Ongole EVMs Issue: నిలిచిన ఒంగోలు ఈవిఎం రీ వెరిఫికేషన్, హైకోర్టుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్-ongole evm re verification ex minister balineni srinivas to high court ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ongole Evms Issue: నిలిచిన ఒంగోలు ఈవిఎం రీ వెరిఫికేషన్, హైకోర్టుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్

Ongole EVMs Issue: నిలిచిన ఒంగోలు ఈవిఎం రీ వెరిఫికేషన్, హైకోర్టుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్

HT Telugu Desk HT Telugu
Aug 20, 2024 11:03 AM IST

Ongole EVMs Issue: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) రీ వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ ఆగిపోయింది. అస‌లు ఎందుకు అగిపోయింద‌నేది ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) స్ప‌ష్టం చేసింది. అయితే ఈవీఎం రీ వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ‌పై మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించారు.

ఈవిఎం రీ వెరిఫికేషన్‌పై వివాదం
ఈవిఎం రీ వెరిఫికేషన్‌పై వివాదం

Ongole EVMs Issue: గత మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఈవీఎం మెషిన్ల‌ పనితీరుపై అనుమానాలు ఉన్నాయ‌ని మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాసరెడ్డి కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని ఆశ్ర‌యించారు. దీనికి సంబంధించి కొంత మొత్తం కూడా చెల్లించారు. దీనిపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డిని ఈసీ, మీ అనుమానాల‌ను నివృత్తి చేస్తామ‌ని తొలిత పేర్కొంది. అందుకు ఏర్పాట్లు చేస్తామ‌ని తెలిపింది. మ‌ళ్లీ ఏమైందో ఏమో కానీ మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డికి లేఖ రాసి, మీ ద‌ర‌ఖాస్తుని వెన‌క్కి తీసుకోవాల‌ని కోరింది.

కొన్ని రోజుల త‌రువాత మీరు లేవ‌నెత్తిన అంశాలు నిల‌బ‌డవ‌ని, అన్ని ఈవీఎంలు స‌రిగానే ఉన్నాయ‌ని, మీరు మీ ద‌ర‌ఖాస్తుని వెన‌క్కి తీసుకోవాల‌ని, మీరు చెల్లించిన మొత్తం మీకు ఇచ్చేస్తామ‌ని బాలినేని శ్రీనివాస‌రెడ్డికి ఈసీ నుంచి విజ్ఞ‌ప్తి వ‌చ్చింది. అయితే దీనికి ఆయ‌న ఒప్పుకోలేదు. సుప్రీం కోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం రీ వెరిఫికేష‌న్ చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.

సుప్రీం కోర్టు మార్గ‌ద‌ర్శ‌కాలు ప్ర‌కారం అభ్య‌ర్థి డిమాండ్ చేసిన నియోజ‌క‌వ‌ర్గంలో ఈవీఎం, వీవీప్యాడ్ స్లిప్‌ల వెరిఫికేష‌న్ చేయాల్సి ఉంటుంది. బాలినేని శ్రీనివాస‌రరెడ్డి కూడా ఈవీఎం వెరిఫికేష‌న్ చేయాల‌ని కోరారు. అందులో భాగంగానే సోమ‌వారం ఒంగోలులో ఎలక్షన్ కమిషన్ అధికారులు చేపట్టిన ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించారు. అయితే అది కొద్ది సేప‌టికే నిలిచిపోయింది. అందుకు కార‌ణం లేక‌పోలేదు.

కలెక్టర్ తమీమ్ ఇన్సారియా, ప్రత్యేక అధికారి ఝూన్సీలక్ష్మి, భెల్ సిబ్బంది ఈవీఎంల రీ వెరిఫికేష‌న్‌ ప్రక్రియ మొదలుపెట్టారు. బాలినేని తరపున ప్రతినిధులు హాజరయ్యారు. అయితే, ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు కూడా లెక్కించాలని బాలినేని ప్రతినిధులు పట్టుబట్టారు. అదే సుప్రీం కోర్టు కూడా చెబుతోంది.

కానీ అధికారులు మాత్రం బాలినేని ప్ర‌తినిధులు కోరుతున్న దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్లు లెక్కించడం కుదరదని తేల్చిచెప్పారు. తాము ఈవీఎంల్లో మాక్ పోలింగ్ మాత్ర‌మే చూపిస్తామ‌ని అధికారులు తెలిపారు. మాక్ పోలింగ్‌కు అంగీక‌రిస్తూ ఈవీఎంల డేటా డిలీట్ చేసి, మాక్ పోలింగ్ నిర్వ‌హిస్తామ‌ని పేర్కొన్నారు.

