PM Kisan Amount Increase : పీఎం కిసాన్ డబ్బులు పెంచుతారా? బడ్జెట్‌లో కీలక నిర్ణయం ప్రకటిస్తారా?
PM Kisan Amount : మోదీ ప్రభుత్వం మూడోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనుంది. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని ఏమైనా పెంచుతారా లేదా అనేది చాలా మందికి ఆసక్తిగా ఉంది.
మరికొద్ది రోజుల్లో మోదీ ప్రభుత్వం మూడోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందరి దృష్టి ఈ బడ్జెట్ పైనే ఉంది. ఈ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం రైతులకు భారీ కానుకలు ఇవ్వనుందని అంటున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని పెంచవచ్చని సమాచారం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను నిరంతరం కలుస్తున్నారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రభుత్వం రూ.6000 నుంచి రూ.8000కు పెంచవచ్చని పలు నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులకు 3 విడతలుగా రూ.2 వేల చొప్పున ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా 11 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు.
మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోదీ ఈ ఫైలుపై మొదట సంతకం చేశారంటే ఈ పథకానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రధాని మోదీ వారణాసి నుంచి ప్రారంభించారు. ఈసారి మోదీ ప్రభుత్వం రూ.20 వేల కోట్లను నేరుగా అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేసింది.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన మొదటి టర్మ్ చివరి నెలల్లో 2019 లో ఈ పథకాన్ని ప్రారంభించింది. 2019 ఫిబ్రవరి 24న ప్రధాని దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పథకం ద్వారా కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి రూ.3 లక్షల కోట్లకు పైగా బదిలీ చేశారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది రైతులకు సాయం చేసే పథకం. దీనితో చిన్న, సన్నకారు రైతులకు కనీస ఆదాయ మద్దతుగా సంవత్సరానికి రూ.6000 అందిస్తున్నారు. అయితే తాజాగా ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఈ మెుత్తాన్ని 8 వేలకు పెంచుతారని వార్తలు వస్తున్నాయి.