AP Politics : బాలినేని పరిస్థితి ఏంటీ ఇలా అయ్యింది.. ఆయన్ను మళ్లీ తీసుకోవద్దనే డిమాండ్ ఎందుకొస్తుంది?
23 September 2024, 5:40 IST
- AP Politics : వైసీపీలో గౌరవం దక్కడం లేదని.. అందుకే పార్టీని వీడుతున్నానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. జనసేన తలుపు తట్టారు. పవన్ ఓకే చెప్పడంతో కూల్ అనుకున్నారు. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. అది ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో ఆయన్ను మళ్లీ తీసుకోవద్దని వైసీపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది.
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా బాలినేని
కారణాలు ఏమైనా.. ఇన్నాళ్లు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. వైసీపీని వీడి జనసేన తలుపు తట్టారు. పవన్ డోర్ ఓపెన్ చేయడంతో.. హమ్మయ్య ఇక అంతా ఓకే అనుకున్నారు. కానీ.. ఒంగోలు రాజకీయం అంత ఈజీగా లేదు. బాలినేని రాకకు జనసేన వెల్‌కమ్ చెప్పినా.. టీడీపీ మాత్రం నో ఎంట్రీ అంటోంది. అందుకు ఊదాహరణే ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే తాజా వ్యాఖ్యలు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరడం ఖరరాయ్యాక.. ఒంగోలులో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిల్లో పవన్, చంద్రబాబు, మోదీతో సహా.. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఫొటోలు కూడా ఉన్నాయి. ఇక్కడే రచ్చ స్టార్ట్ అయ్యింది. తాను ఇన్ని రోజులు పోరాడిన బాలినేని ఫ్లెక్సీల్లో.. తన ఫొటో వేయడం ఏంటని దామచర్ల ఫైర్ అయ్యారు. ఫ్లెక్సీల ఏర్పాటు నేపథ్యంలో.. కీలక వ్యాఖ్యలు చేశారు.
'వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పోరాటం చేశాం. ఒంగోలులో టీడీపీ శ్రేణులపై బాలినేని అక్రమ కేసులు పెట్టించారు. నాపై 32 కేసులు పెట్టారు. మా నాయకుడు చంద్రబాబుని దూషించారు. అధికారం పోయి 100 రోజులు గడవకముందే బాలినేని పార్టీ మారుతున్నారు. ప్రకాశం జిల్లాలో వైసీపీని బాలినేని సర్వనాశనం చేశారు. జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీలో కి వెళ్లినా కేసుల్లో నుండి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆయన కొడుకు తప్పించుకో లేరు' అని దామచర్ల హాట్ హాట్ కామెంట్స్ చేశారు. అక్కడితో ఆగలేదు..
'గత ఐదేళ్లలో బాలినేని చేసిన అక్రమాలను బయటకు తీస్తాం. బాలినేని చేసిన అక్రమాల నుండి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకి అండగా ఉంటాం. పార్టీలు మారే పరిస్థితి వస్తే మేము రాజకీయాలు కూడా మానుకుంటాం' అని దామచర్ల జనార్థన్ స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
టీడీపీ, జనసేన ప్రస్తుతం కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. టీడీపీ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. కూడమి గొడవ ఎలా ఉన్నా.. వైసీపీ క్యాడర్ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తోంది. బాలినేని కారణంగా ప్రకాశం జిల్లాలో పార్టీకి నష్టం జరిగిందని వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. ఆయన్ను మాత్రం మళ్లీ పార్టీలోకి అస్సలు తీసుకోవద్దని జగన్‌ను కోరుతున్నారు. మళ్లీ వచ్చినా ఆయన వల్ల పార్టీకి నష్టమే అనే అభిప్రాయాలను వైసీపీ క్యాడర్ వ్యక్తం చేస్తోంది.
కేసులకు భయపడ్డారా..
బాలినేని అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులను వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని చాలామంది నేతలు చూస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. అటు ఆయన కుమారుడిపైనా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పేద వర్గాల దుకాణాలు కూలగొట్టించారనే.. కావాలనే ఆ పని చేశారనే విమర్శలున్నాయి. ఆ ఎఫెక్ట్ ఎన్నికలపైనా పడింది. దీంతో ఇప్పుడున్న ప్రభుత్వం కేసులు పెడుతుందని భయపడే బాలినేని పార్టీ మారారని ఒంగోలులో చర్చ జరుగుతోంది.
ఇప్పుడే ఇలా ఉంటే.. తర్వాత ఎలా..
బాలినేని రాకను జనసేన స్వాగతించినా.. టీడీపీ మాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ఏకంగా ఎమ్మెల్యేనే ఘాటు వ్యాఖ్యలు చేయడంతో.. బాలినేని భవిష్యత్తు ఏంటనే చర్చ నడుస్తోంది. ఇప్పుడే బాలినేనికి చెక్ పెట్టాలని.. లేకపోతే భవిష్యత్తులో తమకు ఇబ్బంది అవుతుందని టీడీపీ నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆయన ఏ పార్టీలో ఉన్నా.. వదిలేది లేదని టీడీపీ నాయకులు అంతర్గత చర్చల్లో మాట్లాడుకున్నట్టు తెలిసింది. దీంతో వైసీపీలో కీలక నేతగా ఉన్న బాలినేని పరిస్థితి ఏంటి ఇలా అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.