Paddy Procurement : వరి ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతల అవస్థలు, దళారుల చేతిలో మోసపోతున్న రైతులు-medak paddy farmers facing problems in procurement less ikp centers middle man cheating ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Paddy Procurement : వరి ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతల అవస్థలు, దళారుల చేతిలో మోసపోతున్న రైతులు

Paddy Procurement : వరి ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతల అవస్థలు, దళారుల చేతిలో మోసపోతున్న రైతులు

HT Telugu Desk HT Telugu
Nov 13, 2024 10:47 PM IST

Paddy Procurement : తెలంగాణలో వరి ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు చెబుతున్నా..ధాన్యం అమ్ముకోవడానికి రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వరి ధాన్యం అమ్ముకునేందుకు అవస్థలు, దళారుల చేతిలో మోసపోతున్న రైతులు
వరి ధాన్యం అమ్ముకునేందుకు అవస్థలు, దళారుల చేతిలో మోసపోతున్న రైతులు

ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్రభుత్వ అధికారులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా, ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఐకేపీ సెంటర్లలో రోజుల తరబడి పడిగాపులు

ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేసినా ఒక చోట లారీల కొరత, మరో చోట మిల్లుల వద్ద ధాన్యం రోజుల తరబడి దించకపోవడంతో రైతుల సమస్య మరింత పెరుగుతుంది. దీనికి తోడు అకాల వర్షాల సూచనతో రైతులు పండించిన పంటను ఎలా కాపాడుకోవాలా అని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యల మధ్య సతమతమవుతూ చేసేదేమి లేక చివరికి తక్కువ రేటుకు దళారులకు అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం రైతు ధాన్యాన్ని పండించడం కంటే, పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు.

చెబుతున్నది ఒక్కటి, జరిగేది మరొక్కటి

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో అధికారులు ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో అది కనపడటం లేదు. సిద్దిపేట జిల్లాలో 419 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. కానీ కొనుగోలు కేంద్రాల్లో అనుకున్న స్థాయిలో కొనుగోలు జరగడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో ఎక్కువ శాతం రైతులు ప్రైవేట్ వ్యాపారులకు, మిల్లులకు అమ్ముకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 2,548 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 59.10 కోట్లు కాగా, ఇప్పటివరకు రైతులకు రూ. 13.60 కోట్లు మాత్రమే చెల్లించింది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 214 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 18,875మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ధాన్యం విలువ రూ. 43. 30 కోట్లు కాగా, రైతుల ఖాతాల్లో రూ.10. 70 కోట్లు మాత్రమే జమ చేశారు.

రైతుల రాస్తారోకో

బుధవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రోడ్డుపై రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటివరకు 2 లారీల ధాన్యాన్ని మాత్రమే కొనుగొలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారే తప్ప కొనుగోళ్లు జరగడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు చేయాలనీ, లేని పక్షంలో రామాయంపేటలో వేల మందితో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని రైతులు హెచ్చరించారు. మరొక వైపు, తొనిగండ్ల గ్రామా రైతులు అక్కన్నపేట్ నుండి చిన్న శంకరంపేట్ రోడ్డు పై బయటినుంచి తమ నిరసన వెలిబుచ్చారు. వవరికి మద్దతు ధర రూ 2,320 నిర్ణయించగా, రైతులు రూ 1,700 నుండి రూ 2,000 కు దళారులకు అమ్ముకుంటున్నారు. మద్దతు ధర లభించకపోవడంతో, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం