AP IAS IPS Officers: సీఎం ప్రాపకం కోసం ఆ అధికారుల తంటాలు, అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు నిరాకరించిన చంద్రబాబు
AP IAS IPS Officers: రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి, ఐదేళ్ల క్రితం టీడీపీ ఓడిపోగానే ప్లేటు ఫిరాయించిన అధికారుల వ్యవహారంలో చంద్రబాబు నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. గురువారం వారిని కలిసేందుకు కూడా ఆసక్తి చూపలేదు.
AP IAS IPS Officers: పార్టీ ఫిరాయింపుల విషయంలో రాజకీయ నాయకుల వ్యవహారం జనాలకు కొత్త కాదు కానీ కొందరు ఆలిండియా సర్వీస్ అధికారులు కూడా అందుకు భిన్నమేమి కాదని నిరూపించారు. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో చెలరేగిపోయిన అధికారులు ఆ పార్టీ ఓటమి పాలవగానే చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల్లో చాలామంది 2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వైసీపీ ముఖ్యనాయకుల్ని ప్రసన్నం చేసుకున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే పూర్తిగా చంద్రబాబు వ్యతిరేక వైఖరి ప్రదర్శించారు.
తాజా ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో గత కొద్ది రోజులుగా వారంతా చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సిన ఆలిండియా సర్వీస్ అధికారుల్లో కొంతమంది పార్టీ కార్యకర్తల కంటే ఉత్సాహంగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారు. రాజకీయ విమర్శలకు కూడా వెరవకుండా అధికార పార్టీతో అంటకాగారు.
గురువారం సచివాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు ఐఏఎస్, ఐపీఎస్‌ల ప్రయత్నించారు. వారితో ప్రత్యేకంగా కలిసేందుకు చంద్రబాబు నిరాకరించారు. సీఎంను కలిసేందుకు వచ్చిన ఐఏఎస్‌లు శ్రీలక్షీ, పూనమ్ మాలకొండయ్య, అజయ్ జైన్, ఐపీఎస్‌లు సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు, ప్రవీణ్ ప్రకాష్‌లకు సీఎంను కలిసేందుకు ప్రత్యేకంగా అనుమతి దక్కలేదు. వీరిలో పూనమ్ మాలకొండయ్య, ప్రవీణ్ ప్రకాష్, అజయ్ జైన్ వంటి అధికారులు చంద్రబాబు వద్ద గతంలో కీలక శాఖల్ని నిర్వహించారు.
వైసీపీతో అంటకాగిన అధికారులతో ప్రత్యేకంగా భేటీకి నిరాకరించిన చంద్రబాబుsar సెక్రటేరియట్‌లో బాధ్యతల స్వీకారం తర్వాత శాఖాధిపతులతో కాన్ఫరెన్స్ భేటీ అయ్యారు. గత ఐదేళ్లలో సీనియర్ అధికారులు వైఖరిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. 1995లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో IAS, IPS, IFSలు అంటే గౌరవం ఉండేదని, గత ఐదేళ్లలో వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, – రాబోయే ఐదేళ్లలో గాడిలో పెడతానని చెప్పారు.
అప్పట్లో అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించే వారని.. గత ప్రభుత్వంలో కొందరు అధికారులు వ్యవహరించిన తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల తర్వాత మరోసారి కలుద్దామని సూచించారు. సిఎం హోదాలో తొలి భేటీకి వైసీపీతో అంటకాగిన కొందరు అధికారులు కూడా హాజరయ్యారని సిఎం పేషీ అధికారులు ముందే సమాచారం ఇవ్వడంతో ఈ భేటీని క్లుప్తంగా ముగించారు.
ఆత్మ విమర్శ చేసుకోండి…
“1995లో నేను మొదటి సారి సీఎం అయ్యాను. నాడు నాతో పని చేసిన వారిలో కొందరు నేడు ఇక్కడ ఉండి ఉంటారు. నాలుగో సారి ఇప్పుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్నాను. రాష్ట్రంలో నేడు చూసిన దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అనేవి అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగాలు.
ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాల నుండి నియామకం అవుతారు. ఇక్కడున్న కొందరు అధికారులు గతంలో ఆదర్శవంతంగా పని చేశారు. కానీ గత ఐదేళ్లలో మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు." అని చంద్రబాబు అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాజకీయ నాయకుల కంటే దారుణంగా…
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో కొందరు రాజకీయ నాయకుల కంటే దారుణంగా వ్యవహరించారు. కొందరు మహిళా అధికారులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయారు. అందిన కాడికి దోచేశారనే ఆరోపణలు వచ్చిన ఏమాత్రం ఖాతరు చేయలేదు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో అడ్డగోలుగా ఆదేశాలు జారీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వందల కోట్ల రుపాయల విలువైన పనుల్ని ఎడాపెడా మంజూరు చేశారు. ఆ అధికారులపై ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం