Amaravati : వెల్త్, హెల్త్, హ్యాపీ విధానంతో విజన్- 2047 డాక్యుమెంట్.. 13 ముఖ్యమైన అంశాలు
22 November 2024, 21:47 IST
- Amaravati : వెల్త్, హెల్త్, హ్యాపీనెస్.. ఇదే స్వర్ణాంధ్రప్రదేశ్- 2047 విజన్ అని చంద్రబాబు ప్రకటించారు. పది సూత్రాలతో విజన్ రూపకల్పన జరుగుతోందన్నారు. మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ నిత్యం జరగాలన్న ముఖ్యమంత్రి.. పేదరిక నిర్మాలన, సమ్మెళిత వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యమని స్పష్టం చేశారు.
అమరావతి
ఏపీ అభివృద్ధికి స్వర్ణాంధ్రప్రదేశ్ - 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వెల్త్, హెల్త్, హ్యాపీ విధానంతో ఈ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నామని వివరించారు.1999లోనే విజన్ 2020కి రూపకల్పన చేశామన్న సీఎం 1995లో సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఖజానా ఖాళీగా ఉందని చెప్పారు. నాడు రూపొందించిన విజన్ తోనే హైదరాబాద్ సంపద సృష్టి కేంద్రంగా మారిందని వ్యాఖ్యానించారు. విజన్- 2047కు సంబంధించి చంద్రబాబు స్పీచ్ లోని 13 ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
1.నేడు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్‌కు పునాది వేస్తున్నాం. ఈ విజన్‌ను దుర్మార్గులు వస్తే తప్ప ఎవరైనా కొనసాగిస్తారు.
2.రాష్ట్రానికి పెట్టుబడులు కావాలంటే శాంతి భద్రతలు కావాలి. అభద్రతా భావాన్ని ప్రేరేపిస్తే పెట్టుబడిదారులు కూడా రాష్ట్రానికి రావాలా వద్దా అని ఆలోచిస్తారు.
3.స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి వందేళ్లు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ కూడా వికసిత్ భారత్-2047 విజన్ డాక్యుమెంట్ ప్రకటించారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ -2047తో ముందుకెళ్తున్నాం.
4.ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గస్థాయిలో అభివృద్ధికి విజన్ రూపొందించుకోవాలి. ప్రజలకు మీరు సేవ చేస్తే వారు మీతోనే ఉంటారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్‌లో వెల్తీ, హెల్తీ, హ్యాపీ మూడింటికి ప్రాధాన్యం ఉంటుంది.
5.గ్లోబల్ థింకర్స్‌గా తెలుగువారు ఉన్నారు. అతిపెద్ద 5వ ఆర్ధిక వ్యవస్థగా మన దేశం ఉంది. 2047కి అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉండేందుకు వికసిత్ భారత్ విజన్‌ను ప్రధాని రూపొందించారు.
6.రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే.. దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాలను దూరదృష్టితో ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు 5 సార్లు ఈ విజన్ డాక్యుమెంట్‌పై పారిశ్రామిక వేత్తలు, ప్రజలతో మాట్లాడాం. త్వరలోనే దీన్ని ప్రారంభిస్తాం.
7.464 మండలాలు, 106 మున్సిపాలిటీలు, 1.18 కోట్ల మంది ప్రజలతో మాట్లాడి, 10,078 సమావేశాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యార్థులను అందరినీ భాగస్వాములను చేశాం. మొత్తంగా 17 లక్షల మంది విజన్‌కు వారి అభిప్రాయాలు తెలిపారు.
8.56 శాతం మంది మహిళలు స్పందించారు. 28 శాతం మంది విద్యార్థులు, యువత, 17 శాతం రైతులు, 5 శాతం సీనియర్ సిటిజన్స్ సూచనలు ఇచ్చారు. దేశంలో ఎన్నో విజన్లు తయారు చేశారు గానీ.. 17 లక్షల మంది భాగస్వాములు కావడం ఇదే ప్రథమం.
9.పది ప్రధాన సూత్రాలతో ముందుకెళ్తున్నాం. దీనిపైనే మన ఆర్ధికవ్యవస్థ, భవిష్యత్ ఆధారపడి ఉంది. పేదరిక నిర్మూలన, ఉద్యోగాలు, స్కిల్స్, మానవ వనరుల అభివృద్ధి, నీటి సంరక్షణ, వ్యవసాయంలో టెక్నాలజీ, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, విద్యుత్-ఇంధనాల ఖర్చు తగ్గింపు, ఉత్పత్తిని పెంచడం, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్నాలజీ సూత్రాలతో ముందుకెళ్తున్నాం.
10.మానవ వనరుల అభివృద్ధి జరగాలి. అందరికీ తిండి పెట్టే రైతులు కష్టాల్లో ఉన్నారు. రైతుల పెట్టుబడి వ్యయం తగ్గిస్తాం. అందరిలో గౌరవంగా ఉండేలా చేస్తాం. టెక్నాలజీ ప్రోత్సహించి రైతులను ఆదుకుంటాం. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్‌లో మన దేశం చేసే వ్యయం 14 శాతంగా ఉంది. భవిష్యత్తులో పెట్రోల్, డీజల్ వాడకం తగ్గుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్ వినియోగం పెరుగుతుంది.
11.మన ఉత్పత్తులకు బ్రాండ్ లేకపోవడం వల్ల అదనపు అదాయం రావడం లేదు. ఏపీలో తయారయ్యే ప్రతి వస్తువుకు బ్రాండ్ తీసుకొస్తాం. ఇప్పటికీ దోమల వల్ల మలేరియా, డెంగ్యూతో ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాలు అశుభ్రంగా ఉండటంతో రోగాలు వస్తున్నాయి. అందుకే స్వచ్ఛాంధ్రగా మార్చేందుకు పని చేస్తాం.
12.పీ4 విధానంతో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది. ఉన్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది అట్టడుగున ఉన్న 10 శాతం మందిని దత్తత తీసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి స్థలం, నీటి వసతి, 24 గంటలూ విద్యుత్, క్లీన్ ఎనర్జీ, సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి, డిజిటల్ కనెక్టివిటీ ఉండాలి.
13. 2047 విజన్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం. మారిన పరిస్థితులకు అనుగుణంగా వెర్షన్‌లు మారుతుంటాయి. విజన్ 5.0 తీసుకొస్తాం.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.