టీడీపీ నేత‌లు కూడా ప్ర‌తి స‌భ‌లో చెప్పేవారు. అలాగే జ‌న‌సేన నేత‌లు మ‌ద్యం అంశాన్నే బ‌హిరంగ స‌భ‌ల్లో లేనెత్తేవారు. నాటీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఒక బ‌హిరంగ స‌భ‌లో బిజేపీకి ఓటు వేస్తే.. 40 రూపాయాల‌కే మ‌ద్యం అందుబాటులోకి తెస్తామ‌ని చేసిన ప్ర‌క‌ట‌న కూడా రాష్ట్రంలో సంచ‌ల‌నం అయింది.

అయితే చంద్ర‌బాబు, టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌పై వైసీపీ కూడా కౌంట‌ర్ ఇచ్చింది. నాటి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే ఈ అంశంపై స్పందించారు. ఇప్పుడున్న కొత్త బ్రాండ్లు తాము అధికారంలోకి వ‌చ్చినప్పుడు తెచ్చిన‌వి కాద‌ని, గ‌త టీడీపీ ప్ర‌భుత్వం 2018, 2019 మ‌ధ్యలో తెచ్చిన‌వేన‌ని బ్రాండ్లు తెచ్చిన ఆర్డ‌ర్ కాపీల‌ను డిస్‌ప్లే చేస్తూ అసెంబ్లీలో మాట్లాడారు. వారు తెచ్చిన మ‌ద్యం బ్రాండ్ల‌నే తాము అమ‌లు చేస్తున్నామ‌ని అన్నారు. మ‌ళ్లీ త‌మ‌పైనే విమర్శ‌లు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

అయిన‌ప్ప‌టికీ మ‌ద్యం బ్రాండ్లు, నాసిర‌కం మ‌ద్యంపై ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు ఆగ‌లేదు. ఎన్నిక‌ల ప్రచారంలో మ‌ద్యం బ్రాండ్లు, నాణ్య‌త‌పైనే ప్ర‌ధాన చ‌ర్చ జ‌రిగింది. చంద్ర‌బాబు తాము అధికారంలోకి రాగానే, పాత బ్రాండ్లే తెస్తామ‌ని, నాణ్య‌త‌తో కూడిన మ‌ద్యాన్ని త‌క్కువ ధ‌ర‌కు అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. న‌కిలీ బ్రాండ్ల‌తో క‌ల్తీ మ‌ద్యాన్ని రాష్ట్రంలో విక్ర‌యిస్తూ ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని చెడ‌గొడుతున్నార‌ని విమ‌ర్శించారు. త‌మ ప్ర‌భుత్వం రాగానే న‌కిలీ బ్రాండ్‌ల‌ను ర‌ద్దు చేసి, నాణ్య‌మైన బ్రాండ్‌ల‌ను తీసుకొస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఇప్పుడు ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 18న జ‌రిగే రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశంలో కొత్త మ‌ద్యం పాల‌సీపై నిర్ణ‌యం తీసుకోనున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యంలో రూ.1,24,312 కోట్ల మ‌ద్యాన్ని అమ్మారు. 2023-24లోనే రాష్ట్ర ఖ‌జానాకు రూ.16 వేల కోట్ల ఆదాయం స‌మకూరింది. ఇప్పుడు కొత్త మ‌ద్యం పాల‌సీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖ‌జానాకు వ‌చ్చే ఈ ఆదాయాన్ని ఏం మాత్రం త‌గ్గించ‌కుండా త‌యారు చేస్తున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం