Balineni : ‘జనసేనలో చేరుతాను.. అటువైపు నుంచి రాంగ్ గా మాట్లాడితే అన్ని బయటపెడతా’ - బాలినేని కీలక వ్యాఖ్యలు-balineni srinivasa reddy announced that he will join the janasena soon ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Balineni : ‘జనసేనలో చేరుతాను.. అటువైపు నుంచి రాంగ్ గా మాట్లాడితే అన్ని బయటపెడతా’ - బాలినేని కీలక వ్యాఖ్యలు

Balineni : ‘జనసేనలో చేరుతాను.. అటువైపు నుంచి రాంగ్ గా మాట్లాడితే అన్ని బయటపెడతా’ - బాలినేని కీలక వ్యాఖ్యలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 19, 2024 08:29 PM IST

వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన అధినేత పవన్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన… మంచిరోజు చూసుకొని జనసేనలో చేరుతానని ప్రకటించారు. వైసీపీ నేతలు తనపై రాంగ్ గా మాట్లాడితే అన్ని విషయాలను బయటపెడతానని కామెంట్స్ చేశారు.

జనసేన అధినేత పవన్ తో బాలినేని
జనసేన అధినేత పవన్ తో బాలినేని

త్వరలోనే మంచిరోజు చూసి జనసేన పార్టీ లో చేరుతానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గురువారం ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో బాలినేని భేటీ అయ్యారు. దాదాపు గంటకుపైగా చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… పార్టీలోకి పవన్ ఆహ్వానించారని చెప్పారు. త్వరలోనే మంచిరోజు చూసి జనసేన పార్టీ లో చేరుతానని… ఒంగోలు వేదికగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.

నో డిమాండ్స్…

చేరిక కార్యక్రమానికి పవన్ కల్యాణ్ వస్తారని బాలినేని చెప్పారు. ఇదే వేదికగా చాలా మంది కార్పొరేటర్ లు జనసేనలో జాయిన్ అవుతారన్నారు. పవన్ కోసం కాదని…పవన్ కోసమే పార్టీలో చేరుతున్నట్లు ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఎలాంటి డిమాండ్లు లేకుండా జనసేనలోకి వెళ్తున్నానని చెప్పారు.

తనకు రాజశేఖర్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టారని… అలాంటి కుటుంబానికి కష్టకాలంలో అండగా ఉన్నానని బాలినేని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్నానని చెప్పారు. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జగన్ కోసం పని చేశారని అన్నారు. వీరిలో ఎంత మంది జగన్ మంత్రివర్గంలో ఉన్నారని బాలినేని ప్రశ్నించారు.  పవర్ కోసం పాకులాడే వ్యక్తి బాలినేని కాదని మరో ప్రశ్నకు బదులిచ్చారు.

'పవన్ ఆహ్వానించారు.. జనసేనలో చేరుతాను. జగన్ ను ఎలాంటి డబ్బులు అడగలేదు. పార్టీ కోసం నా ఆస్తులను పొగొట్టుకున్నాను. రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది. అటువైపు నుంచి ఏదైనా రాంగ్ గా  మాట్లాడితే నేను కూడా బదులిస్తా. అన్ని విషయాలు బయటపెడతాను. జనసేన కోసం పని చేస్తాను. పవన్ ను ఎలాంటి పదవులు అడగలేదు" అని బాలినేని వ్యాఖ్యానించారు.

వైసీపీలో కీలక నేతగా ..

ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఎన్నికలకు ముందు కూడా ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది. కానీ.. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం లేదు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారుతారనే చర్చ మళ్లీ జోరందుకుంది. ఈ క్రమంలోనే గత వారం పార్టీ అధినేత జగన్మోహ్ రెడ్డి నుంచి బాలినేనికి పిలుపు వచ్చింది. జగన్‌తో చర్చలు అసంపూర్తిగా ముగిసినట్టు తెలిసింది. ఇంతలోనే పార్టీని వీడుతున్నట్లు బాలినేని రాజీనామా లేఖను విడుదల చేశారు.

2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. తొలి మంత్రివర్గంలోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చోటు దక్కింది. విద్యుత్, అటవీ శాఖ మంత్రిగా ఆయన రెండున్నరేళ్లు పని చేశారు. ఆ తర్వాత మంత్రి వర్గంలో మార్పులు జరిగాయి. అప్పుడు బాలినేనికి అవకాశం దక్కలేదు. అటు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి వాళ్లను జగన్ మంత్రి వర్గంలో కొనసాగించారు. దీంతో బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి మళ్లీ అవకాశం ఇచ్చి.. తనకు ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు.

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఆయన తన అనుచరులను ఎమ్మెల్యేగా గెలిపించుకునే సత్తా ఉన్న నేత. అటు 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాలినేని చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదనే అసంతృప్తి కూడా ఉంది. తాను కాకుండా వేరే వాళ్లు చెప్పిన వారికి టికెట్ ఇవ్వడంతో బాలినేని బహిరంగంగానే అంసతృప్తి వ్యక్తం చేశారు. అటు జిల్లాకు చెందిన ఓ మాజీమంత్రి తోనూ బాలినేనికి పొసగడం లేదని వార్తలు వచ్చాయి. ఇవన్నీ కారణాలతో ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే బుధవారం తన రాజీనామా లేఖను జగన్ కు పంపారు.