తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Free Bus Scheme : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Free Bus Scheme : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

21 December 2024, 12:56 IST

google News
    • AP Free Bus Scheme : మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చేందుకు.. కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు అవసరమైన అధ్యయన నివేదికను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. తాజాగా.. మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రవాణాశాఖ మంత్రితో పాటు, హోంశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ పథకం అమలు అవుతున్న రాష్ట్రాల్లో పర్యటించి, అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ పథకం త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఆలస్యమైనా పర్లేదు..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కొంత ఆలస్యమైనా, సమగ్ర విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. ఆర్థిక సంవత్సరంలోనే మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు, మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. దీంతో అధికారులు సమగ్ర నివేదికను రూపొందించారు. మహిళలకు ఉచితబస్సు ప్రయాణం అమలు కోసం.. అదనంగా 2 వేల బస్సులు, 3 వేల 500 మంది డ్రైవర్లు అవసరమని.. అధికారుల కమిటీ నివేదికలో పేర్కొంది. ప్రతి నెలా ఆర్టీసీ 250 నుంచి 260 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఎదురుచూస్తున్న మహిళలు..

మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్దం అవుతోందని.. టీడీపీ నేతలు చాలా రోజులుగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. దీనిపై ప్రకటన ఎప్పడు వస్తుందా అని మహిళలు, యువతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే సీఎంగా నాలుగోసారి బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు.. 5 ముఖ్యమైన హామీలైన మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పింఛన్ పెంపు.. నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధణ మీద సంతకాలు చేశారు.

సవాళ్లు ఏంటీ..

ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం త్వరలో అమలు చేయనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే అమలులో ఉన్న ఈ పథకంలోని లోటుపాట్లు గుర్తించి.. మరింత మెరుగైన రీతిలో మహిళలకు సేవలందించేందుకు సమగ్ర అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. ప్రజా రవాణాలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీకి ఎదురయ్యే సవాళ్లు ఏంటీ? అనే చర్చ జరుగుతోంది.

షర్మిల డిమాండ్..

రాష్ర్టంలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని.. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇటీవల డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోస్ట్ కార్డు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళలు విజ్ఞప్తి చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి మహిళా ప్రయాణికులతో కలిసి ఇటీవల ఆమె ప్రయాణించారు. బస్సులో టిక్కెట్ కొని మహిళలకు ఉచిత ప్రయాణం ఎక్కడ అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తదుపరి వ్యాసం