తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Central Govt Schemes : పెట్టుబడి సాయం, తక్కువ వడ్డీ రుణాలు, పెన్షన్ - రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు

Central Govt Schemes : పెట్టుబడి సాయం, తక్కువ వడ్డీ రుణాలు, పెన్షన్ - రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు

31 August 2024, 15:33 IST

google News
    • Central Govt Schemes For Farmers : రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు ముఖ్యమైన పథకాలను అమలు చేస్తుంది. రైతులకు పెట్టుబడి సాయం, తక్కువ వడ్డీతో రుణాలు, సబ్సిడీపై రుణాలు అందించేందుకు పలు పథకాలను అందుబాటులో తెచ్చింది. అలాగే రైతులకు పెన్షన్ ఇచ్చే పథకాన్ని కూడా కేంద్రం అమలు చేస్తుంది.
పెట్టుబడి సాయం, తక్కువ వడ్డీ రుణాలు, పెన్షన్ - రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు
పెట్టుబడి సాయం, తక్కువ వడ్డీ రుణాలు, పెన్షన్ - రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు

పెట్టుబడి సాయం, తక్కువ వడ్డీ రుణాలు, పెన్షన్ - రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు

Central Govt Schemes For Farmers : కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, ఆర్థిక అవసరాల్లో ఊతం ఇచ్చేందుకు పలు పథకాలను అమలు చేస్తుంది. రైతుల ఆదాయాలను పెంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాలను అమల్లోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన పలు ముఖ్య పథకాలను గురించి తెలుసుకుందాం.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN)

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.6 వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. మూడు విడతల్లో(రూ.2000 చొప్పున) పీఎం కిసాన్ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకాన్ని ఫిబ్రవరి 24, 2019న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ. 2.81 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా 11 కోట్ల మందికి పైగా రైతులకు అందించింది కేంద్రం. దేశంలోని ఏ రైతు అయినా పీఎం కిసాన్ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ లో మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (PM KMY)

ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన (PMKMY) పథకాన్ని పేద రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించడానికి సెప్టెంబర్ 12, 2019న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పీఎం కిసాన్ మాన్ ధన్ కాంట్రిబ్యూటరీ స్కీమ్. చిన్న, సన్నకారు రైతులు నెలవారీగా పెన్షన్ ఫండ్‌కు సబ్‌స్క్రిప్షన్ చెల్లించడం ద్వారా సభ్యుడిగా చేరవచ్చు. కేంద్ర ప్రభుత్వం కొంత నగదును జోడిస్తుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల రైతులు నెలకు రూ. 55 నుంచి రూ.200 వరకు వారికి 60 ఏళ్లు వచ్చే వరకు కట్టాలి. రైతులకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 3000 పెన్షన్ కేంద్రం అందిస్తుంది. ఇప్పటి వరకు 23.38 లక్షల మంది రైతులు ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని 2016లో ప్రారంభించారు. పంట వేసినప్పటి నుంచి కోత తర్వాత వరకు ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులకు రక్షణగా ఈ పథకం రిస్క్ కవర్‌ను అందిస్తుంది. పంటలకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. మొత్తం 5549.40 లక్షల రైతులు బీమా సదుపాయం పొందుతున్నారు. 2016-17 నుంచి ఈ పథకం ద్వారా రూ. 150589.10 కోట్లు రైతులకు క్లెయిమ్‌గా చెల్లించారు.

కిసాన్ క్రెడిట్ కార్డ్

కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాన్ని 1998లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. రైతులకు వ్యవసాయ ఖర్చులకు తగిన రుణాన్ని అందిస్తుంది. రైతులకు ప్రభుత్వ సబ్సిడీతో ఏటా 4 శాతం వడ్డీతో రుణాలు అందిస్తారు. ఇప్పటి వరకు 2.5 కోట్ల మంది రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ ద్వారా లబ్ధి పొందారు. బ్యాంకులు ఈ కార్డులను అందిస్తున్నాయి.

పరంపరగత్ కృషి వికాస్ యోజన

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా రైతులు హెక్టారుకు రూ.50 వేల ఆర్థిక సాయం పొందవచ్చు. సేంద్రీయ ఉత్పత్తి, ఆర్గానిక్ ప్రాసెసింగ్, సర్టిఫికేషన్, లేబులింగ్, ప్యాకేజింగ్, రవాణా కోసం ప్రతి మూడేళ్లకు ఈ ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించి సేంద్రీయ వ్యవసాయాన్ని కేంద్రం పోత్సహిస్తోంది.

సవరించిన వడ్డీ రాయితీ పథకం

వడ్డీ రాయితీ పథకం (ISS) ద్వారా పశుపోషణ, పాడి, మత్స్య పరిశ్రమ వంటి వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు రైతులకు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో రూ.3 లక్షలు వరకు రుణాలు అందిస్తారు. ఈ రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తే వడ్డీ రేటును ఏడాది 4%కి తగ్గిస్తారు. మిగిలిన 3 శాతం వడ్డీ కేంద్రం చెల్లిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డ్‌లు కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు పంట కోత తర్వాత మరో ఆరు నెలల కాలానికి ఈ పథకం వర్తిస్తుంది.

ప్రధాన మంత్రి కిసాన్ నీటిపారుదల పథకం

నీటి పారుదలకి సంబంధించిన ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రతి పొలానికి నీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. మైక్రో ఇరిగేషన్ కింద నీటిపారుదలలో భాగంగా రైతులకు ఆర్థిక సహాయం చేస్తారు. సూక్ష్మ నీటిపారుదల పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు 55%, ఇతర రైతులకు 45% నిధులు అందిస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయి. నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తారు. రైతులు వ్యక్తిగత, కమ్యూనిటీ స్థాయిలలో నీటి సేకరణకు నిర్మాణాలు చేపట్టడం, నీటిని ఎత్తివేసే పరికరాలు, వ్యవసాయ చెరువును తవ్వడం వంటి ప్రయోజనాలను కూడా ఈ పథకం ద్వారా పొందవచ్చు.

తదుపరి వ్యాసం