Gokulam scheme: పాడి రైతులకు గుడ్‌న్యూస్.. 90 శాతం రాయితీ.. దరఖాస్తు చేయండిలా..
Gokulam scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో పశువుల పెంపకం దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో ఆగిపోయిన గోకులం పథకాన్ని మళ్లీ ప్రారంభించింది. పాడి రైతులకు దన్నుగా నిలవాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనేక గ్రామాల్లో పాడి పరిశ్రమపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయి. వారికి మరింత చేయాత అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలోనే గోకులం పథకాన్ని పునఃప్రారంభించారు. దీన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
90 శాతం రాయితీ..
గోకులం పథకంలో భాగంగా.. పశువుల షెడ్ల నిర్మాణానికి 90 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గొర్రెలు, మేకలు, కోళ్లకు షెడ్లు నిర్మించుకుంటే 70 శాతం రాయితీ ఇస్తుంది. యూనిట్‌కు గరిష్టంగా రూ.60,900 నుంచి రూ.2,07,000 వరకు పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద టీడీపీ ప్రభుత్వం గోకులం పేరుతో దీన్ని అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా పాడి పరిశ్రమను ప్రోత్సహించడం, పాడి రైతులకు ఆర్థికంగా సాయం అందించడం, పశువుల ఆరోగ్య సంరక్షణ, అధిక పాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం.
తక్కువ వడ్డీతో రుణాలు..
ఈ పథకంలో భాగంగా.. పాడి రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించేందుకు కూడా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. పశువుల కొనుగోలు, మేత, వైద్య సేవల కోసం రాయితీ అందివ్వనున్నారు. పాడి పరిశ్రమలో నైపుణ్యం పెంచడానికి రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. పాడి రైతులు, పాడి పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ పథకానికి అర్హులు అని అధికారులు చెబుతున్నారు. ఈ పథకంలో సబ్సిడీ, రుణాల కోసం కొన్ని నిబంధనలు ఉంటాయని.. వాటిని అనుసరించే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.
దరఖాస్తు విధానం..
ఈ పథకంలో లబ్ధి పొందడానికి జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేయవచ్చు. అలా కాకుండా.. ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు. అయితే ఈ రెండు విధానాలే కాకుండా ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించింది. స్థానిక పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ స్పష్టం చేసింది. అదీ కాకుండా ఎంపీడీవో కార్యాలయంలోనూ దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది.