AarogyaSri : రేపట్నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రుల నోటీసులు, రూ.200 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం!-amaravati ap super specialty hospitals notice to stop aarogyasri services govt released 200 crores ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Aarogyasri : రేపట్నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రుల నోటీసులు, రూ.200 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం!

AarogyaSri : రేపట్నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రుల నోటీసులు, రూ.200 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం!

Bandaru Satyaprasad HT Telugu
Aug 14, 2024 10:02 PM IST

AarogyaSri : ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. రూ.2500 కోట్ల మేర ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశాయి. దీనిపై స్పందించిన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో లక్ష్మీశ రూ.200 కోట్ల బకాయిలు విడుదల చేసినట్లు తెలిపారు.

ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రుల నోటీసులు, రూ.200 కోట్లు విడుదల
ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రుల నోటీసులు, రూ.200 కోట్లు విడుదల

AarogyaSri : ఆరోగ్య శ్రీ బకాయిలపై ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. బకాయిలు వెంటనే చెల్లించాలని, లేకుంటే ఆరోగ్య శ్రీ సేవలు నడపలేమని స్పష్టం చేశాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2500 కోట్లు చెల్లించాలని ఆరోగ్య శ్రీ ఆసుపత్రులు కోరారు. బకాయిల భారం పెరుగుతోందని, ఇకపై ఆరోగ్య శ్రీ సేవలు నడపలేమని ఆసుపత్రులు తేల్చిచెప్పాయి. ఇన్ని రోజులూ బకాయిలు పెట్టినా ప్రజలకు సేవలందించామని పేర్కొ్న్నాయి. బకాయిలు చెల్లించే వరకూ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని ప్రకటించాయి. ఇప్పటి వరకూ ఉన్న బకాయిలు చెల్లించి, ఇకపై ఎన్టీఆర్ వైద్య సేవల బిల్లులు క్రమతప్పకుండా విడుదల చేయాలని ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రభుత్వాన్ని కోరాయి. ప్రైవేట్‌ ఆసుపత్రుల అసోసియేషన్‌ ప్రతినిధులు 15 రోజుల క్రితమే ప్రభుత్వానికి నోటీసులు అందించారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రోజు వారీ ఖర్చులకు కూడా నిధులు లేవని, ఆసుపత్రులు నోటీసుల్లో పేర్కొన్నాయి.

రూ.200 కోట్లు విడుదల - ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్

ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నోటీసులపై ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో లక్ష్మీశ స్పందించారు. అనుబంధ ఆసుపత్రులకు రూ.200 కోట్ల బకాయిలు విడుదల చేసినట్లు తెలిపారు. సోమవారం మరో రూ.300 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ సేవలకు అంతరాయం కలిగించవద్దని ఆసుపత్రులను కోరారు.

ఈ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు. ఎలక్షన్ కోడ్ వల్లనే ఆరోగ్యశ్రీ నిధులను ఆసుపత్రులకు విడుదల చేయలేదని అప్పట్లో వైసీపీ అధినేత జగన్ అబద్ధాలు చెప్పారన్నారు. ఎన్నికల కోడ్ 2024 మార్చిలో వస్తే, వైసీపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ చెల్లింపులు గత సెప్టెంబరులో నిలిపివేసిందన్నారు. వైసీపీ హయాంలో చెల్లించాల్సిన బకాయిలు రూ. 2100 కోట్లు చెల్లించకుండా ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ఇబ్బంది పెట్టారన్నారు. ఆ భారం కొత్త ప్రభుత్వంపై నెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల లోనే రూ. 162 కోట్లు చెల్లించిందన్నారు. రేపు మరో 200 కోట్లు చెల్లించనుందని, వారంలో మరో రూ.300 కోట్లు చెల్లించే ప్రణాళిక ఉందన్నారు.

ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు - షర్మిల

ఆరోగ్య శ్రీ సేవలపై ఏపీసీసీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందించారు. నాడు తన పాదయాత్రలో ఖరీదైన వైద్యం దొరక్క పేదలు పడుతున్న ఇబ్బందులు చూసి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారన్నారు. అలాంటి ఆరోగ్య శ్రీ పథకం నేడు కుంటుపడే పరిస్థితికి వచ్చిందన్నారు. వైఎస్సార్ వారసులు అని చెప్పుకునే జగన్.. ఆరోగ్యశ్రీ పథకాన్ని తన పాలనలో నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా పెండింగ్ బిల్లులు చెల్లించుకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలుపై మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. తక్షణమే ఆరోగ్య శ్రీ పథకం నిలిపివేయడంపై ప్రభుత్వం స్పందించి బిల్లులు చెల్లించాలని కోరారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత కథనం