Kurnool Highcourt Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ఏపీ అసెంబ్లీ అమోదం.. సీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నబాబు-ap assembly approves establishment of high court bench in kurnool ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kurnool Highcourt Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ఏపీ అసెంబ్లీ అమోదం.. సీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నబాబు

Kurnool Highcourt Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ఏపీ అసెంబ్లీ అమోదం.. సీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నబాబు

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 21, 2024 01:58 PM IST

Kurnool Highcourt Bench: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు.ఈ మేరకు శాసనసభలో తీర్మానం చేశారు. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపారు.

ఏపీ అసెంబ్లీలో కర్నూలు హైకోర్టు బెంచ్‌పై చంద్రబాబు ప్రకటన
ఏపీ అసెంబ్లీలో కర్నూలు హైకోర్టు బెంచ్‌పై చంద్రబాబు ప్రకటన

Kurnool Highcourt Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం పలికింది. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. - ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అనేది కూటమి ప్రభుత్వ నినాదమని సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మూడు రాజధానులం

కర్నూలులో కూడా మన రాజధాని అమరావతి అని టీడీపీ ఎన్నికల ప్రచారంలో చెప్పగలిగిందన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీటింగ్‌లో కూడా మన రాజధాని అమరావతి చెప్పామని, చెప్పింది చేస్తామని ప్రజలు నమ్మి తమను గెలిపించారన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని గతంలో చేసి చూపించామన్నారు. అన్ని ప్రాంతాల్లో అమరావతి ఏకైక రాజధాని గర్వంగా ప్రకటించి ప్రజలను ఒప్పించగలిగామన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

రాయలసీమ ఎడారిగా మారిపోతుందనుకున్నపుడు బచావత్‌ ట్రిబ్యునల్ ఆర్డర్‌ ఆధారంగా రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లాలని ఆలోచించిన పార్టీ టీడీపీ అన్నారు. తెలుగుగంగా, హంద్రీనీవా, నగరి, గాలేరు ప్రాజెక్టులు టీడీపీ ప్రారంభించిందని గుర్తు చేశారు. తాగునీటి సమస్యను నదుల అనుసంధానంతో అధిగమనిస్తామని చెప్పారు.

కియా మోటర్స్‌ కోసం ఏడాదిలో రిజర్వాయర్‌ నిర్మించి కియాను రప్పించామని, దానితో అనంతపురం ముఖచిత్రం మారిపోయిందన్నారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చి హార్టికల్చర్ ఇస్తే ఆ ప్రాంతానికి మహర్దశ వస్తుందన్నారు. బెంగుళూరు అనంతపురంకు, చెన్నై చిత్తూరుకు, కర్నూలుకు హైదరాబాద్‌ దగ్గరగా ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రాయలసీమ అద్భుతమైన రోడ్లు టీడీపీ హయంలోనే వచ్చాయన్నారు. ఓర్వకల్లులో విమానాశ్రయం నిర్మించామని, తిరుపతి విమానాశ్రయాన్ని విస్తరించామని, కడప రన్‌వే విస్తరించి నైట్ ల్యాండింగ్‌ తెచ్చామన్నారు. రాయలసీమలో విద్యకు ప్రాధాన్యత ఇచ్చామని, ఐఐటీ, ఐజర్, ట్రిపుల్ఐటీ కర్నూలులో, అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీ, ఉర్దూ యూనివర్శిటీ కర్నూలులో పెట్టామన్నారు. ప్రజాగళంలో చెప్పిన మిషన్ రాయలసీమకు కట్టుబడి ఉన్నామన్నారు.

రాయలసీమలో నీటి సరఫరాకు 90శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకాలు ఇచ్చామని, గత ప్రభుత్వం వాటిని రద్దు చేశారని, రాయలసీమకు ఎలాంటి పథకాలు లేకుండా చేశారన్నారు. కొప్పర్తి-ఓర్వకల్లులో రూ5వేల కోట్లతో ఇండస్ట్రియల్ హబ్ వస్తోందన్నారు. ఓర్వకల్లులో డ్రోన్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రంగా చేస్తామన్నారు. కర్నూలు నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. కర్నూలులో హైకోర్టు బెెంచ్ ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని సభ్యులు మద్దతివ్వాలని కోరారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగాల్సి ఉందని, దానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఉత్తరాంధ్రలో విశాఖ, రాయలసీమలో కర్నూలు అభివృద్ధి కావాలని - గతంలో రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడారన్నారు. సాధ్యమైనంత త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని దానికి అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నట్టు తెలిపారు. హైకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇందుకు అనుగుణంగా తీర్మానాలు పంపుతామని చంద్రబాబు ప్రకటించారు.

గతంలో రాళ్ల సీమలా ఉండే రాయలసీమకు నీళ్లు అందించామని చెప్పారు. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కర్నూలులోనే ఉంటాయని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని, కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకెళ్లాలని ఆలోచించింది తెలుగుదేశం పార్టీనే అన్నారు. గోదావరి-వంశధార, గోదావరి-పెన్నాను అనుసంధానిస్తామని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ఏకకాలంలో అభివృద్ధి చెందేలా చేస్తామన్నారు.

Whats_app_banner