దీంతో బాలినేని తరపున హాజరైన ప్రతినిధులు లోకేష్ రెడ్డి, ఓగిరాల వెంక‌ట్రావు, సోమిరెడ్డి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈవీఎంలో ఉన్న ఓట్ల‌కు, వీవీప్యాడ్‌లో ఉన్న స్లిప్‌ల‌ను లెక్కించి తేడాలు గుర్తించాల‌ని వారు కోరారు. అందుకు అధికారులు అంగీక‌రించలేదు. లెక్కింపు కేంద్రం నుంచి బాలినేని ప్ర‌తినిధులు వెళ్లిపోయారు. దీంతో ఈవీఎం రీవెరిఫికేషన్ ప్రక్రియను నిలిచిపోయింది.

ఈ వ్య‌వ‌హారంపై మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస రెడ్డి వెంట‌నే హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈవీఎంల రీ చెకింగ్ పై హైకోర్టులో బాలినేని దాఖలు చేసిన రిట్ పిటిషన్ మంగళవారం వాయిదా పడింది. ఈవీఎంలను మాక్ పోలింగ్ పద్ధతిలో కాకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ లు కూడా లెకించాలంటూ మాజీ మంత్రి బాలినేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. బాలినేని తరపు న్యాయ‌వాది వాదనలు వినిపిస్తూ.. ఎలక్షన్ కమిషన్ మాక్ పోలింగ్ పద్ధతిలో ఈవీఎంల చెకింగ్ చేపట్టిందని, అది సరికాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై బుధవారం తమ వాదనలు వినిపిస్తామని ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాది చెప్పడంతో కోర్టు ఈ కేసు విచారణను మంగ‌ళ‌వారానికి వాయిదా వేసింది.

ఏపిలో 13 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేష‌న్‌కు వైసీపీ విజ్ఞ‌ప్తి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం లోక్‌సభ పరిధిలో రెండు పోలింగ్ కేంద్రాల్లో, బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో వెరిఫికేషన్ కోసం ఎన్నికల సంఘానికి వైసీపీ నేత‌లు దరఖాస్తు చేశారు. ఏపీలో గజపతినగరం, ఒంగోలు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో13 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయాలని వైసీపీ విజ్ఞప్తి చేసింది. విజ‌య‌న‌గ‌రం ఎంపీగా పోటీ చేసిన బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఒంగోలు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ చేసిన బానినేని శ్రీనివాస‌రెడ్డి కోరారు.

దేశవ్యాప్తంగా 11 చోట్ల ఈవిఎం వెరిఫికేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తులు చేసుకున్నారు. ప్రత్యేకించి ఎక్కడైనా రెండు లేదా మూడో స్థానంలో ఉన్న అభ్యర్థులు వారికి సందేహం కలిగితే ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజులలోపు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మొత్తం ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాల్లోని 92 పోలింగ్ కేంద్రాల్లో, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 26 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ కోసం ఎన్నిక‌ల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసిన నాలుగు వారాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అవ్వాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ నుంచి ఐదు దరఖాస్తులు అందాయని తెలిపింది.

తెలంగాణలోని జహీరాబాద్ పార్లమెంటు నియోజక వర్గంలోని 20 పోలింగ్ స్టేషన్లలో వాడిన ఈవీఎం (ఓటింగ్ మిషన్లు)లను వెరిఫికేషన్ చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందులో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నారాయణఖేడ్ లో 7, జహీరాబాద్ లో 7, ఆందోల్(ఎస్సీ)లో 6 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ దరఖాస్తులు దాఖ‌లు అయ్యాయి.

బరిస్సాలో ఝర్సుగూడ అసెంబ్లీ పరిధిలోని 13 పోలింగ్ కేంద్రాలలో వెరిఫికేషన్ చేయాలని బీజేడీ అభ్య‌ర్థి ద‌ర‌ఖాస్తు చేశారు. ఛత్తీస్‌గఢ్ లోని కాంకేర్ లోక్‌సభ పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో, హర్యానాలో కర్నల్, ఫరిదాబాద్ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో 6 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ద‌ర‌ఖాస్తు చేసుకుంది.

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోక్‌స‌భ‌ నియోజకవర్గంలో 40 పోలింగ్ కేంద్రాల్లో, తమిళనాడులోని వెల్లూర్ లోక్‌సభ నియోజకవర్గంలో 8 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయాలని బీజేపీ కోరింది. తమిళనాడులోనే విరుధ్ నగర్ లోక్‌స‌భ పరిధిలో 14 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయాలని డీఎండీకే దరఖాస్తు చేసింది.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)