PM Kisan Funds : రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు, రేపు వారణాసిలో బటన్ నొక్కనున్న ప్రధాని మోదీ-varanasi prime minister modi released pm kisan 17th installment funds to farmers account ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Kisan Funds : రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు, రేపు వారణాసిలో బటన్ నొక్కనున్న ప్రధాని మోదీ

PM Kisan Funds : రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు, రేపు వారణాసిలో బటన్ నొక్కనున్న ప్రధాని మోదీ

Bandaru Satyaprasad HT Telugu
Jun 17, 2024 10:53 PM IST

PM Kisan Funds : దేశవ్యాప్తంగా 9.26 కోట్ల మందికి పైగా రైతులకు రూ.20 వేల కోట్లకు పైగా పీఎం కిసాన్ నిధులు మంగళవారం జమకానున్నాయి. ప్రధాని మోదీ మంగళవారం వారణాసిలో పీఎం కిసాన్ 17వ విడత నిధులు విడుదల చేయనున్నారు.

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు
రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు

PM Kisan Funds : కేంద్రప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ నిధులను మంగళవారం(జూన్ 18న) విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం పీఎం కిసాన్ పథకం 17వ విడత నిధులను విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా 9.26 కోట్ల మందికి పైగా రైతులకు రూ.20,000 కోట్లకు పైగా ప్రయోజనం చేకూరుతుంది. మరోవైపు వ్యవసాయ (కృషి) సఖి శిక్షణ పొందిన 30,000 మందికిపైగా స్వయం సహాయ సంఘాల మహిళలకు ధ్రువీకరణ పత్రాలను ప్రధాని మోదీ ప్రదానం చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగాగల 732 వ్యవసాయాభివృద్ధి కేంద్రాలు (కేవీకే), లక్షకుపైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల సార్వత్రిక సేవా కేంద్రాల ద్వారా మొత్తం 2.5 కోట్ల మందికి పైగా రైతులు వీడియో మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.

వ్యవసాయ సఖి ధ్రువీకరణ పత్రాలు

మరోవైపు ఎంపిక చేసిన 50 కేవీకేలలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలోనూ రైతులు పాల్గొంటారు. ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు ఆయా కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, కొత్త సాంకేతికతలు, వాతావరణ ప్రతికూలతలను తట్టుకోగల వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. అలాగే ‘పీఎం-కిసాన్’ లబ్ధిదారులకు తమ అకౌంట్ స్టేటస్, నిధుల జమను చూసుకోవడం, ‘కిసాన్-ఇమిత్ర చాట్‌బాట్’ వినియోగించే విధానం వంటివి కూడా నేర్పుతారు. ఈ కేంద్రాల పరిధిలో ‘వ్యవసాయ సఖి’ శిక్షణ పొందిన మహిళలకు కేంద్రమంత్రులు ధ్రువీకరణ పత్రాలను ప్రదానం చేస్తారు.

100 రోజుల ప్రణాళిక

కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అన్నదాతకు ప్రధాని మోదీ నిరంతరం చేయూత అందిస్తున్నారన్నారు. ఆ మేరకు 2019లో మోదీ శ్రీకారం చుట్టిన ‘పీఎం-కిసాన్’ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా నగదు జమ చేస్తున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ శాఖ బాధ్యతను తనకు అప్పగించడంపై ప్రధానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో నేటికీ వ్యవసాయ రంగంలోనే అత్యధిక ఉపాధి అవకాశాలు లభిస్తుందని పేర్కొన్నారు. దేశ ఆహార నిల్వలను సమర్థంగా నిర్వహించడంలో రైతులు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. రాబోయే 100 రోజుల ప్రణాళిక సహా నిరంతర కృషి, వ్యూహాత్మక ప్రణాళికలు వ్యవసాయ రంగ ప్రగతిపై ప్రభుత్వ అంకితభావానికి నిదర్శనమన్నారు.

11 కోట్ల మంది రైతులకు రూ.3.24 లక్షల కోట్లు

దేశంలో అధిక ఆదాయం గల రైతులు మినహా భూకమతాలున్న రైతులందరి ఆర్థిక అవసరాలకు తోడ్పాటు అందించేందుకు ‘పీఎం-కిసాన్’ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించామన్నారు. దీనికింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున ఏటా రూ.6,000 ఆర్థికసాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఇప్పటిదాకా దేశంలోని 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.3.04 లక్షల కోట్లకుపైగా లబ్ధి చేకూరిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివారజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. తాజాగా 17వ విడత నిధుల విడుదలతో కలిపి లబ్ధిదారులకు బదిలీ అయిన మొత్తం రూ.3.24 లక్షల కోట్లకు పైగా లెక్క తేలుతుందన్నారు.

WhatsApp channel