SC Categorisation: ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని తేల్చిన కేంద్ర ప్రభుత్వం
SC Categorisation: తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలంగా నలుగుతున్న షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ రాజ్యాంగ నిబంధనల ప్రకారం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి నారాయణ స్వామి పార్లమెంటులో ప్రకటించారు.
SC Categorisation: ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగం అనుమతించదని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి నారాయణ స్వామి పార్లమెంటులో ప్రకటించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసిన కమిషన్ రాజ్యాంగ సవరణను సూచించినట్లు పార్లమెంటులో ప్రకటించారు.
ఎస్సీ వర్గీకరణ వ్యవహారంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఏపీలో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం గతంలో ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్ ఎస్సీ కులాలను వర్గీకరించి, ఉప వర్గీకరణ చేయడానికి ఆర్టికల్ 341ని సవరించాలని సిఫార్సు చేసినట్లు వివరించారు.
గతంలో ఆంధ్రప్రదేశ్‌లో తలెత్తిన సమస్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్ చేసిన సిఫార్సులకుఅనుగుణంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 20రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు తమ స్పందన తెలియచేసినట్లు పార్లమెంటుకు తెలిపారు. ఇందులో ఏడు రాష్ట్రాలు ఎస్సీ కులాల వర్గీకరణకు సుముఖత వ్యక్తం చేశాయని, 13రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం వర్గీకరణను వ్యతిరేకించినట్లు వివరించారు. ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్య చేయలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోందని చెప్పారు.
ఎస్సీ వర్గీకరణ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కరించడానికి ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మసనానికి ఈ అంశాన్ని పంపాలని ప్రధాన న్యాయమూర్తిని కోరినట్లు తెలిపారు.
మరోవైపు తూర్పు కాపు, కళింగ వైశ్యులు, సిష్టకరణాలు, సొంది సామాజిక వర్గాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని ఎలాంటి సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని,ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్ర కుమార్ తెలిపారు. ఓబీసీ జాబితాలో చేర్పులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే వాటిని పరిశీలిస్తామని చెప్పారు.